సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర కాంగ్రెస్ నేతల భవిష్యత్తును నిర్దేశించనున్నాయి. కనీస స్థాయిలో ఓట్లు, సీట్లు దక్కించుకునే వారికే పదవులపరంగా పార్టీలో ఇబ్బంది ఉండదని, ప్రతికూల ఫలితాలు వస్తే మాత్రం కీలక నేత భవిష్యత్తుపై కచ్చితంగా ప్రభావం ఉంటుందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. ఈసారి లోక్‌సభ బరిలో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలను అధిష్టానం బరిలో దింపింది కూడా ఇదే వ్యూహంతోనని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీనియర్ నేత రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ అధికార ప్రతినిధి హోదాలో రాహుల్ కోటరీ నేతగా గుర్తింపు ఉన్న మధుయాష్కీ గౌడ్, కేంద్ర మాజీ మంత్రులు రేణుకా చౌదరి, బలరాం నాయక్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవిలకు పార్టీలో రాజకీయ భవిష్యత్తుపై ఎన్నికల ఫలితాల ప్రభావం ఉంటుందని చెబుతున్నా యి. ఉత్తమ్ (నల్లగొండ), కోమటిరెడ్డి (భువనగిరి), రేవంత్ (మల్కాజిగిరి) పోటీ చేసిన స్థానాల్లో గెలుపోటములు, వారికి వచ్చిన ఓట్ల ఆధారంగా అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకుంటుందని, ఆ స్థానాల్లో గెలిచిన నేతకు పార్టీ రాష్ట్ర పగ్గాలు ఇచ్చినా ఆశ్చర్యం లేదని గాంధీ భవన్ వర్గాలంటున్నాయి.
ఉత్తమ్‌కు ఊరట లభించేనా...?
ఈసారి లోక్‌సభ ఎన్నికలు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి కీలకం కానున్నాయి. ఉత్తమ్ ఆధ్వర్యంలో ఎదుర్కొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలైనా అధిష్టానం ఆయనపై చర్యలకు పూనుకోకపోగా లోక్‌సభ ఎన్నికల రూపంలో రాహుల్ గాంధీ ఆయనకు మరో పరీక్ష పెట్టారని పార్టీ వర్గాలంటున్నాయి. ఆయనే పట్టుబట్టి మరీ నల్ల గొండ లోక్‌సభ నుంచి ఉత్తమ్‌ను పోటీ చేయించారని, ఇప్పుడు ఫలితం తారుమారైతే టీపీసీసీ చీఫ్ మార్పు అంశం మళ్లీ తెరపైకి వస్తుందని అంటున్నారు. ఎమ్మెల్యే పదవిని పణంగాపెట్టి మరీ ఉత్తమ్‌ను లోక్‌సభ బరిలో దింపగా ఆయన గెలిస్తే అదే ఊపు మీద హుజూర్‌నగర్ అసెంబ్లీని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంటుందని, లేదంటే ఆయన ఎమ్మెల్యేగానే మిగిలే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
టీపీసీసీ అధ్యక్షుడి రేసులో ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ సమర్థతకు కూడా ఈ ఎన్నికలు పరీక్ష కానున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పట్టుబట్టి తెచ్చుకున్న ఐదు స్థానాల్లో కేవలం రెండింటినే వారు గెలుచుకోగా వాటిలో వెంకట్‌రెడ్డి ఓటమిపాలయ్యారు. అయినా పట్టుబట్టి ఆయన భువనగిరి లోక్‌సభ టికెట్ తెచ్చుకున్నారు. తన సోదరుడు, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సహకారంతో లోక్‌సభ బరిలో దిగిన వెంకటరెడ్డి... ఈ ఎన్నికల్లనూ ఓడిపోతే పార్టీలో కూడా సైలెంట్‌గానే ఉండాల్సి వస్తుందని, వచ్చే ఎన్నికల వరకు అలాగే కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనే చర్చ పార్టీలో జరుగుతోంది.
రేవంత్‌కు కీలకం...
మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తున్న రేవంత్‌రెడ్డి భవిష్యత్తుకు కూడా ఎన్నికల ఫలితాలు కీలకం కానున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ ఓటమిపై ఆశ్చర్యపోయిన రాహుల్ గాంధీ... రేవంత్‌కున్న ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకొని గెలుపు అవకాశాలున్న మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి ఆయనకు మరో అవకాశమిచ్చారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రేవంత్ గెలిస్తే పార్టీలోనూ, రాష్ట్ర రాజకీయాల్లోనూ కీలకంగా మారతారని, లేదంటే ఆయన మరోసారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వచ్చే వరకు ఎదురుచూడాల్సిందేననే చర్చ జరుగుతోంది. మొత్తంమీద ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌లో ఎవరు గెలుస్తారు.. ఓడిపోతారనే దాన్ని బట్టి రాష్ట్రంలో పార్టీ భవిష్యత్తు, నాయకత్వం ఆధారపడి ఉంటుందని గాంధీ భవన్ వర్గాలంటున్నాయి.
వారి భవిష్యత్తూ ప్రశ్నార్థకమే!
ఖమ్మం నుంచి పోటీ చేసిన కేంద్ర మాజీ మంత్రి రేణుక, నిజామాబాద్ నుంచి బరిలో నిలిచిన మధుయాష్కీ గౌడ్, నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్‌కు సైతం ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం కానున్నాయి. ఖమ్మం జిల్లాలో ఉన్న గ్రూపు గొడవలు, టికెట్ల కోసం పోటీని తట్టుకొని సోనియా కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యంతో రేణుకా చౌదరి చివరి నిమిషంలో ఎంపీ టికెట్ తెచ్చుకోగలిగారు. సొంత ఇమేజ్‌పై గెలిచి వస్తానని అధిష్టానానికి ఆమె మాటిచ్చారు. ఇప్పుడు ఫలితం సానుకూలంగా వస్తే అధిష్టానం వద్ద రేణుక ఇమేజ్ పెరుగుతుందని, లేదంటే ఈసారి టికెట్ తెచ్చుకోవడం కూడా కష్టమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరో ముఖ్యనేత, రాహుల్‌కు సన్నిహితుడు అయిన మధుయాష్కీ గౌడ్ భవిష్యత్తూ ఈ ఎన్నికలతోనే ముడిపడి ఉంది. పార్టీతోపాటు నియోజకవర్గపరంగా కూడా ఆయనకు ఈ ఎన్నికలు చాలా కీలకం కానున్నాయి.
లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆయన భువనగిరి నుంచి పోటీ చేస్తారని తొలుత ప్రచారం జరగ్గా అధిష్టానం నల్లగొండ స్థానానికి ఆయన పేరును పరిశీలించి చివరికి పాత స్థానమైన నిజామాబాద్ టికెట్‌నే యాష్కీకి కేటాయించింది. ఇప్పుడు ఆయన ఓడిపోతే నియోజకవర్గంలో భవిష్యత్తు గడ్డుగానే మిగిలిపోతుందని అంటున్నారు. కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కోరిమరీ టికెట్ తెచ్చుకుని మహబూబాబాద్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినా అధిష్టానం ఆయనకు మహబూబాబాద్ లోక్‌సభ టికెట్ ఇచ్చింది.
ఇప్పుడు గెలిస్తే నాయక్ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ కేంద్ర మంత్రి స్థాయిలో కొనసాగవచ్చని లేదంటే ఆయన భవిష్యత్తూ అంధకారమేననే చర్చ జరుగుతోంది. ఎప్పుడూ జడ్చర్ల అసెంబ్లీ నుంచి పోటీ చేసే టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వుడు స్థానమైన నాగర్‌కర్నూల్ నుంచి పోటీ చేశారు. ఇప్పటికే చాలాసార్లు ఓడిన ఆయన మళ్లీ ఎంపీగా పోటీ చేశారని, ఇప్పుడు ఓడిపోతే ఈసారి జడ్చర్ల అసెంబ్లీ సీటు కూడా కష్టమేనని పార్టీలో చర్చ జరుగుతోంది. మొత్తంమీద రాష్ట్ర కాంగ్రెస్‌లోని ముఖ్య నాయకుల భవిష్యత్తును మే 23న వెలువడనున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు నిర్దేశించనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment