సాక్షి, మహబూబాబాద్: లోక్‌సభ ఎన్నికలు గురువారం ముగియటంతో అందరి దృష్టి ఫలితాలపై పడింది. ఈవీఎంలలో ఎంపీ అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తమైంది. మే 23వ తేదీ గురువారం రోజున కౌంటింగ్
జరగనుంది. ఫలితాల పై అభ్యర్థులతో పాటు ప్రజల్లో కూడా ఉత్కంరత నెలకొంది. గెలుపు ఎవరిని వరిస్తుందో అంచనాలకు అందడం లేదు. ఓటింగ్ శాతం అనూహ్యంగా తగ్గటంతో ఫలితాలు ఎలా ఉంటాయోనని అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు. మానుకోట పార్లమెంట్ నియోజకవర్గంలోని పోలింగ్ 1737 కేంద్రాల్లో జరిగింది. సాయంత్రం పోలింగ్ ముగిసిన అనంతరం ఎన్నికల సిబ్బంది ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం, వీవీప్యాట్)లను పోలింగ్ కేంద్రాల నుంచి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు.
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అలాగే సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే జిల్లాలో ఎక్కడ చూసినా ఎన్నికల ఫలితాల పైనే చర్చ జరుగుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ ఎంపీ అభ్యర్థులు పోలింగ్ సరళిని విశ్లేషించుకునే పనిలో నిమగ్నమయ్యారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు గతంలోలాగా కాకుండా వేరువేరుగా రావటంతో, పోలింగ్ శాతం తగ్గవచ్చని రాజకీయ పార్టీలు అంచనా వేశాయి. అంచనాలకు అనుగుణంగా పోలింగ్ శాతం గతంలో కంటే తగ్గింది. దీంతో ఓటింగ్ ప్రభావాన్ని విశ్లేషించుకునేందుకు ఎంపీ అభ్యర్థులు పోలింగ్ బూత్‌ల వారీగా ఓట్ల లెక్కలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. రేపు, ఎల్లుండి ప్రధాన పార్టీల రాజకీయ పార్టీల అభ్యర్థులు పార్టీ ముఖ్యనాయకులు, బూత్ కన్వీనర్‌లతో సమావేశాలు ఏర్పాటు చేసుకోవటానికి సిద్ధమవుతున్నారు. ఈ సమావేశంలో ఓటింగ్ తీరు తెనులతోపాటు పార్టీ విజయావకాశాలను ఎంపీ అభ్యర్థులు విశ్లేషించుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment