ఎన్‌జీ కొత్తపల్లిలో పోలీసుల వాహనాలను అడ్డుకుంటున్న గ్రామస్తులు, ఆందోళనకారులతో మాట్లాడుతున్న సీఐ క్యాస్ట్రోరెడ్డి
సాక్షి, శాలిగౌరారం : మండలంలో గురువారం నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికలు మండలంలోని ఎన్‌జీ కొత్తపల్లి, ఆకారం, చిత్తలూరు గ్రామాల్లో ఘర్షణలు, ఆందోళనలకు దారితీశాయి. ఎన్నికల సందర్భంగా ఎన్‌జీ కొత్తపల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో కొనసాగుతున్న పోలింగ్ కేంద్రం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మరో వ్యక్తి పట్ల దుర్భాషలాడటంతో గొడవ మొదలయ్యింది. ఓటింగ్ ప్రక్రియ ముగిసే సమయానికి కొన్ని నిముషాల ముందే గొడవ జరుగడంతో పరిస్థితి చేయిదాటి పోయింది. దీంతో సమాచారం అందుకున్న స్థానిక ఎస్‌ఐ గోపాలరావు సిబ్బందితో హుటాహుటిన ఎన్‌జీ కొత్తపల్లి గ్రామానికి చేరుకొని ఇరువర్గాలకు చెందిన వారిని చెదరగొట్టాడు. ఈ క్రమంలో స్వల్ప లాఠీచార్జ్ జరగడంతో ప్రజలు తోపులాటకు గురయ్యారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక ఎంపీటీసీ గన్నపురెడ్డి కళమ్మలక్ష్మారెడ్డితో పాటు మరికొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. ఆగ్రహించిన గ్రామస్తులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పాఠశాలకు వెళ్లే రోడ్డుపై ధర్నాకు దిగారు. అదే సమయంలో ఈవీఎంలకు రక్షణగా వచ్చిన పోలీసు వాహనాన్ని అడ్డుకొని చుట్టుముట్టారు. చేసేదేమిలేక పోలీసులు కిందకు దిగి పోలింగ్ కేంద్రానికి నడిచివెళ్లారు.
ఇదిలా ఉండగా పోలీసుల లాఠీచార్జితో స్వల్ప గాయానికి గురైన సంకటి శ్రీను అనేవ్యక్తి అవమానంతో పురుగులమందు తాగాడు. అదే సమయంలో వచ్చిన పోలీసులకు చెందిన మరో వాహనంలో బాధితుడిని వెంటనే నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే రాత్రి కావడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆందోళనకారులు పోలింగ్ కేంద్రంవద్ద ఉన్న పోలీసులను అడ్డుకునేందుకు వెళ్లారు. పరిస్థితిని గమనించిన ఎస్‌ఐ గోపాలరావు గుట్టుచప్పుడుకాకుండా డొంకమార్గంలో ఎన్నికల సిబ్బందిని, ఈవీఎంలను తరలించారు. దీంతో పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆందోళనకారులు అక్కడ పోలీసులు, ఎన్నికల సిబ్బంది లేకపోవడంతో తీవ్రంగా ఆగ్రహిస్తూ ఈవీఎంలను, బందోబస్తు పోలీసులను బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. పరిస్థితిని తెలుసుకున్న సీఐ క్యాస్ట్రోరెడ్డి ఎన్‌జీ కొత్తపల్లి గ్రామానికి చేరుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు, బాధిత వ్యక్తులతో మాట్లాడి సమస్య సద్దుమణిగేలా చేశారు.
ఎస్‌ఐపై చర్యలు తీసుకుంటామన్న సీఐ హామీతో ఆందోళనను విరమించారు. అప్పటికే రాత్రి తొమ్మిది గంటలు కావడంతో గ్రామంలో ఏమి జరుగుతుందోనని ప్రజలు తీవ్ర ఆందోళనలకు గురయ్యారు. ఇదిలా ఉండగా ఆకారం గ్రామంలో రెండు ప్రధాన పార్టీలకు చెందిన పోలింగ్ ఏజెంట్ల మధ్య గొడవ ప్రారంభమై ఘర్షణకు దారితీసింది. దీంతో ఇరువురు బాహాబాహికి దిగడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పరిస్థితిని గమనించిన పోలీసులు వెంటనే రంగంలోకిదిగి సమస్యను సద్దుమణిగించారు. అదేవిధంగా చిత్తలూరు గ్రామంలో కూడా రెండు ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలు గొడవలకు పాల్పడటంతో పోలీసులు ఆయా వర్గాలను చెదరగొట్టారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీటీసీ పాదూరి శంకర్‌రెడ్డికి లాఠీ దెబ్బలు తగలడంతో నాయకులు పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. గొడవలు పడుతున్న కార్యకర్తలను చెదరగొట్టే క్రమంలో లాఠీలు తగిలాయని, పోలీసులు సర్ది చెప్పడంతో సమస్య సద్దుమణిగింది.
Comments
Please login to add a commentAdd a comment