ఒకవైపు కాలనీలు.. మరోవైపు సరైన ఇంటి పైకప్పులూ లేని బస్తీలు.. ఇంకోవైపు ఆకాశాన్నంటే హర్మ్యాలు.. జాతీయ సమైక్యతకు అద్దం పట్టే నిర్మాణాలు, చారిత్రక నేపథ్యం ఉన్న చర్చిలు, మసీదులు, దేవాలయాలు.. ఇదీ లష్కర్‌గా పేరొందిన సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ముఖచిత్రం. భిన్న సంస్కృతులు, సంప్రదాయాల నిలయమైన ఈ ప్రాంతం నిజాం కాలంలోనే వెలుగొందింది. ఆంగ్లేయుల ప్రభావమూ తోడై సాంస్కృతిక వారసత్వం– ఆధునికతల కలబోతగా మారింది. బొల్లోజు రవి,సాక్షి– హైదరాబాద్
1957లో సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం ఏర్పడింది. ఈ స్థానం తొలి నుంచీ కాంగ్రెస్ అడ్డా. ఉమ్మడి ఏపీలో తెలుగుదేశం హవా కొనసాగినపుడూ ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. తర్వాత ఓటర్లు బీజేపీని ఆదరించారు. ఇప్పుడు సీన్ మారింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నాటి నుంచి టీఆర్‌ఎస్ బలపడింది. అసెంబ్లీ ఎన్నికల్లో అయితే ఊహించని విధంగా సత్తా చాటింది. దీంతో ఈసారి సికింద్రాబాద్ లోక్‌సభ స్థానాన్ని కచ్చితంగా గెలుచుకుంటామన్న ధీమాతో ఆ పార్టీ ఉంది. ఈ స్థానం జనరల్ అయినా.. ఇక్కడి నుంచి గెలిచిన వారిలో బీసీ, ఎస్సీ, మైనారిటీ వర్గాల వారే ఎక్కువ. 1996 నుంచి 1998 వరకు రెండేళ్లపాటు పదవిలో ఉన్న పీవీ రాజేశ్వరరావు మాత్రమే ఓసీ వర్గానికి చెందినవారు.
1991కి ముందు వరుసగా కాంగ్రెస్ గెలవగా, తర్వాత నాలుగుసార్లు బీజేపీ (బండారు దత్తాత్రేయ), మూడుసార్లు కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. ఈ స్థానానికి మొత్తం 18 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 11, కాంగ్రెస్ (ఐ) రెండుసార్లు, టీపీఎస్ ఒకసారి, బీజేపీ నాలుగుసార్లు గెలిచింది. కాంగ్రెస్ నేత శివశంకర్ ఈ నియోజకవర్గంలో రెండు సార్లు, తెనాలిలో ఒకసారి గెలిచారు. ఇక హషీం, మణెమ్మ అంజయ్య, అంజన్‌కుమార్ యాదవ్ రెండేసి సార్లు గెలిచారు. ఎ.మోహియుద్దీన్ సికింద్రాబాద్‌లో రెండుసార్లు, హైదరాబాద్‌లో ఒకసారి గెలిచారు. బీఏ మీర్జా సికింద్రాబాద్‌లో ఒకసారి, వరంగల్‌లో ఒకసారి గెలిచారు. ఎస్.ఎ.ఖాన్, టి.అంజయ్య, పీవీ రాజేశ్వర్‌రావు ఒక్కోసారి గెలిచారు. శివశంకర్, అంజయ్య, బండారు దత్తాత్రేయ కేంద్ర మంత్రులుగా పనిచేశారు. అంజయ్య ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగానూ ఉన్నారు. ఆయన మరణం తర్వాత భార్య మణెమ్మ రెండుసార్లు ఎంపీ కాగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. మొత్తంగా బీసీ నేతలు ఎనిమిది సార్లు గెలవగా, రెడ్లు మూడు సార్లు, బ్రాహ్మణ ఒకసారి, ముస్లింలు ఆరుసార్లు గెలిచారు.
2014 లోక్‌సభ ఎన్నికల్లో ఇదీ పరిస్థితి
2014లో జరిగిన ఎన్నికల్లో బండారు దత్తాత్రేయ (బీజేపీ) గెలిచారు. ఆ తర్వాత ప్రధాని మోదీ మంత్రివర్గంలో సభ్యులయ్యారు. దత్తాత్రేయకు 4,38,271 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి అంజన్‌కుమార్ యాదవ్‌కు 1,83,536 ఓట్లు వచ్చాయి. అంజన్‌కుమార్ యాదవ్ అంతకుముందు రెండుసార్లు వరుసగా గెలిచి, ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పుడు ఎంఐఎం అభ్యర్థి మూడో స్థానంలో, టీఆర్‌ఎస్ అభ్యర్థి భీమ్‌సేన్ నాలుగో స్థానానికి పరిమితమయ్యారు. ఈ నియోజకవర్గంలోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ ఆధిక్యత తెచ్చుకోగా, నాంపల్లిలో మాత్రం ఎంఐఎం మెజారిటీ పొందింది. సికింద్రాబాద్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి పద్మారావు అసెంబ్లీకి ఎన్నిక కాగా, లోక్‌సభకు మాత్రం క్రాస్ ఓటింగ్ జరిగి బీజేపీ మెజారిటీ సంపాదించింది.
ఇప్పుడు ‘కారు’దే దూకుడు..
గత లోక్‌సభ ఎన్నికల నాటికి టీఆర్‌ఎస్‌కు సికింద్రాబాద్ లోక్‌సభ స్థానంపై పెద్దగా పట్టులేదు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘన విజయంతో పరిస్థితి మారింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ స్థానం పరిధిలో ఒక్క నాంపల్లి మినహా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను టీఆర్‌ఎస్ గెలుచుకుంది. మొత్తంగా ఈ లోక్‌సభ పరిధిలోని ఇటీవలి అసెంబ్లీ ఓట్ల తీరును పరిశీలిస్తే.. టీఆర్‌ఎస్‌కు 4,29,390 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 2,44,789, బీజేపీకి 1,72,188 ఓట్లు వచ్చాయి. నాంపల్లిలో గెలిచిన ఎంఐఎంకు 52 వేల ఓట్లు వచ్చాయి. అయితే లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఎంఐఎం మద్దతు ఇచ్చే అవకాశముంది. సికింద్రాబాద్ లోక్‌సభ సీటును కచ్చితంగా దక్కించుకోవాల్సిందేనని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పట్టుదలతో ఉన్నారు. ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించారు.
యాదవులు, మైనార్టీలే కీలకం..
సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం మొదటి నుంచీ యాదవులకు పట్టున్న ప్రాంతం. ఇక్కడ వరుసగా విజయాలు సాధిస్తున్న వారిలో ఎక్కువ మంది ఆ సామాజిక వర్గానికి చెందిన వారే. సంఖ్యాపరంగా ఈ వర్గం ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. దీనికి తోడు ఇక్కడ కంటోన్మెంట్, దక్షిణ మధ్య రైల్వే కేంద్రంగా ఉండటంతో ఉత్తర భారతీయులు పెద్దసంఖ్యలో ఓటర్లుగా ఉన్నారు. వీరిలోనూ యూపీ, బిహార్, జార్ఖండ్‌లోని కుర్మి, యాదవ సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లు కీలకంగా మారతారు. అందుకే, పార్టీలేవైనా ఇక్కడ చాలాసార్లు అదే సామాజిక వర్గానికి చెందిన నేతలు గెలుపొందుతున్నారు. ఇక మైనార్టీలూ ఇక్కడ గెలుపోటములను ప్రభావితం చేయగల సంఖ్యలో ఉన్నారు.
ఏ పార్టీ నుంచి ఎవరు?
కాంగ్రెస్: సికింద్రాబాద్ లోక్‌సభ సెగ్మెంట్‌లో కాంగ్రెస్ తరపున మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ బరిలో నిలవడం ఖాయమైంది! ప్రస్తు తం గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్న ఆయన 2004–2009 ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కాగా, ఈ లోక్‌సభ స్థానంలో అంజన్ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండటంతోపాటు గతంలో గెలవడంతో ఆయన గెలుపుపై కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటోంది.
బీజేపీ: గతంలో ఇక్కడ బీజేపీకి విజయాన్ని అందించిన బండారు దత్తాత్రేయకు బదులు ఆ పార్టీ ఈసారి కిషన్‌రెడ్డిని బరిలోకి దించింది. కిషన్‌రెడ్డి 2014 ఎన్నికల్లోనే ఈ లోక్‌సభ సీటుపై దృష్టిపెట్టారు. కానీ, దత్తాత్రేయకు టికెట్ లభించింది. కాగా, తాజా అభ్యర్థి కిషన్‌రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో ఎంపీగా ఇప్పుడిక్కడ గెలవాలనే పట్టుదలతో ఉన్నారు.
టీఆర్‌ఎస్: ఈ పార్టీ నుంచి ఈసారి నలుగురి పేర్లుమొదటి నుంచీ వినిపించినా.. చివరకు మంత్రి తలసానిశ్రీనివాస్‌యాదవ్ కుమారుడుతలసాని సాయికిరణ్ యాదవ్ పేరును ఆ పార్టీ ఖరారు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment