కౌంటింగ్ కేంద్రంనుంచి బయటకు వచ్చిన అనంతరం కార్యకర్తలకు అభివాదం చేస్తున్న నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కౌంటింగ్ కేంద్రం వద్ద కార్యకర్తలకు అభివాదం చేస్తున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
సాక్షిప్రతినిధి, నల్లగొండ/ సాక్షి,యాదాద్రి : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండు ఎంపీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. నల్లగొండ నుంచి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గెలుపొందారు. నల్లగొండ స్థానం నుంచి అత్యధిక పర్యాయాలు విజయాలు సాధించిన రికార్డును.. కాంగ్రెస్ కాపాడుకుంది. ఆపార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 25,682 ఓట్ల ఆధిక్యంతో టీఆర్‌ఎస్ అభ్యర్థివేమిరెడ్డి నర్సింహారెడ్డిపై విజయం సాధించారు. 2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్ నియోజకవర్గం నుంచి ఆయన అయిదోసారి విజయం సాధించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరు చోట్ల టీఆర్‌ఎస్ విజయం సాధించగా.. ఒక్క హుజూర్‌నగర్‌లో మాత్రమే 7,466 ఓట్ల మెజారిటీతో ఉత్తమ్ కుమార్‌రెడ్డి గెలిచారు. కానీ, లోక్‌సభ ఎన్నికల విషయానికి వచ్చేసరికి పరిస్థితి తారుమారైంది. టీఆర్‌ఎస్ కేవలం సూర్యాపేట, నల్లగొండ సెగ్మెంట్లలోనే కొంత మెజారిటీ సాధించగా, మిగిలిన కోదాడ, హుజూర్‌నగర్, మిర్యాలగూడెం, నాగార్జున సాగర్, దేవరకొండ సెగ్మెంట్లలో ఆధిక్యం సాధించడంతో ఆపార్టీ గెలుపు సునాయాసమైంది. ఏడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ 5,25,508 ఓట్లు సాధించగా, టీఆర్‌ఎస్‌కు 5,00,120 ఓట్లు వచ్చాయి. పోస్టల్, ఇటì పీబీఎస్ ఓట్లు కాంగ్రెస్‌కు 520, టీఆర్‌ఎస్‌కు 226 పోలయ్యాయి. దీంతో మొత్తంగా కాంగ్రెస్‌కు 5,26,028, టీఆర్‌ఎస్‌కు 5,00,346 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్ధి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 25,682ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. కాగా, కాంగ్రెస్‌కు కోదాడ, హుజూర్‌నగర్, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ అసెంబ్లీ సెగ్మంట్లలో 40,371 ఓట్లు ఆధిక్యం రాగా, టీఆర్‌ఎస్‌కు సూర్యాపేట, నల్లగొండ సెగ్మెంట్లలో 14,982ఓట్లు ఆధిక్యం మాత్రమే వచ్చింది.
భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఇలా..
భువనగిరి లోక్‌సభ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ రెండోసారి కైవసం చేసుకుంది. గురువారం జరిగిన కౌంటింగ్‌లో ఆ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన సమీప ప్రత్యర్థి టీఆర్‌ఎస్‌కు చెందిన డాక్టర్ బూర నర్సయ్యగౌడ్‌పై 5,219 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 16,27,527మంది ఓటర్లు ఉండగా 12,10,785మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి 5,32,795 ఓట్లు, బూర నర్సయ్యగౌడ్‌కు 5,27,576 ఓట్లు వచ్చాయి. అలాగే బీజేపీ అభ్యర్థి పీవీ శ్యామ్‌సుందర్‌రావుకు 65, 457, వామపక్షాల అభ్యర్థి గోద శ్రీరాములుకు 28,153 ఓట్లు వచ్చాయి. దీంతో భువనగిరి ఎంపీ స్థానాన్ని రెండోసారి కోమటిరెడ్డి సోదరులు కైవసం చేసుకున్నట్లయింది. 2009లో నూతనంగా ఏర్పాటైన భువనగిరి లోక్‌సభ స్థానాన్ని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోదరుడు ప్రస్తుత మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తొలిసారిగా కైవసం చేసుకున్నాడు. 2014లో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసిన డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ విజయం సాధించారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి విజయం సాధించింది.
తొలిసారి ఎంపీ అయిన వెంకట్‌రెడ్డి
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ నియోజకవర్గం నుంచి ఇటీవల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ భువనగిరి ఎంపీ స్థానం నుంచి గెలుపొంది తొలిసారి పార్లమెంట్‌లో అడుగు పెట్టబోతున్నారు. 2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నల్లగొండ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే 1994లో నల్లగొండ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన 2018వరకు శాసనసభ్యుడిగా నల్లగొండ ప్రజలకు సేవలందించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. దీంతో గతంలో పోగొట్టుకున్న ఎంపీ స్థానాన్ని కోమటిరెడ్డి కుటుంబం తిరిగి చేజిక్కించుకుంది.
మూడుచోట్ల టీఆర్‌ఎస్ ఆధిక్యం
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మూడుచోట్ల టీఆర్‌ఎస్, నాలుగు చోట్ల కాంగ్రెస్ ఆధిక్యతను కొనసాగించాయి. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించిన ఆలేరు, జనగామ, తుంగతుర్తిలో ఈసారి ఆధిక్యతను నిలబెట్టుకోగా భువనగిరి, ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ మెజార్టీ సాధించింది. అలాగే మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ మెజార్టీ సాధించడం విశేషం. అలాగే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి తన నియోజకవర్గంలో ఆధిక్యతను సంపాదించారు.
2009లో కాంగ్రెస్ విజయం
2009లో ఏర్పాటైన భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విజయం సాధించారు. టీడీపీ బలపర్చిన సీపీఎం అభ్యర్థి నోముల నర్సింహయ్యపై 1,39,888ఓట్లతో ఆయన గెలుపొందారు. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసిన చంద్రమౌళి 1,04,878ఓట్లు సాధించారు. డాక్టర్ల జేఏసీ చైర్మనగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ 2014లో టీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఎంపీగా గెలుపొందారు. 3,05,44ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై విజయం సాధించారు. బూ నర్సయ్యగౌడ్‌కు 4,48,164ఓట్లు రాగా, రాజగోపాల్‌రెడ్డికి 417620 ఓట్లు వచ్చాయి. బీజేపీ–టీడీపీ కూటమి పక్షాన పోటీ చేసిన సీనియర్ నేత ఎన్.ఇంద్రసేనారెడ్డికి 1,83,249ఓట్లు వచ్చాయి. ఈ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీలో నాలుగు చోట్ల టీఆర్‌ఎస్, రెండుచోట్ల కాంగ్రెస్, ఒకచోట బీజేపీ ఆధిక్యత పొందాయి. ఇబ్రహీంపట్నంలో బీజేపీకి 6,348 ఓట్ల ఆధిక్యత వచ్చింది. టీఆర్‌ఎస్‌కు మునుగోడులో 11,538, భువనగిరిలో 10,012, ఆలేరులో 19,632, జనగామలో 22,084ఓట్ల మెజార్టీ రాగా, కాంగ్రెస్‌కు నకిరేకల్‌లో 9,059, తుంగతుర్తిలో 4,273ఓట్ల మెజార్టీ వచ్చింది. 2014లో జరిగిన ఎన్నికల్లో నకిరేకల్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశం గెలవగా, ఇక్కడ కాంగ్రెస్‌కు లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ వచ్చింది. తుంగతుర్తిలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్ గెలుపొందగా, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మెజార్టీ వచ్చింది.
భువనగిరి పార్లమెంట్ గెలుపు ప్రజా విజయం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
సాక్షి, యాదాద్రి : భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గెలుపు ప్రజా విజయమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణ శివారులోని అరోరా ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రానికి వచ్చిన అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ గెలుపు కేసీఆర్ పరిపాలనకు సమాధానంగా భావించాలన్నారు. గతంలో చేసిన పోరాటాలు గుర్తించి ప్రజలు తమకు విజయాలు అందించాలన్నారు. తక్కువ మెజార్టీ వచ్చినప్పటికీ ధర్మం, న్యాయం గెలిచిందన్నారు. ప్రజలు కోమటిరెడ్డి సోదరులను ఆదరిస్తున్నారన్నారు. విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసినప్పటికీ టీఆర్‌ఎస్‌ను ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కేసీఆర్, కేటీఆర్‌కు బుద్ధి చెప్పినట్లయిందన్నారు. ఈనెల 31న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోమటిరెడ్డి లక్ష్మి గెలుపు ఖాయమని చెప్పారు. 27న జరిగే ప్రాదేశిక ఎన్నికల కౌంటింగ్ అనంతరం మూడు జిల్లాల జెడ్పీ చైర్మన్‌లను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని చెప్పారు.
నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్ సాధించిన ఓట్ల వివరాలు
నల్లగొండ లోక్‌సభ స్థానం.. పోలైన ఓట్లు11,75,129
కాంగ్రెస్ 5,26,028
టీఆర్‌ఎస్ 5,00,346
కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 25,682ఓట్ల ఆధిక్యంతో వేమిరెడ్డి నర్సింహారెడ్డిపై విజయం సాధించారు
భువనగిరి లోక్‌సభ స్థానం..
పోలైన ఓట్లు 12,11,156
కాంగ్రెస్ 5,32,031
టీఆర్‌ఎస్ 5,27,235
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 4,796 ఓట్ల మెజార్టీతో డాక్టర్ బూర నర్సయ్యగౌడ్‌పై గెలుపొందారు.
భిన్నమైన తీర్పు
ఆలేరు : పార్లమెంట్ ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గంలో ఓటర్లు భిన్నమైన తీర్పునిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి..టీఆర్‌ఎస్ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌పై గెలుపొందారు. నియోజకవర్గంలో వెంకట్‌రెడ్డికి 72063 ఓట్లు రాగా, బూర నర్సయ్యగౌడ్‌కు 82223 ఓట్లు పోలయ్యాయి. ఈ నియోజకవర్గంలో 10,160 ఓట్లు టీఆర్‌ఎస్ అభ్యర్థికి మెజార్టీ లభించింది. ఆలేరు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థికి భారీ మెజార్టీ ఇవ్వాలని ప్రస్తుత ఎమ్మెల్యే గొంగిడి సునీత విస్తృతంగా ప్రచారం చేశారు. ఇది ఇలా ఉంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి బూడిద భిక్షమయ్యగౌడ్‌పై 33,086 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. సునీతకు 94,870 ఓట్లు రాగా, భిక్షమయ్యకు 61,784 ఓట్లు లభించాయి. బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన రాంచంద్రారెడ్డికి 11923 ఓట్లు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment