చింతకింది గణేశ్, సాక్షి– హైదరాబాద్ :అనేక ప్రాంతాల ప్రజలు.. భిన్న సంస్కృతుల నెలవు.. పారిశ్రామికరంగానికి రాజధాని.. మల్కాజిగిరి. జీవనోపాధి కోసం వచ్చే వలస కార్మికులు, వివిధ రంగాల్లో పనిచేసే ఉద్యోగులు కలిగిన అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గమిది. రాష్ట్రానికే తలమానికమైన రక్షణ రంగ సంస్థలు, ఐటీ కంపెనీలు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, విద్య, వైద్య, వ్యాపార రంగాల పురోగతితో అపారమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కేంద్రంగా విరాజిల్లుతున్న ఈ నియోజకవర్గంలోని ప్రజలకు సామాజిక, రాజకీయ చైతన్యం ఎక్కువే. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన సర్వే సత్యనారాయణకు పట్టం కట్టిన ఇక్కడి ఓటర్లు 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మల్లారెడ్డి (ప్రస్తుతం ఈయన టీఆర్‌ఎస్‌లో ఉన్నారు) గెలిపించారు. 2009 ఎన్నికలకు ముందు కొత్తగా ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం మూడోసారి జరగబోతోన్న ఈ ఎన్నికల్లో ముఖ్యనేతలు పోటీ పడుతుండటంతో అంతటా ఆసక్తి కలిగిస్తోంది.
పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మల్కాజిగిరి అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలు 2008లో ఆవిర్భవించాయి. ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 30,98,816 మంది ఓటర్లు ఉన్నారు. పరిశ్రమల కేంద్రానికి రాజధానిగా విరాజిల్లుతున్న ఈ నియోజకవర్గం పరిధిలో ఉద్యోగులు, వ్యాపార వర్గాలతోపాటు రోజువారీ కూలీలు, కుటీర పరిశ్రమలు, అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికులు జీవనం సాగిస్తున్నారు. అక్షరాస్యతలో ముందంజలో ఉన్న ఈ నియోజకవర్గంలో ఆంధ్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక, రాజస్తాన్, గుజరాత్, బిహార్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన లక్షలాది మంది నివసిస్తున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంత వాతావరణాన్ని కలబోసుకున్న ఈ నియోజకవర్గంలో వివిధ వర్గాల ఓటర్లే గెలుపోటములపై ప్రభావం చూపుతారు.
ఓటరు తీర్పు విలక్షణం
మల్కాజిగిరి నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కంటోన్మెంట్ హైదరాబాద్ జిల్లా పరిధిలోకి రానుండగా, ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం రంగారెడ్డి జిల్లాలో ఉంది. మిగతా ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలో ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజనలో ఏర్పడిన మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంలో 2009 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సర్వే సత్యనారాయణ 93,226 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆయన కేంద్రమంత్రిగా పని చేశారు. అప్పట్లో ఆయనకు 3,88, 368 ఓట్లు లభించగా, టీడీపీ అభ్యర్థి భీమ్‌సేన్‌కు 2,95, 042 ఓట్లు లభించాయి. ఇక పీఆర్‌పీ అభ్యర్థి దేవేందర్‌గౌడ్ 2,38,886 ఓట్లతో మూడో స్థానంలో నిలి చారు. బీజేపీ అభ్యర్థి నల్లు ఇంద్రసేనారెడ్డికి 1,30,206 ఓట్లు లభించాయి. 2014 సాధారణ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసిన మల్లారెడ్డి 28,371 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అప్పు డు ఆయనకు 5,23,336 ఓట్లు లభించగా, టీఆర్‌ఎస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావుకు 4,94,965 ఓట్లు వచ్చాయి. సర్వే సత్యనారాయణ (కాంగ్రెస్)కు 2,33,711 ఓట్లు లభిం చాయి. ఈ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి మొత్తం 30 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో 15 మంది స్వతంత్ర అభ్యర్థులు. ప్రధాన రాజకీయ పార్టీల నుంచి చామకూర మల్లారెడ్డి, సర్వే సత్యనారాయణ, మైనంపల్లి హనుమంతరావు, లోక్‌సత్తా పార్టీ నుంచి జయప్రకాశ్ నారాయణ్, వైఎస్సార్‌సీపీ నుంచి మాజీ డీజీపీ దినేశ్‌రెడ్డి పోటీ చేశారు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే.. ఇక్కడ గెలిచిన మల్లారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మల్లారెడ్డి మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందటంతోపాటు రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అన్నీ టీఆర్‌ఎస్‌వే!
ప్రస్తుత ఎన్నికల్లో ఈ లోక్‌సభ స్థానంలో టీఆర్‌ఎస్ నుంచి మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్‌రెడ్డి, బీజేపీ నుంచి ఎమ్మెల్సీ ఎన్.రాంచంద్రరావు పోటీకి దిగారు. దీంతో ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుందో, ఓటరు విలక్షణ తీర్పు ఎలా ఉంటుందోనని ఉత్కంఠ నెలకొంది. గెలుపు విషయంలో ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరు స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులే గెలిచారు. మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుపొందగా ఒక్క ఎల్‌బీనగర్ నుంచి మాత్రం సుధీర్‌రెడ్డి (కాంగ్రెస్) గెలుపొందారు. అయితే ఆయన కూడా టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధం కావడంతో మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలంతా టీఆర్‌ఎస్‌కు చెందిన వారే కానున్నారు. ఈ పరిస్థితుల్లో ఏప్రిల్ 11న జరగనున్న ఎన్నికల్లో ఓటర్లుఎవరిని గెలిపిస్తారన్నది ఆసక్తిగా మారింది. ఏడు అసెంబ్లీ స్థానాల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నందున ఆ పార్టీ అభ్యర్థి రాజశేఖర్‌రెడ్డి గెలుపు ఖాయమని టీఆర్‌ఎస్ వర్గాలు అంటున్నాయి. అయితే టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ తరపున ఇదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన గతంలో టీడీపీలో పని చేసినందున ఈ నియోజకవర్గంలోని సెటిలర్లు, టీడీపీ ఓట్లు కూడా తనకే వస్తాయన్న ధీమాతో ఉన్నారు. మరోవైపు 2014 ఎన్నికల్లో బీజేపీ పొత్తుతో మల్లారెడ్డి ఎంపీగా గెలిచారు. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో తమకు ఓటుబ్యాంకు, ప్రధాని నరేంద్రమోదీ ఛరిష్మా, కేంద్రంలో అధికారంలోకి రావాల్సిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన నేపథ్యంలో ప్రజలు తమకే ఓటు వేస్తారని బీజేపీ భావిస్తోంది.
ఎన్నికల్లో ప్రభావంచూపే అంశాలు
♦ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు పథకాల ప్రభావంటీఆర్‌ఎస్‌కు అనుకూలం కానుంది.
♦ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం లక్షల్లో నిరుపేదలు దరఖాస్తు చేసుకున్నారు. ఎప్పటికైనా ఇళ్లు రాకపోతాయా అన్న ఆశతో వీరంతా ఉన్నారు. ఇతర సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వీరంతా ఇళ్ల విషయాన్ని ప్రధాన సమస్యగా భావించడం లేదని తెలుస్తోంది.
♦ రోడ్ల మరమ్మతులు, స్కైవ్ వే (ఫ్లైఓవర్లు) మార్గాలకు ప్రతిపాదనలతోపాటు ఉప్పల్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో పనులు ప్రారంభమయ్యాయి.
♦ చర్లపల్లి, ఘట్‌కేసర్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జీలు, మల్కాజిగిరి అండర్ బ్రిడ్జి పనులు మరింత వేగం పుంజుకోవాలని ప్రజలు అంటున్నారు.
ఉప్పల్ ప్రాంతంలోని
హైదరాబాద్–వరంగల్ ప్రధాన రహదారివిస్తరణ పనులుచేపట్టాలని ప్రజలుకోరుతున్నారు.
కబ్జాల నుంచి చెరువులను పరిరక్షించేందుకుతీసుకుంటున్న చర్యలు మరింత కఠినంగాఉండాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మౌలాలి కమాన్‌నుంచి బస్సులువెళ్లక ఏళ్లు గడుస్తున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదనే అభిప్రాయం ఇక్కడి స్థానికులుల్లో ఉంది.
హైదరాబాద్ నగరంలోని మూడో వంతు జనాభా ఇక్కడే ఉంటారు. దీంతో ఈ నియోజకవర్గాన్ని ప్రత్యేక మాస్టర్‌ప్లాన్‌తో స్మార్ట్ సిటీచేయాలన్న డిమాండ్ ఉంది.
చర్లపల్లి రైల్వే టెర్మినల్ కేంద్రం ప్రతిపాదనలకు మోక్షం కలగాల్సి ఉంది.
బోడుప్పల్‌లో 360 ఎకరాల్లో ఏర్పాటు చేయతలపెట్టిన ఐటీఐఆర్ పనులకు శ్రీకారం చుట్టాలి.
మల్కాజిగిరి లోక్‌సభ ఓటర్లు
పురుషులు 16,13,001
మహిళలు 14,85,504
ఇతరులు 311
మొత్తం 30,98,816
మల్కాజిగిరి లోక్‌సభలో అసెంబ్లీ సెగ్మెంట్లుమేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీనగర్,కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, కంటోన్మెంట్.
Comments
Please login to add a commentAdd a comment