లష్కర్‌ గుండెపై కమలం జెండా | Kishan Reddy Win in Secunderabad | Sakshi
Sakshi News home page

లష్కర్‌ గుండెపై కమలం జెండా

Published Fri, May 24 2019 7:18 AM | Last Updated on Fri, May 24 2019 7:18 AM

Kishan Reddy Win in Secunderabad - Sakshi

మెట్టుగూడలో మిఠాయిలు పంచుతున్న బీజేపీ నాయకులు

సాక్షి,సిటీబ్యూరో: లష్కర్‌ లోక్‌సభ స్థానంపై కాషాయ జెండా మరోమారు జయకేతనం ఎగురవేసింది. సీనియర్‌ నేతను బరిలో నిలిపి సిట్టింగ్‌ సీటును ఆ పార్టీ భారీ మెజార్టీతో నిలబెట్టుకుంది. బీజేపీ అభ్యర్థి గంగాపురం కిషన్‌రెడ్డి సమీప టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తలసాని సాయికిరణ్‌ యాదవ్‌పై 62,114 ఓట్ల ఆధిక్యంతో ఘనవిజయం సాధించారు. అయితే 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలుపొందిన బండారు దత్తాత్రేయ 2.54 లక్షల ఓట్ల మెజార్టీ సాధించిన విషయం విదితమే. ఈ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ తగ్గినప్పటికీ గెలుపు తీరాన్ని చేరుకుంది. నాంపల్లి మినహా ఈ లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలోని ముషీరాబాద్, సికింద్రాబాద్, అంబర్‌పేట్, సనత్‌నగర్, జూబ్లీహిల్స్‌ నియోజకవర్గాల్లో బీజేపీ హవా కనిపించింది. ఈ స్థానం నుంచి గెలుపొందిన కిషన్‌రెడ్డి గతంలో బీజేపీ శాసన సభాపక్ష నేతగా, పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా, గతంలో బీజేవైఎం అఖిల భారత అధ్యక్షుడిగా సేవలందించారు.

ఆయనకు  బీజేపీ శ్రేణులతోపాటు అన్ని నియోజకవర్గాల్లో విద్యావంతులు, మేధావులు, మహిళలు, మైనార్టీలు భారీగా ఓట్లు వేయడంతో విజయం నల్లేరు మీద నడకైంది. గతంలో ఆయన ప్రాతినిథ్యం వహించిన అంబర్‌పేట్‌ అసెంబ్లీ నియోజకవ్గంలో ఆయన ఏకంగా టీఆర్‌ఎస్‌ పార్టీ కంటే 45 వేల పైచిలుకు ఓట్ల అధిక్యం సాధించడం విశేషం. ముషీరాబాద్‌లోనూ టీఆర్‌ఎస్‌ కంటే 35 వేల పైచిలుకు ఓట్లను అధికంగా సాధించారు. సికింద్రాబాద్‌లో 8 వేలకుపైగా అధికంగా ఓట్లు సాధించారు. జూబ్లీహిల్స్‌లోనూ టీఆర్‌ఎస్‌ కంటే బీజేపీ 24 వేల ఓట్లు అధికంగా సాధించింది. సనత్‌నగర్‌ నియోజకవర్గంలోనూ టీఆర్‌ఎస్‌ కంటే బీజేపీ 14 వేల పైచిలుకు ఆధిక్యాన్ని కనబరిచింది. నాంపల్లి నియోజకవర్గంలో మాత్రం బీజేపీ కంటే టీఆర్‌ఎస్‌ 30 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యం దక్కడం గమనార్హం. ఈ ఎన్నికల్లో మోడీ ప్రభంజనంతో పాటు ఈ నియోజకవర్గం పరిధిలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, ఏబీవీపీ, బీజేవైఎం తదితర సంఘాలకు సంస్థాగతంగా గట్టి పట్టుంది.

ఆయా సంస్థల కార్యకలాపాలకు దశాబ్దాలుగా పలు అసెంబ్లీ సెగ్మెంట్లు పెట్టని కోటగా ఉన్నాయి. బీజేపీ అభివృద్ధి నినాదాన్ని ఇంటింటికీ తీసుకెళ్లడంలో ఆ పార్టీ శ్రేణులు విజయం సాధించాయనే చెప్పవచ్చు. ఇక టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తలసాని సాయికిరణ్‌ యాదవ్‌కు రాజకీయ అనుభవం లేకపోవడం, అతని తండ్రి ఇప్పటికే మంత్రిగా కొనసాగుతండడంతో ఆ కుటుంబానికే తిరిగి ఎంపీ సీటును కట్టబెట్టడం గులాబీ పార్టీ శ్రేణులకు సైతం రుచించలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పుల్వామా ఉగ్రదాడుల నేపథ్యంలో దేశ సమగ్రత, భద్రతకు మోదీ సర్కారు పెద్దపీఠ వేస్తుందన్న నమ్మకంతో మెజార్టీ సిటీజన్లు కమలం పార్టీకి ఓట్లు వేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. సాధారణంగా వ్యాపారులు, ఉత్తరాది ఓటర్లు అత్యధికంగా ఉండే ఈ లోక్‌సభ నియోజకవర్గంలో ఆయా వర్గాలు బీజేపీకి ఓట్లు వేశాయన్నది కిషన్‌రెడ్డి గెలుపుతో రూఢీ అయింది.   

రౌండ్‌ రౌండ్‌కు పెరిగిన కిషన్‌రెడ్డి ఆధిక్యత :14 టేబుళ్లు, 20 రౌండ్లలో లెక్కింపు  
ముషీరాబాద్‌: సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ముషీరాబాద్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ ఓట్ల లెక్కింపు గురువారం ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించారు. నియోజకవర్గంలో పోలైన 1,39,002 ఓట్లను 14 టేబుళ్లపై 20 రౌండ్లలో లెక్కించారు. ఇందులో బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డికి 65,969 ఓట్లు, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తలసాని సాయికిరణ్‌ యాదవ్‌కు 41,564 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి ఎం.అంజన్‌కుమార్‌ యాదవ్‌కు 26,554 ఓట్లు పోలయ్యాయి. కిషన్‌రెడ్డి తన సమీప టీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై నియోజకవర్గంలో 24,395 ఓట్లు అధిక్యాన్ని సాధించారు. మొత్తం 20 రౌండ్లలో 18 రౌండ్లలో బీజేపీ అధిక్యత సాధించగా 8, 9 రౌండ్లలో టీఆర్‌ఎస్‌ అధిక్యతను చూపించింది. ఇక కాంగ్రెస్‌ పార్టీ ఏ రౌండ్‌లోనూ పోటీ ఇవ్వకుండా మూడో స్థానానికి పరిమితమైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement