సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓటర్ల తీర్పు విలక్షణంగా ఉంది. ఓ వైపు అసెంబ్లీలో బీజేపీ స్థానాలు 3 నుంచి రెట్టింపయి 8కి పెరిగే దిశగా ఉండగా మరోవైపు ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ముగ్గురు ఎంపీలు ఓటమి పాలయ్యారు. కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, కోరుట్ల నుంచి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, బోథ్ నుంచి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ఓటమి పాలయ్యారు.
కాంగ్రెస్ హవా నడిచిన ఈ ఎన్నికల్లో బీజేపీ ఎంపీలు ముగ్గురు బీఆర్‌ఎస్ అభ్యర్థుల చేతిలో ఓటమి పాలవడం గమనార్హం. కరీంనగర్ నుంచి ఎంపీ బండి సంజయ్, మంత్రి గంగుల కమలాకర్ చేతిలో ఓటమి పాలయ్యారు.కోరుట్లలో ఎంపీ అర్వింద్ బీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ మీద, బోథ్ నుంచి ఎంపీ సోయం బాపూరావు బీఆర్‌ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్ చేతిలో ఓడిపోయారు.
ఇక ఇదే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ముగ్గురు ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి గెలుపొందడం విశేషం. బీజేపీ నుంచి పోటీచేసిన ముగ్గురు ఎంపీలు ఓటమి పాలవడం మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసిన ముగ్గురు ఎంపీలు ఎమ్మెల్యేలుగా గెలుపొందడం ఓటర్లు ఇచ్చిన విలక్షణ తీర్పుగా రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. కాగా, దుబ్బాక నుంచి బీఆర్‌ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీచేసిన మెదక్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై గెలుపొందారు.
Comments
Please login to add a commentAdd a comment