సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీఆర్‌ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదని, అది తెలంగాణ రోగాల పార్టీ అని, తెలంగాణ రోత పార్టీ అని, తెలంగాణ రాక్షస పార్టీ అని లక్ష్మణ్ దుయ్యబట్టారు. ఎన్నికల తరువాత కేసీఆర్ అవినీతిపై విచారణ చేయిస్తామంటే, తనపై వ్యక్తిగతదాడులకు దిగుతున్నారని, భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ తన భరతం పడతా అంటున్నారని, ఆయన బెదిరింపులకు, తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ఇటీవల బీజేపీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్‌తో కలసి శనివారం ఇక్కడ పార్టీ కార్యాలయంలో లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆనందభాస్కర్‌కు శాలువా కప్పి సన్మానించారు. అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్రం దాటితే టీఆర్‌ఎస్ చెల్లని రూపాయి అని ఎద్దేవా చేశారు.
ఒవైసీ మెప్పు కోసమే ప్రధాని నరేంద్రమోదీని సీఎం కేసీఆర్ తిడుతున్నారని, సంకలో సైతాన్‌ను పెట్టుకొని కేసీఆర్ హిందుత్వ గురించి మాట్లాడితే ఎవరూ నమ్మరన్నారు. ఎవరు హిందువులు, బొందువులనేది ఈ ఎన్నికల్లో తేలుతుందన్నారు. బీజేపీ విధానాలు, పార్టీ సిద్ధాంతాలు, మోదీ సంస్కరణలు నచ్చి ఆనందభాస్కర్ బీజేపీలో చేరారన్నారు. మోదీ చరిష్మా దేశవ్యాప్తంగా సాగుతుండగా ప్రతిపక్షాలు కుట్రపూరితంగా అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో 3 స్థానాలు గెలుచుకోండి... అని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హేళనగా మాట్లాడుతున్నారని, మూడు కాదు దేశవ్యాప్తంగా మూడువందల సీట్లు గెలిచి, మూడు చెరువుల నీళ్లు తాగించి, ముచ్చెమటలు పట్టించడం ఖాయమని హెచ్చరించారు.
కూతురు కోసమే...
నిజామాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన కూతురు కవిత ఓడిపోతుందనే భయంతో ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ మాజీమంత్రి మండవ వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లారని లక్ష్మణ్ అన్నారు. ఉద్యమకారులను పక్కనపెట్టి వేలంపాటలో సీట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. రైతుబంధుతో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే, ఇప్పుడు నిజామాబాద్‌లో ఆ రైతులే తిరగబడి పెద్దఎత్తున నామినేషన్లు దాఖలు చేశారన్నారు. ఫాంహౌస్ నుంచి బయటకు రాని కేసీఆర్ దేశరాజకీయాల్లోకి వెళ్తారట.. అని ఎద్దేవా చేశారు. ‘అందితే జుట్టు, అందకపోతే కాళ్లు..’అన్నట్లుగా కేసీఆర్ వ్యవహారముందన్నారు. టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే కల్వకుంట్ల కుటుంబానికి బానిసలుగా మారాల్సి వస్తుందని హెచ్చరించారు. తాము టీఆర్‌ఎస్‌ను నీడలా వెంటాడుతామని, అవినీతిపై పోరాడతామన్నారు. ఎన్డీయే అధికారంలోకి రాగానే రాజకీయాల్లో పెను మార్పులు రాబోతున్నాయని వ్యాఖ్యానించారు. కుటుంబ రాజకీయాలు, అవినీతి కారణంగానే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కనుమరుగవుతోందని అన్నారు.
సమూల మార్పులు రానున్నాయి...
రాపోలు ఆనందభాస్కర్ మాట్లాడుతూ ఐదుగురితో ప్రారంభమైన బీజేపీ ఇప్పుడు దేశాన్ని అగ్ర రాజ్యాల సరసన చేర్చిందన్నారు. సైద్ధాంతికంగా ఆలోచించినందునే తన అడుగులు బీజేపీ వైపు పడ్డాయన్నారు. రాజకీయాల్లో సమూల మార్పులు రాబోతున్నాయని, దానికి మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల తీర్పే ఉదాహరణ అని పేర్కొన్నారు. కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ దేశభక్తిని కించపరుస్తోందని, రామమందిర నిర్మాణం జాతీయవాదంతో ముడిపడి ఉందన్నారు.
రామమందిరం కట్టాలో వద్దో కేసీఆర్, కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంఎంటీఎస్ తెచ్చింది తానేనని, మెట్రోరైల్‌కు అంకురార్పణ చేసింది తానేనన్నారు. హైదరాబాద్‌కు కృష్ణా నీళ్లు వస్తున్నాయంటే, దానికి కారణం వాజ్‌పేయి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో వీరితోపాటు బీజేపీ నేతలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, చేవెళ్ల, సికింద్రాబాద్, అభ్యర్థులు బెక్కరి జనార్ధన్‌రెడ్డి, కిషన్‌రెడ్డి, మీడియా కమిటీ కన్వీనర్ సుధాకరశర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ సమక్షంలో ముషీరాబాద్ మాజీ కార్పొరేటర్ ప్రకాశ్‌గౌడ్, సునీత ప్రకాశ్‌గౌడ్ తదితరులు బీజేపీలో చేరారు.
శ్రమిస్తే విజయం తథ్యం: శశిభూషణ్ శర్మ
వికారి నామ సంవత్సరంలో బీజేపీ శక్తివం చన లేకుండా శ్రమిస్తే విజయం లభిస్తుందని పండి తుడు, పంచాంగ శ్రవణ కర్త శశిభూషణ్ శర్మ పేర్కొన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆధ్వర్యంలో శనివారం ఉగాది సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పంచాంగ శ్రవ ణ కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ ధనుస్సు రాశి కిందకు వస్తుందని శర్మ తెలిపారు. రాశుల వారీగా కూడా ఈ సంవత్సరంలో ఆదాయ, వ్యయాలు, రాజ్యపూజ్యం, అవమానం వం టì అంశాలు వివరించారు. కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి దత్తా్తత్రేయ, రాపో లు ఆనందభాస్కర్, పొంగులేటి సుధాకరరెడ్డి, జనార్దనరెడ్డి, కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment