సాక్షి, వికారాబాద్: ఎంపీ ఎన్నికల ఫలితాలు టీఆర్‌ఎస్ నాయకులకు ముచ్చెమటలు పట్టించాయి. ఫలితాలు తాము ఊహించిన విధంగా లేకపోవడంతో కొంత నిరుత్సాహానికి గురయ్యారు. మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డితోపాటు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఇటీవల ఆ పార్టీకి మద్దతుగా నిలుస్తున్న సబితా ఇంద్రారెడ్డి తమవైపే ఉండటంతో భారీ మెజార్టీ వస్తుందని భావించిన అధికార పార్టీ నాయకులకు చుక్కలు కనిపించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ మంది ఎమ్మెల్యేలను భారీ మెజార్టీతో గెలిపించారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం గులాబీ పార్టీపై విముఖత చూపారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆశించిన స్థాయిలో పని చేయకపోవడం, ప్రజల్లో వ్యతిరేకత కారణంగానే ఆ పార్టీ అభ్యర్థి ఓట్లకు గండిపడినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ దఫా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి గతంలో కన్నా ఎక్కువ ఓట్లు పోలయ్యాయి.
ఈ నేపథ్యంలో బీజేపీ టీఆర్‌ఎస్ ఓట్లను చీల్చిందనే అభిప్రాయమూ వ్యక్తమైంది. బీజేపీ ఓట్లు చీల్చినప్పటికీ టీఆర్‌ఎస్ 15వేల లోపు మెజార్టీ మాత్రమే రావడంతో సొంతపార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మెజార్టీ తగ్గడంపై ఎంపీ రంజిత్‌రెడ్డి సైతం తన అనుచరుల వద్ద అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నచోట కాంగ్రెస్‌కు ఎక్కువ ఓట్లు రావడంపై ఆయన నొచ్చుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి సొంత నియోజకవర్గమైన చేవెళ్ల కంటే ఎక్కువగా వికారాబాద్ నియోజవకర్గంలో అధిక ఓట్లు వచ్చాయి. చేవెళ్లలో కాంగ్రెస్‌కు 15,831 ఓట్ల మెజార్టీ రాగా వికారాబాద్‌లో 20,626 ఓట్ల మెజార్టీ లభించింది. అలాగే పరిగి అసెంబ్లీ పరిధిలో 6,574 ఓట్ల మెజార్టీ విశ్వేశ్వర్‌రెడ్డికి వచ్చింది. మిగితా నియోజకవర్గాలైన రాజేంద్రనగర్, తాండూరు, శేరిలింగంపల్లి, మహేశ్వరంలో టీఆర్‌ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డికి కాంగ్రెస్ కంటే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. దీంతో ఆయన గెలుపు సాధ్యమైంది.
వికారాబాద్, పరిగిలో కాంగ్రెస్‌కు మెజార్టీ
చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని ఓటర్లు తమకు అండగా నిలుస్తారని టీఆర్‌ఎస్ భావించింది. అయితే అనూహ్యంగా వికారాబాద్, పరిగి, తాండూరు నియోజకవర్గాల నుంచి
టీఆర్‌ఎస్‌కు ఆశించిన స్థాయిలో ఓట్లు పడలేదు. ఒక్క తాండూరు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌కు స్వల్ప మెజార్టీ వచ్చింది. మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ఉన్న తాండూరు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌కు ఆశించిన స్థాయిలో మెజార్టీ దక్కలేదు. కేవలం 1199 ఓట్ల మెజార్టీ మాత్రమే టీఆర్‌ఎస్‌కు వచ్చింది. ఇక వికారాబాద్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌కు ఓటర్లు షాక్ ఇచ్చారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ వికారాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి 20,626 ఓట్ల మెజార్టీ వచ్చింది. టీఆర్‌ఎస్ అభ్యర్థి రంజిత్‌రెడ్డికి 49,318 ఓట్లు రాగా కాంగ్రెస్‌కు 69,977 ఓట్లు వచ్చాయి. విశ్వేశ్వర్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన చేవెళ్ల కంటే వికారాబాద్ ఓటర్లు కొండాకు ఎక్కువ మెజార్టీ కట్టబెట్టారు.
ఎమ్మెల్యే సొంత మండలమైన ధారూరులో టీఆర్‌ఎస్‌కు 8,397 ఓట్లు రాగా కాంగ్రెస్‌కు 10,760 ఓట్లు వచ్చాయి. ఎమ ఎమ్మెల్యే ఆనంద్ సొంత గ్రామమైన కేరెళ్లిలో సైతం కాంగ్రెస్‌కు 251 మెజార్టీ రావటం రాజకీవర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోఉంది. మోమిన్‌పేట మండలంలో కాంగ్రెస్‌కు 2,541, మర్పిల్లో 4,077 మెజార్టీ కాంగ్రెస్‌కు వచ్చింది. వికారాబాద్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటింగ్ శాతం తగ్గింది. దీంతో టీఆర్‌ఎస్ పార్టీ నాయకుల్లో పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ సరళిపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. పరిగి నియోజకవర్గంలో సైతం టీఆర్‌ఎస్ కంటే కాంగ్రెస్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయి.
ఇక్కడ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కాంగ్రెస్‌కు మెజార్టీ వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి విశ్వేశ్వర్‌రెడ్డికి 6,574 ఓట్లు రాగా టీఆర్‌ఎస్‌కు 60,055 ఓట్లు వచ్చాయి. పరిగిలో కాంగ్రెస్‌కు 6,574 మెజార్టీ వచ్చింది. పూడురు మండలంలో కాంగ్రెస్‌కు ఎక్కువగా ఓట్లు వచ్చాయి. పూడురు మండలంలోని ప్రతి పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్‌కు ఎక్కువగా మెజార్టీ వచ్చింది. వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాల్లో ఓట్లు తగ్గటంపై టీఆర్‌ఎస్ పార్టీ అధిష్టానం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్ ఫలితాలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విశ్లేషిస్తున్నట్లు సమాచారం. పార్టీకి మెజార్టీ తగ్గటానికి గల కారణాలపై స్వయంగా ఆరా తీసిన ఆయన ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment