
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ కారు.. పదహారు.. తెలంగాణ ప్రజలకు బేకారు అని బీజేపీ నేత కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌కి వేసే ప్రతి ఓటు వృథానే అని అన్నారు. గురువారం బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ బీజేపీని మతతత్వ పార్టీ అని కేటీఆర్ విమర్శించడం తగదన్నారు. తమది మతోన్మాద పార్టీ కాదని.. కానీ హిందూ సమస్యల పట్ల పోరాడుతామని స్పష్టం చేశారు. ‘ఖాసీం రజ్వీ స్థాపించిన ఎంఐఎంతో పొత్తు పెట్టుకొని మమ్మల్ని విమర్శిస్తున్నారు. ఆస్తులు లాక్కొని రాజకీయాలు చేస్తున్న పార్టీ ఎంఐఎం. హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఎంఐఎంని పక్కన పెట్టుకొని దేశభక్తి కలిగిన బీజేపీని విమర్శించడం సరికాదు. కేటీఆర్ ఊహాలోకంలో ఉన్నారు. ప్రాంతీయ పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి వస్తుందని పగటి కలలు కంటున్నారు. కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను ఇష్టారీతిన చేర్చుకుని టీఆర్‌ఎస్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతోంది’ అని కిషన్‌రెడ్డి విమర్శించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ఆవశ్యకత ఉందా
అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆవశ్యకత ఉందా.. రాహుల్‌కు ఓటు అడిగే నైతిక హక్కు ఉందా.. అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. రాహుల్ రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్‌లో ఓ పెద్ద వికెట్ పడుతోందన్నారు. ‘రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌లో మిగిలేది ఎందరో తెలియని పరిస్థితి. ఇంకా చాలా మంది తమ పార్టీలోకి వస్తారని కేసీఆర్ అంటున్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కి ప్రత్యామ్నాయం బీజేపీనే. బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే కేంద్రంలో మంత్రులు అవుతారు. నేను తప్పకుండా పోటీ చేస్తాను. ఎక్కడ నుంచి పోటీ చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుంది. ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి కుటుంబంతో సహా ఎవరినైనా మోసం చేస్తారు. ఆయన కలవని పార్టీ లేదు..’అని కిషన్‌రెడ్డి విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment