లష్కర్‌లో ముగ్గురూ ముగ్గురే! | BJP TRS And Congress Targets Malkajgiri Constituency | Sakshi
Sakshi News home page

లష్కర్‌లో ముగ్గురూ ముగ్గురే!

Published Thu, Apr 4 2019 9:26 AM | Last Updated on Thu, Apr 4 2019 9:26 AM

BJP TRS And Congress Targets Malkajgiri Constituency - Sakshi

కీలకమైన సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ఈసారి గట్టి పోటీ నెలకొంది. మూడు ప్రధాన పార్టీలకూ ఈ లోక్‌సభ పరిధిలో బలం ఉండటంతో పోటీ రసవత్తరంగా మారింది. పూర్తిగా సిటీ ఓటర్లున్న ఈ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానముంది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ మధ్యే ఇక్కడ పోటీ కొనసాగుతోంది. కానీ ఈసారి త్రిముఖ పోటీ నెలకొంది.

సెగ్మెంట్ల వారీగా..ముషీరాబాద్‌
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ముఠా గోపాల్‌ (టీఆర్‌ఎస్‌) ఎమ్మెల్యేగా గెలిచారు. నియోజకవర్గంలో మొత్తం పోలైన ఓట్లలో 51.18 శాతం ఆయనకు వచ్చాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి అనిల్‌కుమార్‌పై 36,888 ఓట్ల ఆధిక్యత సాధించారు. దీంతో బీజేపీ అభ్యర్థి లక్ష్మణ్‌ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

అంబర్‌పేట
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్‌పేట నుంచి టీఆర్‌ఎస్‌ తరపున కాలేరు వెంకటేశ్‌ గెలిచారు. పోలైన ఓట్లలో ఆయనకు 45.6 శాతం వచ్చాయి. బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డిపై 1,016 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.

ఖైరతాబాద్‌
దానం నాగేందర్‌ (టీఆర్‌ఎస్‌) గెలిచారు. పోలైన ఓట్లలో 53.66 శాతం ఆయనకు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డిపై 28,402 ఓట్ల మెజార్టీతో గెలిచారు.

జూబ్లీహిల్స్‌
 టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్‌ గెలిచారు. పోలైన ఓట్లలో ఆయనకు 43.1 శాతం వచ్చాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి విష్ణువర్థన్‌రెడ్డిపై 16,011 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.

సనత్‌నగర్‌
ఇక్కడ తలసాని శ్రీనివాసయాదవ్‌ (టీఆర్‌ఎస్‌)కు..  55.2 శాతం ఓట్లు వచ్చాయి. టీఆర్‌ఎస్‌ బలంగా ఉన్న నియోజకవర్గమిది.

సికింద్రాబాద్‌
టీఆర్‌ఎస్‌ అభ్యర్థి టి.పద్మారావు విజయం సాధించారు. ఇక్కడ కూడా టీఆర్‌ఎస్‌కు పట్టుంది.

నాంపల్లి
 ఇక్కడ నుంచి మజ్లిస్‌ అభ్యర్థి హుస్సేన్‌ 43.4 శాతం ఓట్లు సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ఫిరోజ్‌ఖాన్‌పై 9,675 ఓట్ల తేడాతో గెలిచారు.

బోనాల ఉత్సవాలకు ప్రసిద్ధి చెందిన సికింద్రాబాద్‌లో గెలుపు మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. సికింద్రాబాద్‌ లోక్‌సభ.. బీజేపీకి సిట్టింగ్‌ స్థానం. సిట్టింగ్‌ ఎంపీ దత్తాత్రేయను పక్కన పెట్టి ఆ పార్టీ కిషన్‌రెడ్డికి అవకాశం ఇచ్చింది. ఆయన గత అసెంబ్లీలో బీజేపీ పక్ష నేతగా వ్యవహరించారు. ఇక కాంగ్రెస్‌ మరోసారి మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌ను రంగంలోకి దింపింది. టీఆర్‌ఎస్‌ మాత్రం ప్రయోగం చేసింది. మంత్రి తలసాని కుమారుడు సాయికిరణ్‌ యాదవ్‌ను పోటీకి దించింది. ఇది సిట్టింగ్‌ సీటు కావడం, మోదీ చరిష్మాపై కిషన్‌రెడ్డి ధీమా పెట్టుకోగా, అంజన్‌కుమార్‌ యాదవ్‌ తన పరిచయాలు, కాంగ్రెస్‌ ఓటుబ్యాంకుపై ఆశలు పెట్టుకున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సాయికిరణ్‌ పూర్తిగా కొత్త. తండ్రి తలసాని శ్రీనివాసయాదవ్‌పైనే ఆధారపడి ఉన్నారు. అయితే ఈ సెగ్మెంట్‌ పరిధిలో టీఆర్‌ఎస్‌ ఎక్కువ అసెంబ్లీ సీట్లు గెలుచుకోవడం కలిసి వస్తుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అసెంబ్లీ ఫలితాలే పునరావృతమైతే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలిచినట్లే. ఇప్పటివరకు సికింద్రాబాద్‌ స్థానం నుంచి గెలుపొందని టీఆర్‌ఎస్, ఎలాగైనా ఈసారి గెలవాలనే పట్టుదలతో ఉంది. పైగా లోక్‌సభ పరిధిలోని ఎమ్మెల్యేల అండతో పార్టీని క్షేత్రస్థాయికి తీసుకెళ్లి ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోవాలని టీఆర్‌ఎస్‌ నాయకులు తలపోస్తున్నారు. జనసేన తరపున శంకర్‌గౌడ్‌ రంగంలో ఉన్నారు. మొత్తం ఈ స్థానం నుంచి 28 మంది పోటీ చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌– కాంగ్రెస్‌– బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.

అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ హవా
గత లోక్‌సభ ఎన్నికల నాటికి టీఆర్‌ఎస్‌కు సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానంలో పెద్దగా పట్టులేదు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయంతో పరిస్థితి మారింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ లోక్‌సభ స్థానం పరిధిలో ఒక్క నాంపల్లి మినహా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను టీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. మొత్తంగా ఈ లోక్‌సభ పరిధిలోని ఇటీవలి అసెంబ్లీ ఓట్ల తీరును పరిశీలిస్తే... టీఆర్‌ఎస్‌కు 4,29,390 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 2,44,789, బీజేపీకి 1,72,188 ఓట్లు వచ్చాయి. నాంపల్లిలో గెలిచిన ఎంఐఎంకు 52 వేల ఓట్లు వచ్చాయి. అయితే లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఎంఐఎం మద్దతు ఇస్తోంది. సికింద్రాబాద్‌ లోక్‌సభ సీటును కచ్చితంగా దక్కించుకోవాల్సిందేనని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పట్టుదలతో ఉన్నారు. దీంతో ఈసారి లోక్‌సభ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నారు.

గుబాళించాలని గులాబీ..
ఇప్పటివరకు గెలవని చోట బోణీ కొట్టాలని టీఆర్‌ఎస్‌ ఉవ్విళ్లూరుతోంది. ఈ లోక్‌సభ స్థానం నుంచి మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ కుమారుడు సాయికిరణ్‌ యాదవ్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ లోక్‌సభ పరిధిలోని నాంపల్లి మినహా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో 2018లో అన్నింటినీ టీఆర్‌ఎస్‌ గెలుచుకోవడంతో గెలుపుపై ఆ పార్టీ ధీమాతో ఉంది. పైగా సాయికిరణ్‌ను గెలిపించే బాధ్యతను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎమ్మెల్యేలకే అప్పగించారు. ప్రస్తుతం వారంతా ప్రచారంలో ఉన్నారు. పైగా మంత్రి తలసానికి ఈ నియోజకవర్గంపై గట్టి పట్టుంది. బలమైన సామాజిక వర్గమైన బీసీ ఓటర్ల అండ ఉంది. అయితే అభ్యర్థి సాయికిరణ్‌ యాదవ్‌.. అనుభవజ్ఞులైన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులతో తలపడటం ఆసక్తి కలిగిస్తోంది.

‘హస్త’గతం చేసుకోవాలని కాంగ్రెస్‌..
అంజన్‌కుమార్‌ యాదవ్‌ను మరోసారి బరిలోకి దింపిన కాంగ్రెస్‌ గెలుపుపై ఆశలు పెట్టుకుంది. ఇక్కడ 2004 నుంచి వరుసగా మూడుసార్లు పోటీ చేసిన ఆయన రెండుసార్లు ఎంపీగా గెలిచారు. తిరిగి బరిలో ఉన్నారు. ఆ విధంగా సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌కు మంచి పట్టు ఉండేది. పైగా ఈ స్థానం నుంచి ఎక్కువసార్లు కాంగ్రెస్‌ ఎంపీలే గెలిచారు. ఈ ఎన్నికల ద్వారా పూర్వ వైభవాన్ని చాటాలని కాంగ్రెస్‌ నాయకులు భావిస్తున్నారు. గెలుపు కోసం ఆ పార్టీ నేతలు శక్తియుక్తులన్నింటినీ కూడదీసుకుంటున్నారు. అయితే కీలకమైన నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరిపోతుండటంతో కాంగ్రెస్‌కు ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటోంది. తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని టీడీపీని కాంగ్రెస్‌ నాయకులు కోరారు. పైగా బీసీ సామాజికవర్గ ఓట్లున్నాయి. అయితే ఇటీవలి ఎన్నికల్లో పార్టీకి ఎదురైన పరాజయం ఆయనకు మైనస్‌గా చెప్పుకోవచ్చు. నియోజకవర్గాల్లో పార్టీకి నాయకుల కొరత ఉంది.

సీటు నిలబెట్టుకోవాలని బీజేపీ..
తమకు గట్టి పట్టున్న సికింద్రాబాద్‌ సిట్టింగ్‌ సీటును మరోసారి దక్కించుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో సీనియర్‌ నేత బండారు దత్తాత్రేయ ఇక్కడి నుంచి నాలుగుసార్లు ఎంపీగా గెలిచారు. ముషీరాబాద్, అంబర్‌పేట, ఖైరతాబాద్‌ అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీకి పట్టుంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ లోక్‌సభ పరిధిలోని 3 సెగ్మెంట్లలో గెలుపొందిన బీజేపీ 2018 ఎన్నికల్లో ఒక్కచోటా గెలుపొందలేకపోయింది. అంబర్‌పేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి వెయ్యి ఓట్ల తేడాతో ఓడిపోయిన కిషన్‌రెడ్డిని ఇప్పుడు బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టింది. కిషన్‌రెడ్డిపై ఓటర్లలో సానుకూల వైఖరి ఉందని, దీనికితోడు మోదీ అనుకూల పవనాలు తమ అభ్యర్థిని గెలిపిస్తాయని ఆ పార్టీ వర్గాలు నమ్ముతున్నాయి. ఇక్కడి నుంచి గెలిపిస్తే కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రి అయ్యే అవకాశముందని, అభివృద్ధి చేయడానికి వీలుంటుందని ఆ పార్టీ ప్రచారం చేస్తోంది.

కేసీఆర్, కేటీఆర్‌లే అండదండ
చిన్న వయసులోనే లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయించే అవకాశం కల్పించినందుకు పార్టీ అధినేతలకు కృతజ్ఞతలు. నాకు అనుభవం ఉందా లేదా అనేది ముఖ్యం కాదు.. కేసీఆర్‌ విధానాలే నన్ను గెలిపిస్తాయి. పైగా మా నాన్న మంత్రి. ఆయనకు ఇక్కడ కార్యకర్తలు, ప్రజాబలం ఉంది. ఇవన్నీ నాకు కలిసొచ్చేవే. బీజేపీ, కాంగ్రెస్‌ గెలిచినా ప్రయోజనం లేదు. కేంద్రంలో ఫెడరల్‌ ఫ్రంటే అధికారంలోకి వస్తుంది. నా గెలుపు నల్లేరుపై నడకే.. బీజేపీ.. బండారు దత్తాత్రేయను మంత్రి పదవి నుంచి తొలగించి బీసీలను అవమానించింది. ఇద్దరు ఎంపీలతో కేసీఆర్‌ తెలంగాణ తెచ్చారు. 16 మంది ఎంపీలను గెలిపిస్తే ఫెడరల్‌ ఫ్రంట్‌ను అధికారంలోకి తెస్తారు.– తలసాని సాయికిరణ్‌ యాదవ్, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి

కేంద్రంలోఅధికారం మాదే
కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రానుంది. పైగా నేను ఎంపీగా గతంలో సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను. బడుగు, బలహీన వర్గాల కోసం కష్టపడ్డాను. నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా నిరంతరం ప్రజల్లో ఉన్నాను. కాబట్టి ప్రజలు నన్ను గెలిపిస్తారు. రాహుల్‌ ప్రధానైతే రాష్ట్రానికి నిధులొస్తాయి. వాటి సాయంతో అభివృద్ధికి పాటుపడతాను.
– అంజన్‌కుమార్‌ యాదవ్, కాంగ్రెస్‌ అభ్యర్థి

నా గెలుపు ఖాయం
ఈ ఎన్నికలు దేశ ప్రధానిని ఎన్నుకునేవి కాబట్టి ఇందులో టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఓడినా, గెలిచినా ప్రజలకు లాభం లేదు. మోదీని ప్రధానిని చేసేందుకు బీజేపీ అభ్యర్థులను గెలిపించాలి. ప్రధాని మోదీ సభ తరువాత తెలంగాణ ప్రజలు మరోసారి మోదీనే ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. రాష్ట్రంలో ఎయిమ్స్‌ వంటి ప్రతిష్టాత్మక సంస్థలను ఇచ్చిన ఘనత మోదీ ప్రభుత్వానిదే. రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రం అనేక చర్యలు చేపడుతోంది. కేసీఆర్‌ అభివృద్ధి అంతా గ్రాఫిక్స్‌ లోనే ఉంది. ఇక కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన ఏ ఒక్క రాష్ట్రంలో కూడా రుణమాఫీ కాలేదు. రేపు కాంగ్రెస్‌ ఎంపీలు గెలిచినా టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిపోవడం ఖాయం. సికింద్రాబాద్‌లో బీజేపీ మంచి మెజారిటీతో గెలుస్తుంది.– కిషన్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి

జనం మాట... కేసీఆర్‌ని గెలిపించాల్సిందే..
మోదీకి బీజేపీని, రాహుల్‌కు కాంగ్రెస్‌ను గెలిపించాలని ఉంటుంది. కానీ తెలంగాణ గెలవాలంటే కేసీఆర్‌ను గెలిపించాలి. ఎందుకంటే జాతీయ పార్టీల దృష్టి ఒకలా ఉం టుంది. ప్రాంతీయ పార్టీల ఆలోచన విధానం ఆ ప్రాంతం అభివృద్ధి, వనరుల సృష్టి కోసం ఉంటుంది. కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో ప్రాచుర్యం పొందాయి. టీఆర్‌ఎస్‌కు 16 ఎంపీ సీట్లు ఇస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుంది.   – శంకర్, సినీ డైరెక్టర్‌

మంచి అభ్యర్థికి ఓటేయండి
మంచి అభ్యర్థిని గుర్తించి ఎంచుకోవాలి. పొరపాటున డబ్బు తీసుకొని కానీ, ఇతరత్రా ప్రలోభాలకు గురై కానీ ఓటేయకూడదు. రాజ్యాంగం మనకు ఓటు హక్కు కల్పించింది. కానీ కొందరు ఓటేయడం లేదు. 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటేయాలని నా విన్నపం. మన భవిష్యత్తును నిర్ణయించేది ఓటే.– హేమ, సినీనటి

మోదీతోనే దేశాభివృద్ధి
సికింద్రాబాద్‌ లోక్‌సభ పరిధిలోని ప్రాంతాలను అభివృద్ధి చేసే పార్టీ, అభ్యర్థికి ఓటేస్తాను. ప్రస్తుతం జరిగే ఎన్నికలు కేవలం పార్లమెంటుకు సంబంధించినవి. అంటే ప్రధాని ఎవరో నిర్ణయించేవి. మోదీతోనే దేశంలో అభివృద్ధి జరుగుతోంది. పెద్ద నోట్ల రద్దు వల్ల నల్లధనం బయటకు వచ్చింది. కాబట్టి బీజేపీకి మద్దతివ్వాలనుకుంటున్నా.– జి.ఆనంద్, నగల వ్యాపారి, ముషీరాబాద్‌

ఫ్రంట్‌తోనే దేశం ముందుకు..
టీఆర్‌ఎస్‌కే ఓటేస్తా. కేసీఆర్‌తోనే రాష్ట్రం అభివృద్ధి చెందింది. 16 ఎంపీ సీట్లను గెలిపిస్తే దేశంలో చక్రం తిప్పుతానని చెప్పారు. కాబట్టి ఆ ప్రకారమే టీఆర్‌ఎస్‌కు ఓటేస్తాను. కేంద్రంలో జాతీయ పార్టీలుంటే రాష్ట్రాలు అభివృద్ధి అయ్యే పరిస్థితి లేదు. బడుగు బలహీన వర్గాలకు కేసీఆర్‌ అనేక పథకాలు ప్రవేశపెట్టారు. మరిన్ని ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పడితే తెలంగాణ మరింత అభివృద్ధి చెందడం ఖాయం.    కె.శ్రీకాంత్‌

నా చెల్లి పెళ్లికి సాయం
షాదీ ముబారక్‌ పథకం కింద నా చెల్లి పెళ్లికి ప్రభుత్వంరూ. 50 వేలు ఇచ్చింది. కాబట్టి నేను టీఆర్‌ఎస్‌ అభ్యర్థికే ఓటేస్తాను.– రహీమ్, కూరగాయల వ్యాపారి, విజయనగర్‌ కాలనీ

పురుషులు 10,24,917
స్త్రీలు          9,43,171
ఇతరులు    59
మొత్తం     19,68,147

సికింద్రాబాద్‌లోక్‌సభలోనిఅసెంబ్లీ సెగ్మెంట్లు
సికింద్రాబాద్‌
ముషీరాబాద్‌
ఖైరతాబాద్‌
జూబ్లీహిల్స్‌
నాంపల్లి
సనత్‌నగర్‌
అంబర్‌పేట

సికింద్రాబాద్‌ లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల శాతం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement