సాక్షిప్రతినిధి, నిజామాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో మహిళా ఓటర్లలో వెల్లివిరిసిన చైతన్యం ఎవరికి ప్రయోజనం చేకూర్చనుందనే అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ పార్లమెంట్ ని యోజకవర్గంలో పురుషులతో పో ల్చితే మహిళలు అత్యధికంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉత్సాహంగా పోలింగ్ పోలిం గ్ బూత్‌లకు వచ్చి ఓటేశారు. అభ్యర్థుల గెలుపు ఓటముల్లో కీలకంగా మారిన ఈ మహిళలు ఎవరికి పట్టం గడతారనేదానిపై ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికి వారే లెక్కలేసుకుంటున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరి«ధిలో మొత్తం 15.53 లక్షల మంది ఓటర్లు ఉండగా, ఇందులో 7.37 లక్షల మంది పురుష ఓటర్లు కాగా, 8.15 లక్షల మంది మహిళా ఓటర్లు న్నారు.
వాస్తవానికి పురుషుల కంటే మహిళ ఓటర్లు సుమారు 78 వేలు (సుమారు పది శాతం) అధికంగా ఉన్నారు. గురువారం జరిగిన పోలింగ్ రోజు 5.87 లక్ష ల మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషులు 4.73 లక్షల మంది ఓట్లేయగా, వారికి 1.13 లక్షల మంది మహిళల ఓట్లు అధికంగా పోలయ్యాయి. మొత్తం 68.33 శాతం పోలింగ్ జరిగింది. 64.22 శాతం మంది పురుషులు ఓటేస్తే., మహిళలు 72.06 శాతం ఓటేశారు. అంటే సుమారు 7.64 శాతం మహిళల ఓట్లు అధికంగా పోలయ్యాయి.
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో మహిళా ఓటింగ్ శాతం అత్యధికంగా ఉంది. ఏకంగా 27,277 మంది మహిళలు పురుషుల కంటే ఎక్కువగా ఓట్లేశారు. భారీగా పెరిగిన ఈ పోలింగ్ తమకే అనుకూలమంటూ ప్రధాన పార్టీల అభ్యర్థులు లెక్కలేసుకుంటున్నారు. ఆసరా పింఛన్లు, బీడీ కార్మికుల భృతి, వితంతు పింఛన్లు, ఒంటరి మహిళలు.. ఇలా రకరకాల పింఛన్ల పొందుతున్న లబ్ధిదారులు తమకే పట్టం కడతారని టీఆర్‌ఎస్ పార్టీ బలంగా విశ్వసిస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా వీరికి ప్రతినెల రూ.వెయ్యి చొప్పున పింఛన్లు ఠంచనుగా అం దుతున్నాయి.
ఈ పింఛను మొత్తాన్ని వచ్చే నెల నుంచి రూ.2,016కు పెంచుతామని ఇటీవల టీఆర్‌ఎస్ పార్టీ హామీ ఇచ్చింది. వీటితో పాటు కేసీఆర్ కిట్, అమ్మ ఒడి, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలను మహిళల నుద్దేశించి పకడ్బందీగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమ లు చేస్తోంది. టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎంపీ కల్వకుంట కవిత కూడా తన ఎన్నికల ప్రచారంలో ఎక్కువగా మహిళలతో మమేకమయ్యారు. దాదాపు అన్ని ప్రచార సభల్లోనూ మహిళ ల సందడే అధికంగా కనిపించింది. తన ఎన్నికల ప్రచార ప్రసంగాల్లోనూ మహిళలకే ప్రాధాన్యత ఇచ్చారు.
ఈ నేపథ్యంలో పెరిగిన మహిళా ఓటింగ్ తమ కు అనుకూలమని గులాబీ పార్టీ భావిస్తోంది. ఇటు బీజేపీ కూడా మహిళా ఓటర్లపై ఆశలు పెట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పింఛనులో కేంద్ర సర్కారు వాటా అధికంగా ఉందనే అంశాన్ని ఆ పార్టీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ తన ఎన్నికల ప్రచార ప్రసంగాల్లో మహిళలకు వివరించారు. సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, ఉపాధి హామీ, మరుగుదొడ్ల వంటి పథకాలను ప్రస్తావించి మహిళా ఓటర్లను ప్రస న్నం చేసుకునేందుకు ప్రయత్నించారు.
తనను గెలిపిస్తే ఉచితంగా గృహాల నిర్మాణం వంటి పథకాలను అమలు చేయిస్తానని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్, బీజేపీలతో పోల్చితే కాంగ్రెస్ ప్రచారం అంతంత మాత్రంగానే సాగినా.. మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు తంటాలు పడింది. రాష్ట్ర మంత్రి వర్గంలో మహిళలకు ప్రాతినిధ్యం లేదనే అంశాన్ని ఓటర్లలోకి తీసుకెళ్లి అధికార టీఆర్‌ఎస్ పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం ఆ పార్టీ అభ్యర్థి మధుయాష్కిగౌడ్ చేశారు.
తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీయేనని, అమ్మ రుణం తీర్చుకోవాలనే సెంటిమెంట్‌ను అనుకూలంగా మార్చుకునేందుకు అడుగులు వేశా రు. మరోవైపు కాంగ్రెస్ ఆ పార్టీ మహిళా అధ్యక్షులు నేరెళ్ల శారద, స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి వంటివారిని ప్రచారంలో భాగస్వామ్యులను చేసింది. మొత్తం మీద ప్రధాన పార్టీల అభ్యర్థులు మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎత్తుకు పైఎత్తులు వేశారు. గెలుపు ఓటములను నిర్దేశించే ఈ మహిళా ఓటర్లు ఎవరి కి పట్టం కట్టబెడతారనే అంశంపై ఉత్కంఠ ఫలితాల వెల్లడి వరకు కొనసాగనుంది.
Comments
Please login to add a commentAdd a comment