సాక్షి,మేడ్చల్ జిల్లా: మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికకు సర్వం సిద్ధం చేసినట్లు ఎన్నికల అధికారి, మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీసెగ్మెంట్‌లలో 31,49,710 మంది ఓటర్లు ఉండగా, 2,982 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ ఎన్నికల్లో 3,430 ఈవీఎంలతోపాటు 3,707 వీవీ ప్యాట్‌లు అందుబాటులో ఉంచామన్నారు. ఎన్నికల ఏర్పాట్లపై మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. పోలింగ్ శాతాన్ని పెంచడానికి బస్తీలు, విద్యా సంస్థలు, పారిశ్రామిక కేంద్రాలు, గ్రామాల్లో పెద్దఎత్తున అవగాహన కల్పించామన్నారు. దివ్యాంగులు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, గర్భిణులు, బాలింతలను పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చి..ఓటేయగానే ఇంటికి తరలించే విధంగా ప్రత్యేక వాహనాలు అందుబాటులో ఉంచామన్నారు. జిల్లాలో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 51.68 శాతం పోలింగ్ నమోదు కాగా, 2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 55.88 శాతం పోలింగ్ నమోదైందన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో 70 శాతం పోలింగ్ నమోదు అయ్యేలా చూస్తామన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలు, వీవీ ప్యాట్‌ల పరిశీలన కార్యక్రమాన్ని రెండు విడతలుగా చేపట్టామని, వారి సమక్షంలోనే ఈ యంత్రాల పనితీరును మాక్ పోలింగ్ ద్వారా పరిశీలించామన్నారు.
ఎన్నికల విధుల్లో 20 వేల సిబ్బంది
ఎన్నికల విధినిర్వహణలో 12 వేల మంది ఉద్యోగులు, ఎనిమిది వేల మంది పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లలో ఉంటారని కలెక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. ఎన్నికల విధుల్లో భాగంగా మైక్రో అబ్జర్వర్లగా 130 మంది, ప్రిసైడింగ్ ఆఫీసర్లుగా 2,444 మంది, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లుగా 2,444 మంది, పోలింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్లుగా 4,890 మందిని నియమించామన్నారు.
రూ.5.16 కోట్ల నగదు సీజ్
మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలో తరలిస్తున్న రూ.5,16,52,500 సీజ్ చేయటంతోపాటు ఆరు కేసులు నమోదు చేసినట్లు ఎంవీరెడ్డి తెలిపారు. 1335 ఆయుధాలను సంబంధిత వ్యక్తులు ఠాణాల్లో డిపాజిట్ చేయగా, 650 మందిని బైండోవర్ చేసినట్లు ఆయన తెలిపారు. 19,889 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment