ఓటెత్తని గ్రేటర్‌ సీన్‌ రిపీట్‌ | Hyderabad Voting Percentage Down in Lok Sabha Election | Sakshi
Sakshi News home page

ఓటెత్తని గ్రేటర్‌ సీన్‌ రిపీట్‌

Published Fri, Apr 12 2019 7:17 AM | Last Updated on Tue, Apr 16 2019 11:17 AM

Hyderabad Voting Percentage Down in Lok Sabha Election - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ప్చ్‌ మళ్లీ అంతే... సీన్‌ రిపీట్‌ అయింది.గ్రేటర్‌లో పోలింగ్‌ శాతం గణనీయంగా తగ్గింది. గతఎన్నికలతో పోలిస్తే మరింత పడిపోయింది. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల.. నాలుగు
నియోజకవర్గాల్లోనూ గురువారం జరిగిన లోక్‌సభఎన్నికల్లో గతం కంటే తక్కువ స్థాయిలో పోలింగ్‌నమోదైంది. హైదరాబాద్‌లో 39.49 శాతం,సికింద్రాబాద్‌లో44.99 శాతం, మల్కాజిగిరిలో 49.21 శాతం, చేవెళ్లలో 54.83 శాతం పోలింగ్‌ నమోదైంది. రాష్ట్రంలోనే అట్టడుగు స్థానంలో హైదరాబాద్‌ లోక్‌సభనియోజకవర్గం ఉండడం గమనార్హం. గ్రేటర్‌లో గతఎన్నికల్లోనూ తక్కువ పోలింగ్‌ నమోదు కావడంతో ఈసారి అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఎలాగైనా ఓటింగ్‌ శాతం పెంచాలని విశ్వప్రయత్నాలు చేశారు. ఓటింగ్‌పై విస్తృతంగా ప్రచారం చేశారు. అవగాహన సదస్సులు, చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. దివ్యాంగులు, వృద్ధులు, మహిళల కోసం ప్రత్యేక సదుపాయాలుకల్పించారు. అయినా నగరవాసుల్లో మార్పు రాలేదు. సిటీజనులు పోలింగ్‌పై ఆసక్తి చూపలేదు.  రాష్ట్రంలోనే హైదరాబాద్‌ నియోజకవర్గంలో అత్యల్పంగా పోలింగ్‌ నమోదైంది. గురువారం పోలింగ్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఎక్కడా చెప్పుకోదగ్గ రద్దీ కనిపించలేదు. ఉదయం 11గంటల లోపు ఆయా పోలింగ్‌ బూత్‌లలో సందడి కనిపించినప్పటికీ  ఆ తర్వాత కనిపించలేదు. తిరిగి పోలింగ్‌ ముగిసే గంటన్నర ముందు మళ్లీ సందడి నెలకొంది.  

హైదరాబాద్‌ లోక్‌సభ పరిధిలో ఉదయం 9గంటల వరకు 6.34 శాతం, 11గంటల వరకు 12.12 శాతం, మధ్యాహ్నం ఒంటిగంట వరకు 20.59 శాతం, 3గంటల వరకు 27.79 శాతం నమోదైంది. సాయ ంత్రం 5గంటలకు పోలింగ్‌ ముగిసే నాటికి 39.49 శాతానికి పరిమితమైంది.   
సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉదయం 9గంటల వరకు 6.50 శాతం, 11గంటల వరకు 12.12 శాతం, మధ్యాహ్నం ఒంటిగంట వరకు 23.85 శాతం, 3గంటల వరకు 30.20 శాతం నమోదైంది. సాయంత్రం 5గంటలకు పోలింగ్‌ ముగిసే నాటికి 44.99 శాతానికి పరిమితమైంది.   
మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలో ఉదయం 9 గంటల వరకు 6.71 శాతం, 11 గంటల వరకు 15.77 శాతం, మధ్యాహ్నం ఒంటిగంట వరకు 27.07 శాతం, 3గంటల వరకు 33.39 శాతం, సాయంత్రం 5 గంటల వరకు 42.75 శాతం నమోదైంది. పోలింగ్‌ ముగిసే నాటికి 49.21 శాతానికి పరిమితమైంది.  
చేవేళ్ల లోక్‌సభ నియోజకవర్గంలో ఉదయం 9గంటల వరకు 9.08 శాతం, 11గంటల వరకు 21.02 శాతం, మధ్యాహ్నం ఒంటిగంట వరకు 29.69 శాతం, 3గంటల వరకు 45.06 శాతం నమోదైంది. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్‌ ముగిసే సమయానికి 54.83 శాతానికి పరిమితమైంది.   

హైదరాబాద్‌ జిల్లాలో ఇలా...   
హైదరాబాద్, సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానాలుండే హైదరాబాద్‌ జిల్లాలో గతంతో పోలిస్తే పోలింగ్‌ శాతం గణనీయంగా తగ్గింది. ఇటీవల జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో 48.89 శాతం నమోదు కాగా... ఈసారి మరింత దిగజారి 42.24 శాతానికి పరిమితమైంది. అంటే అప్పటితో పోలిస్తే 6.65శాతం పోలింగ్‌ తగ్గింది. గత రెండు దశాబ్దాల కాలంలో ఇంత తక్కువ పోలింగ్‌ నమోదు కావడం ఇదే ప్రథమమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. జిల్లా ఎన్నికల అధికారులు ఓటరు చైతన్య కార్యక్రమాలు నిర్వహించినా, అవగాహన శిబిరాలు ఏర్పాటు చేసినా, మొబైల్‌ వాహనాల్లో ప్రచారం చేసినా, దివ్యాంగులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించినా పోలింగ్‌ శాతం మాత్రం పెరగలేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొత్తగా ఓటర్లు పెరిగినప్పటికీ... పాత జాబితాలో డూప్లికేట్‌ ఓట్లను తొలగించడంతో పెరిగిన ఓటర్ల ప్రభావం కూడా కనిపించలేదు. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగడంతో చాలామంది అక్కడికి తరలివెళ్లారు. ఇది పోలింగ్‌పై ప్రభావం చూపిందని అధికారులు భావిస్తున్నారు. అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్థలు, రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లు, ఎన్జీలు తమవంతుగా  అవగాహన కల్పించినప్పటికీ... వివిధ కారణాలతో పోలింగ్‌ శాతం తగ్గింది.

పార్టీ విధానాలు నచ్చితే అభ్యర్థి నచ్చక... అభ్యర్థి నచ్చితే పార్టీ నచ్చని విచిత్ర పరిస్థితి సిటీజనులకు ఎదురైనట్లు తెలుస్తోంది. దీంతో చాలామంది ఓట్లేసేందుకు ఉత్సాహం చూపలేదని పలువురు పేర్కొంటున్నారు. శుక్రవారం ఒక్కరోజు సెలవు పెడితే ఆదివారం వరకు వరుసగా నాలుగు రోజులు కలసి రావడంతో నగరం విడిచి వెళ్లినవారూ ఉన్నారు. కొత్త ఓటర్లు పెద్దగా నమోదు కాకపోవడం, చాలామంది ఇతర ప్రాంతాల్లో, స్వగ్రామాల్లో ఓట్లేసేందుకు వెళ్లడం, కొందరు సెలవుగా తప్ప ఓటేద్దామనుకోకపోవవడం తదితర కారణాలతో ఎప్పటిలాగే హైదరాబాద్‌లో పోలింగ్‌ శాతం తగ్గింది. 

బస్తీలే బెటర్‌...  
ఎప్పటిలాగే పేదలు, బస్తీల్లోని ప్రజలే పోలింగ్‌కు వచ్చిన వారిలో ఎక్కువగా ఉన్నారు. డూప్లికేట్‌ ఓట్లను భారీగా తొలగించినప్పటికీ, ఓటరు జాబితాలో ఇంకా  డూప్లికేట్‌ ఓట్లు ఉండటం కూడా పోలింగ్‌ శాతం పెరగకపోవడానికి కారణంగా కనిపిస్తోంది. డూపికేట్‌ ఓట్లు తొలగించే ప్రయత్నాల్లో కొందరివి ఒక్క చోట కూడా ఉంచకుండా పూర్తిగా తీసేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి.  

చేవెళ్లలో ఇలా...
సాక్షి, రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల లోక్‌సభ స్థానంలో ఈసారి పోలింగ్‌ తగ్గింది. ఇక్కడ 54.83 శాతం పోలింగ్‌ నమోదైంది. 2014 ఎన్నికల్లో 60.51శాతం పోలింగ్‌ నమోదు కాగా.. ప్రస్తుతం 6శాతం తగ్గింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలైన శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల స్పందన చాలా తక్కువగా ఉంది. ఈ రెండు సెగ్మెంట్లలో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు అధిక సంఖ్యలో ఉంటారు. ఆ రాష్ట్రంలోనూ గురువారం ఎన్నికలు జరగడంతో అక్కడికి వెళ్లారు. ఈ కారణంగా ఇక్కడ పోలింగ్‌ శాతం తగ్గినట్టు తెలుస్తోంది. అత్యధికంగా చేవెళ్ల శాసనసభ నియోజకవర్గంలో 70.42 శాతం, అత్యల్పంగా శేరిలింగంపల్లిలో 35.52 శాతం పోలింగ్‌ నమోదైంది. 

మందకొడిగా..
ఉదయం పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఉదయం 11 గంటల వరకు ఇదే వరుస కనిపించింది. ఎండ తీవ్రత పెరిగే కొద్దీ.. పోలింగ్‌ బూత్‌లు ఖాళీగా కనిపిస్తూ వచ్చాయి. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఓ మోస్తారుగా ఓటర్లు కనిపించారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 నుంచి 2:30 గంటల వరకు చాలా పోలింగ్‌ బూత్‌లు వెలవెలబోయాయి.  

పోలింగ్‌ శాతం ఇలా...

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement