సాక్షి, హైదరాబాద్ : ఈ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకు నుంచి రూ.8 కోట్లు డ్రా చేసిన సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డిపై ఫిర్యాదు చేసినా ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదంటూ టీఆర్‌ఎస్ అభ్యర్థి తలసాని సాయికిరణ్ ఎన్నికల ఏజెంట్ పవన్‌గౌడ్ హైకోర్టును ఆశ్రయించారు. కిషన్‌రెడ్డిపై చర్యలు తీసుకునేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి, సికింద్రాబాద్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్‌బీఐ, ఇండియన్ బ్యాంక్, భారతీయ జనతా పార్టీలతో పాటు కిషన్‌రెడ్డిని ప్రతివాదులుగా పేర్కొన్నారు.
ఇండియన్ బ్యాంక్ నారాయణగూడ బ్రాంచ్‌లో కిషన్‌రెడ్డి బీజేపీ ఖాతా నుంచి రూ.8 కోట్లు విత్‌డ్రా చేశారని, ఓటర్లను ప్రభావితం చేసేందుకు, ప్రలోభాలకు గురి చేసేందుకే ఇంత మొత్తం తీసుకున్నారని పిటిషనర్ తెలిపారు. ఎన్నికల సమయంలో నిబంధనల ప్రకారం రూ.2 లక్షల కంటే ఎక్కువ డ్రా చేయడానికి వీల్లేదన్నారు. అయితే బ్యాంక్ అధికారులు ఏకంగా రూ.8 కోట్లు డ్రా చేసి ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమన్నారు. అలాగే ఆదాయ పన్ను చట్ట నిబంధనలకు కూడా విరుద్ధమని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా వ్యవహించిన బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరినా, ఎన్నికల సంఘం నుంచి స్పందన లేదన్నారు. అందుకే ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశామని, ఇందులో జోక్యం చేసుకుని ఎన్నికల సంఘానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు.
Comments
Please login to add a commentAdd a comment