సాక్షి, సిటీబ్యూరో: సార్వత్రిక సమరంలో ఓ ఘట్టం ముగిసింది. మహానగరంలో పక్షం రోజులు హోరాహోరీగా సాగిన ప్రచారపర్వానికి మంగళవారం సాయంత్రం తెరపడింది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీల నుంచి మహామహులు ప్రచారంలో పాల్గొని ఆయా పార్టీల శ్రేణుల్లో జోష్ నింపారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గ్రేటర్‌లో విస్తృతంగా ప్రచారం నిర్వహించగా... సీఎం కేసీఆర్ వికారాబాద్ సభలో పాల్గొన్నారు. ఇక కాంగ్రెస్ నుంచి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించి వికారాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. గ్రేటర్ పరిధిలో నిర్వహించిన సభలు, సమావేశాలు, రోడ్ షోలలో ఆ పార్టీ నేతలు గులాంనబీ ఆజాద్, కుంతియా, విజయశాంతి, ఖుష్బూ పాల్గొని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. బీజేపీ తరఫున ప్రధాని మోదీ సహా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, పలువురు కేంద్రమంత్రులు ప్రచారం చేశారు.
సారు.. కారు.. జోరు
సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ అధినేత వికారాబాద్ బహిరంగ సభలో పాల్గొనగా... ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మహానగరంలో ప్రచారాన్ని కొత్తపుంతలు తొక్కించారు. రోడ్ షోలు, బహిరంగ సభలు, ప్రత్యేక సమావేశాలు నిర్వహించి గులాబీ శ్రేణుల్లో జోష్ నింపారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రధానంగా వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృతంగా ప్రచారం చేశారు. జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. ప్రస్తుతం జాతీయ పార్టీల నేతృత్వంలో రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాలను ఏకరువు పెట్టారు. ఇక ‘సారు.. కారు.. పదహారు.. కేంద్రంలో సర్కారు’ అన్నదే ఆ పార్టీ ఎన్నికల నినాదమైంది. పార్టీకి మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న ఎంఐఎం పోటీ చేస్తున్న హైదరాబాద్ మినహా సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల స్థానాల్లో పాగా వేసేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంది.
కమలం ‘కళ’..
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, పలువురు కేంద్రమంత్రులు గ్రేటర్ పరిధిలోని మూడు లోక్‌సభ నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్రచార సభల్లో పాల్గొని కమలం శ్రేణుల్లో జోష్ నింపారు. జాతీయ స్థాయిలో దేశ రక్షణకు తాము తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఆర్థికాభివృద్ధిని కొత్తపుంతలు తొక్కించేందుకు అమలు చేస్తున్న విధానాలు, విపక్షాల్లో ఐక్యతలేమిని ఆ పార్టీ అగ్రనేతలు ప్రచార అస్త్రాలుగా వినియోగించారు. బీజేపీ ప్రధానంగా సికింద్రాబాద్‌లో పట్టునిలుపుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. హైదరాబాద్ లోక్‌సభ స్థానంలోనూ గణనీయంగా ఓట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తోంది.
కాంగ్రెస్.. హుషారు
రోడ్ షోలు, పాదయాత్రలతో కాంగ్రెస్ నేతలు ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలో విజయశాంతి, కుంతియా, బోసు రాజు, మర్రి శశిధర్‌రెడ్డి, దాసోజు శ్రవణ్‌కుమార్ ప్రచారం నిర్వహించారు. చేవెళ్లలో గులాంనబీ ఆజాద్, ఖుష్బూ, కుంతియా, విజయశాంతి తదితరులు రోడ్ షోలు నిర్వహించారు. కాంగ్రెస్‌కు మద్దతుగా ఆ పార్టీ చేవెళ్లలో నిర్వహించిన బహిరంగ సభలో తెలంగాణ జనసమితి (టీజేఎస్) అధ్యక్షుడు కోదండరాం పాల్గొన్నారు. కాంగ్రెస్ గ్రేటర్‌లోని హైదరాబాద్ మినహా సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల స్థానాలపై ఆశలు పెట్టుకుంది. సికింద్రాబాద్ లోకసభ స్థానం నుంచి రెండుసార్లు ప్రాతినిధ్యం వహించిన అంజన్‌కుమార్ యాదవ్, మల్కాజిగిరి నుంచి మాజీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, చేవేళ్ల నుంచి సిట్టింగ్ ఎంపీ కొండా విశ్వేశర్‌రెడ్డిలను బరిలోకి దించింది. ఇక హైదరాబాద్ నుంచి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన ఫిరోజ్‌ఖాన్‌ను బరిలోకి దింపింది.
వీరిలో హైదరాబాద్ అభ్యర్థి మినహా మిగతా ముగ్గురూ ప్రచారంలోనూ తమ మార్కు చూపించారు. సంప్రదాయ ఓట్లతో పాటు టీజేఎస్ మద్దతు కూడా కలిసొస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. సికింద్రాబాద్‌లో కాంగ్రెస్‌కు గట్టి ఓటు బ్యాంక్ ఉంది. ప్రస్తుతం బరిలో నిలిచిన అంజన్‌కుమార్ యాదవ్‌కు సామాజిక సమీకరణాలు, పరిచయాలు కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు టీఆర్‌ఎస్‌పై ఉన్న వ్యతిరేకత, బీజేపీలోని అంతర్గత కుమ్ములాటలు కూడా కలిసొస్తాయని నేతలు అభిప్రాయపడుతున్నారు. మల్కాజిగిరిలో బలమైన అభ్యర్థి రేవంత్‌రెడ్డిపై భారీ ఆశలు పెట్టుకుంది. ఇక్కడ కాంగ్రెస్‌కు ఓటు బ్యాంక్ గణనీయంగానే ఉంది. ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించిన కేడర్ మాత్రం పెద్దగా చెక్కు చెదరలేదు. చేవేళ్లలో సైతం ఇదే పరిస్ధితి నెలకొంది. అభ్యర్ధికి బలం, పలుకుబడి ఉండడం మరింత కలిసొచ్చే అవకాశం ఉంది.
ప్రలోభాలు... తాయిలాలు
ఇక ఇప్పటివరకు సభలు, సమావేశాలు, రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారాలతో ఓటర్లను కలిసిన అభ్యర్థులు... ఇప్పుడిక ప్రలోభాలకు తెరలేపారు. తాయిలాలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆయా పార్టీల అభ్యర్థులు అనుచరులను రంగంలోకి దింపారు. ఆ పార్టీ.. ఈ పార్టీ అనే తేడా లేకుండా అన్నీ ఆ తాను ముక్కలే అన్న చందంగా... అందరూ పంపకాలు ప్రారంభించారు. గంపగుత్తగా ఓట్లు కొల్లగొట్టేందుకు ఓటరు స్లిప్పులతో పాటే నోట్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. మందుబాబులకు లిక్కర్, మహిళలకు కుక్కర్ తదితర నజరానాలు అందించేందుకు ఎక్కడికక్కడే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఒక్కో పోలింగ్ బూత్‌కు కనీసం రూ.30వేల నుంచి రూ.50వేలు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. మంగళవారం రాత్రి, బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు గుట్టుగా పంపకాలు చేసేందుకు ప్రధాన పార్టీలు ఏర్పాట్లు చేసుకోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment