Voting on Telangana
-
సిరాను చెరిపేసి.. రెండోసారి ఓటేసి!
సాక్షి, కెరమెరి(ఆసిఫాబాద్): కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన నిబంధనలు అక్కడ పనిచేయలేదు.. ఒక ఓటరు ఒక రోజు ఒకే రాష్ట్రానికి ఓటేయ్యాలని నిబంధన ఉన్నప్పటికీ అక్కడి ఓటర్లలో కొందరు రెండు రాష్ట్రాలకు ఓటేసినట్లు సమాచారం. తెలంగాణ, మహారాష్ట్ర వివాదాస్పద సరిహద్దు గ్రామాల్లోని ఓటర్లు గురువారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు తెలంగాణతో పాటు మహారాష్ట్ర పోలింగ్ బూత్ కేంద్రాలోనూ ఓటు హక్కును విని యోగించుకున్నారు. తమ ఎడమ చేతి చూపుడు వేలుకు ఉన్న సిరా చుక్కను చెరిపేసి రెండో ఓటు కూడా వేశారు. ఈ సంఘటనలు పరందోళి, ముకదంగూడ, అంతాపూర్ పోలింగ్ కేంద్రాల్లో జరిగి నట్లు సమాచారం. నిమ్మకాయతో చెరిపేసి.. ఓటర్లు వివిధ క్రియలతో రెండు ఓట్లను ఉపయోగించుకున్నారు. కొందరు తలకు నూనే రాసుకుని వచ్చారు. ఎన్నికల కేంద్రంలో అధికారులు వేలికి సిరాను అంటించంగా బయటికి వచ్చేసి ఆ వేలిని తలకు రాయడంతో సిరా కనిపించకుండా పోతుం ది. అలాగే కొందరు వేలికి అంటిన సిరాను నిమ్మకాయ రసంతో చెరిపేస్తున్నారు. ఇంకొందరు నిమ్మకాయ రసంలో నాన్చిన పుల్లతో సిరాను చేరి పేసి రెండో సారి ఓటు వేశారు. మిగిలిన కుటుం బాల్లో సగం తెలంగాణ, మరోసగం మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఓటేశారు. కెరమెరి మండలంలోని మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాలుగు పోలింగ్ కేంద్రాలతో పాటు, మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐదు పోలింగ్ బూత్ కేంద్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగిందని సమాచారం. ప్రయాణానికి ఇబ్బంది పడిన ఓటర్లు మండలంలో భోలాపటార్ గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ కేంద్రానికి రావాడానికి ఎలాంటి ప్రయాణ సౌకర్యాలు లేక లేక కొందరు కాలినడకతో రాగా.. మరి కొందరు ప్రైవేటు వాహనాలను ఎంగేజ్ చేసుకుని రావడం కనిపించింది. వృద్ధులు, వికలాంగులకు ఎలాంటి సౌకర్యం లేక ఇబ్బంది పడ్డారు. ఉదయం పది గంటల వరకు మందకోడిగా సాగిన పోలింగ్ తర్వాత ఊపందుకుంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరందోలి పోలింగ్ కేంద్రంలో (పరందోలి, తాండ, లేండిజాల, చింతగూడ, శంకర్‌లొద్ది) ముకదంగూడలో (మహరాజ్‌గూడ, ముకదంగూడ) భోలాపటార్‌లో (భోలాపటార్, గౌరి, లేండిగూడ)అంతాపూర్లో (అంతాపూర్, ఏసాపూర్, నారాయణగూడ, ఇంద్రానగర్, పద్మావతి) గ్రామాలున్నాయి. మహారాష్ట్రలోని పోలింగ్ కేంద్రాల్లోనూ మన గ్రామాలున్నాయి. పరందోలి పోలింగ్ బూత్‌లో (ముకదంగూడ, లేండిజాల, కోటా, పరందోలి) వణిలో ( శంకర్‌లొద్ది), మహరాజ్గూడలో (మహారాజ్‌గూడ), భోలాపటార్‌లో (పలస్‌గూడ, ఏసాపూర్, లేండిగూడ, నారాయణగూడ, భోలాపటర్) పుడ్యాన్మొహదాలో (పద్మావతి, అంతాపూర్) గ్రామాలున్నాయి. -
పోలింగ్ తగ్గెన్.. ఓటింగ్ ముగిసెన్
సాక్షి, జగిత్యాల: లోక్‌సభ సమరం ముగిసింది. గురువారం నిర్వహించిన ఎన్నికల్లో 70.04 శాతం పోలింగ్ నమోదైంది. గతంలో కంటే ఈసారి పోలింగ్ శాతం భారీగా తగ్గింది. అసెంబ్లీ ఎన్నికల్లో 77.61 శాతం నమోదైంది. జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గంలో పోలింగ్ ముగిసే సమయానికి మొత్తం 62.53శాతం నమోదైంది. జగిత్యాల నియోజకవర్గంలో 69.20 శాతం, కోరుట్ల నియోజకవర్గంలో 68.85శాతం ఓటింగ్ నమోదైంది. ఎండ తీవ్రంగా ఉండడంతో మధ్యాహ్నం వరకే చాలా కేంద్రాలు బోసిపోయి కనిపించాయి. కొన్నిచోట్ల ఈవీఎంల మొరాయింపుతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. తగ్గిన ఓటింగ్ అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 77.61 శాతం పోలింగ్ నమోదుకాగా ప్రస్తుతం 70.04 శాతానికి పరిమితమైంది. ధర్మపురి నియోజకవర్గంలో అసెంబ్లీలో 78.02శాతం ఓటింగ్ జరిగితే ఈసారి 62.53, కోరుట్లలో అసెంబ్లీ ఎన్నికల్లో 75.45 శాతం, లోక్‌సభ ఎన్నికల్లో 68.85, జగిత్యాలలో 79.35 శాతం నుంచి 69.20 శాతానికి పడిపోయింది. తగ్గిన ఓటింగ్ శాతం ఎవరికి మేలు చేస్తుందనే చర్చ ఆసక్తిగా మారింది. మొరాయించిన ఈవీఎంలు జిల్లాలో పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. మాక్‌పోలింగ్ నిర్వహణ జాప్యం కావడంతో పోలింగ్ సైతం ఆలస్యంగా ప్రారంభమైంది. రాయికల్ మండలం మూటపల్లి, మైతాపూర్ బూత్ నంబరు 46, పెగడపల్లిలోని 262 పోలింగ్‌కేంద్రంలో, సారంగాపూర్తోపాటు కోనాపూర్ గ్రామాల్లో 9 గంటలకు పోలింగ్ మొదలైంది. కోరుట్ల మండలం పైడిమడుగులో 114 పోలింగ్‌కేంద్రం, కోరుట్లలోని 181 ఈవీఎంలో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. మల్లాపూర్తోపాటు రాఘవపేటలోని 84 పోలింగ్‌కేంద్రంలో, మల్లాపూర్ మండలం వెంకట్రావ్‌పేటలోని 59 పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు మొరాయించడంతో అధికారులు సీజ్ చేశారు. జగిత్యాల మండలం ధరూర్‌లో గంట ఆలస్యంగా పోలింగ్ మొదలైంది. జిల్లా కేంద్రంలోని 164 పోలింగ్‌కేంద్రంలో ఈవీఎంలు పనిచేయక 9 గంటల తర్వాత పోలింగ్ ప్రారంభమైంది. లింగంపేటలో, మెట్‌పల్లిలోని 196 కేంద్రంతోపాటు కోరుట్లలోని కల్లూరు 141 కేంద్రాల్లో ఉదయం 9 గంటల తర్వాత పోలింగ్ మొదలైంది. జగిత్యాలలోని కొత్తవాడలో ప్రభుత్వ బాలికల పాఠశాల, జగిత్యాల మండలం కల్లెడ, పొరండ్ల గ్రామాల్లో పోలింగ్ ముగింపు సమయంలో ఈవీఎంలు మొరాయించడంతో ఓటింగ్ జాప్యమైంది. కేంద్రాలు సందర్శించిన అభ్యర్థులు జిల్లా కేంద్రంలోని బీట్‌బజార్ 192 పోలింగ్ కేంద్రాన్ని టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత సందర్శించారు. గొల్లపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్ సందర్శించారు. ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం పోలింగ్ ముగిసిన వెంటనే ఈవీఎంలు స్ట్రాంగ్‌రూమ్‌లకు చేరాయి. పటిష్ట బందోబస్తు మధ్య ఈవీఎంలను ఎన్నికల అధికారులు జిల్లా కేంద్రంలోని వీఆర్కే కళాశాలకు తరలించారు. ఓటింగ్ ముగియడంతో నిజామాబాద్ స్థానం నుంచి బరిలో ఉన్న 185 మంది అభ్యర్థుల భవితవ్యం ఇప్పు డు ఈవీఎంల్లో నిక్షిప్తమైంది. ఈ ఎన్నికపై అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ప్రజా తీర్పు మే 23న వెలువడనుంది. -
ఈవీఎంలలో దాగిన భవితవ్యం
సాక్షి, మహబూబాబాద్: లోక్‌సభ ఎన్నికలు గురువారం ముగియటంతో అందరి దృష్టి ఫలితాలపై పడింది. ఈవీఎంలలో ఎంపీ అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తమైంది. మే 23వ తేదీ గురువారం రోజున కౌంటింగ్ జరగనుంది. ఫలితాల పై అభ్యర్థులతో పాటు ప్రజల్లో కూడా ఉత్కంరత నెలకొంది. గెలుపు ఎవరిని వరిస్తుందో అంచనాలకు అందడం లేదు. ఓటింగ్ శాతం అనూహ్యంగా తగ్గటంతో ఫలితాలు ఎలా ఉంటాయోనని అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు. మానుకోట పార్లమెంట్ నియోజకవర్గంలోని పోలింగ్ 1737 కేంద్రాల్లో జరిగింది. సాయంత్రం పోలింగ్ ముగిసిన అనంతరం ఎన్నికల సిబ్బంది ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం, వీవీప్యాట్)లను పోలింగ్ కేంద్రాల నుంచి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అలాగే సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే జిల్లాలో ఎక్కడ చూసినా ఎన్నికల ఫలితాల పైనే చర్చ జరుగుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ ఎంపీ అభ్యర్థులు పోలింగ్ సరళిని విశ్లేషించుకునే పనిలో నిమగ్నమయ్యారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు గతంలోలాగా కాకుండా వేరువేరుగా రావటంతో, పోలింగ్ శాతం తగ్గవచ్చని రాజకీయ పార్టీలు అంచనా వేశాయి. అంచనాలకు అనుగుణంగా పోలింగ్ శాతం గతంలో కంటే తగ్గింది. దీంతో ఓటింగ్ ప్రభావాన్ని విశ్లేషించుకునేందుకు ఎంపీ అభ్యర్థులు పోలింగ్ బూత్‌ల వారీగా ఓట్ల లెక్కలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. రేపు, ఎల్లుండి ప్రధాన పార్టీల రాజకీయ పార్టీల అభ్యర్థులు పార్టీ ముఖ్యనాయకులు, బూత్ కన్వీనర్లతో సమావేశాలు ఏర్పాటు చేసుకోవటానికి సిద్ధమవుతున్నారు. ఈ సమావేశంలో ఓటింగ్ తీరు తెనులతోపాటు పార్టీ విజయావకాశాలను ఎంపీ అభ్యర్థులు విశ్లేషించుకోనున్నారు. -
ఆగుతూ.. సాగుతూ పోలింగ్
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాలకు పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. చెదురు ముదురు టనలు మినహా పోలింగ్ సజావుగా సాగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రెండు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని మొత్తం 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రజలు ఓటుహక్కు వినియోగించుకున్నారు. అధికారులు సమస్యాత్మకంగా గుర్తించిన జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఉదయం 7 గంటలకు మొదలై సాయంత్రం 4గంటలకే ముగియగా.. మిగతా నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. అరగంట నుంచి గంట ఆలస్యం పోలింగ్ ప్రారంభం సమయంలో వరంగల్ అర్భన్, వరంగల్ రూరల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాల్లోని 12 నియోజకవర్గాల్లో అక్కడక్కడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంలు) మొరాయించడంతో అరగంట నుంచి గంటన్నర ఆలస్యంగా పోలింగ్ మొదలైంది. దీంతో చాలాచోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి కనిపించారు. అయితే, నిర్ణీత సమయం లోగా కేంద్రాలకు వచ్చిన వారందరూ ఓటు వేసేందుకు అధికారులు అనుమతించారు. కాగా వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాల్లో జరిగిన పోలింగ్ వివరాలను గురువారం రాత్రి అధికారులు వెల్లడించారు. వరంగల్ లోక్‌సభ పరిధిలో 60.41 శాతం, మహబూబాబాద్‌లో 64.46 శాతంగా నమోదైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారుల పేరిట విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. కాగా, గత ఎన్నికలతో పోలిస్తే ఈ రెండు పార్లమెంట్ స్థానాల్లోనూ పోలింగ్ శాతం భారీగా తగ్గడం గమనార్హం. మందకొడిగా ప్రారంభమై.. వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాల్లోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో అన్ని చోట్లా ఉదయం ఏడు గంటలకు మందకొడిగా మొదలైన పోలింగ్ 9 గంటల తర్వాత పుంజుకుంది. చాలాచోట్ల ఈవీ ఎంలు మొరాయించడం కారణంగా ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ ముగిసే సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్న ఉన్నవారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని అధికారులు కల్పించారు. సమస్యాత్మక నియోజకవర్గం భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 4 గంటలే కాగా, మిగతా ప్రాంతాల్లో అక్కడక్కడా రాత్రి వరకు పోలింగ్ కొ నసాగించారు. సాయంత్రం 5 గంటల వరకు వరంగల్ పార్లమెంట్ పరి«ధిలో 60.41 శాతం, మహబూబాబాద్ పరిధిలో 64.46 శాతంగా పోలింగ్ నమోదైనట్లు రాత్రి 10.30 గంటలకు ఆయా జిల్లాల రిటర్నింగ్ అధికారులు వెల్లడించారు. మొరాయించిన ఈవీఎంలు అక్కడక్కడా ఈవీఎంలు మొరాయించడంతో కొద్దిసేపు ఆలస్యం జరిగినా... మొత్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అధికారులు ఎప్పటికప్పుడు సరిచేస్తూ ఓటర్లకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు చేపట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆత్మకూరు మండలం కంఠాత్మకూరు, చిల్పూరు మండలం మల్కాపూర్, హసన్‌పర్తి మండలం మడిపెల్లి, వరంగల్ 27వ డివిజన్ ఏవీవీ కళాశాల పోలింగ్ బూత్ 87, పర్వతగిరి మండలం చింతనెక్కొండలో 238, ఆత్మకూరులో 105 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు చాలాసేపు మొరాయించాయి. మహబూబాబాద్ లోక్‌సభ పరిధి నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండలం కొనపురం బూత్ నెంబర్ 195, బొజేరువులో 221 పోలింగ్ కేంద్రాల్లోను ఈవీఎంలు మొరాయించాయి. వీటితో పాటు చాలాచోట్ల ఈవీఎంలు మొరాయించగా.. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు పరిస్థితులను చక్కదిద్ది పోలింగ్ సజావుగా సాగేలా చూశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఆయా జిల్లాల పోలీసు కమీషనర్లు, ఎస్పీలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. భూపాలపల్లి, ములుగు, నర్సంపేట, మహబూబాబాద్, తదితర ప్రాంతాల్లోని సమస్యాత్మక, మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో ప్రత్యేక పోలీసు బలగాలు పహారా కాశాయి. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని ప్రాంతాలు, సమస్యాత్మక గ్రామాల్లో గస్తీ బందాలు, స్రైకింగ్ ఫోర్సు, పోలీసుల పహారా పెంచారు. ఓటేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, వీఐపీలు లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, ఎస్పీలు గురువారం తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. రాష్ట్ర, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ భార్య ఈటల జమున, కుమారుడు, కూతురు, కోడలుతో కలిసి వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆయన సతీమణి ఉషా దయాకర్ పర్వతగిరిలో ఓటేశారు. ఇక రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ఆయన కుమారుడు, హుస్నాబాద్ ఎమ్మెల్యే వి.సతీష్‌కుమార్ వారి స్వగ్రామం హుజూరాబాద్ మండలం సింగాపురంలో ఓటు వేశారు. హన్మకొండ టీచర్స్ కాలనీ కమ్యూనిటీ హాల్లో మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, కుటుంబసభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.బొల్లికుంటలో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్, కుటుంబ సభ్యులు, నక్కలగుట్ట వాటర్‌ట్యాంక్ బూత్‌లో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కుటుంబసభ్యులు, వడ్డెపల్లి ప్రభుత్వ పాథమిక పాఠశాలలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, కుటుంబసభ్యులు, వరంగల్ పెరుకవాడలో తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్ కుటుంబీకులతో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అర్ట్స్ కళాశాలలోని పోలింగ్ కేంద్రంలో వరంగల్ అర్బన్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్, జాయింట్ కలెక్టర్ దయానంద్, హన్మకొండలో వరంగల్ రూరల్ కలెక్టర్ హరిత, జులైవాడలోని ఎస్టీ హాస్టల్ పోలింగ్ బూత్‌లో టీఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, కుటుంబ సభ్యులు ఓటు వేశారు. గణనీయంగా తగ్గుదల 2014 సాధారణ ఎన్నికల పోలింగ్‌తో పోలిస్తే ఈసారి గణనీయంగా తగ్గింది. వరంగల్ లోక్‌సభ పరి«ధిలో 2014లో 76.56 శాతం పోలింగ్ నమోదు కాగా ఈసారి 63.08 శాతానికే పరిమితమైంది. అంటే 13.48 శాతం పోలింగ్ తగ్గినట్లు. అదే విధంగా మహబూబాబాద్ లోక్‌సభకు 2014లో 82.81 శాతం పోలింగ్ జరగగా, ఈసారి 13.70 శాతం తగ్గి 69.11 శాతానికే పరిమితమైంది. కాగా పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో తొలుత పోలింగ్ ప్రక్రియ కొంత ఆలస్యమైనప్పటికీ ఆ తర్వాత క్రమంగా పుంజుకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ తీరును ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షించారు. ఎన్నికల పరిశీలకులు వీణా ప్రదాన్, అమిత్‌కుమార్ సింగ్‌లు పలు కేంద్రాలను సందర్శించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ప్రశాంత్ జీవన్ పాటిల్, శివలింగయ్య, కలెక్టర్లు హరిత, వినయ్‌కృష్ణారెడ్డి, వాసం వెంకటేశ్వర్లులు పోలింగ్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. -
ఎండదెబ్బతో పోల్ డౌన్
సాక్షి, భూపాలపల్లి: గత లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే ములుగు, భూపాలిపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ప్రస్తుత ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గింది. పోలింగ్ శాతం పెరుగుతుందని ఆశించిన అధికారుల అంచనాలు తలకిందులయ్యాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి రాకపోవడం, పోలింగ్ స్లిప్పులను పంచకపోవడం, ఎండలు తీవ్రంగా ఉండడం వంటి అంశాలు గురువారం జరిగిన లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌పై ప్రభావం పడినట్లు తెలిసింది. మహబూబాబాద్ ఎంపీ పరి«ధిలోని ములుగు అసెంబ్లీ నియోజకవర్గంలో 66.08 శాతం, వరంగల్ ఎంపీ పరిధిలోని భూపాలపల్లి అసెంబ్లీ నియోజకర్గంలో 52 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. పెద్దపల్లి ఎంపీ పరిధిలోని మంథని అసెంబ్లీ సెగ్మెంట్లో 58.25 శాతం ఓట్లు పోలయ్యాయి. రెండూ ఒకే సారి రాకపోవడమే.. రాష్ట్రంలో 2014లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకే సారి నిర్వహించారు. ఈ సారి సీఎం కేసీర్ఆర్ ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లడంతో ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలపై ప్రజలు ఆసక్తి చూపించలేదనే విషయం స్పష్టమవుతోంది. గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో 80 శాతానికి మించి పోలింగ్ నమోదైంది. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ములుగు, భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో తక్కువ శాతం ఓట్లు పోలయ్యాయి. వరుసగా ఎన్నికలు రావడం కూడా లోక్‌సభ ఎన్నికలపై తీవ్రప్రభావం పడింది. ముఖ్యంగా దూర ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తున్నవారితో పాటు విద్యార్థులు సొంత ఊళ్లకు రావడానికి విముఖత చూపినట్లు సమాచారం. భానుడి భగభగ.. ఓటింగ్ శాతంపై ఎండలు తీవ్ర ప్రభావం చూపాయి. రెండు జిల్లాల్లో ఉదయం ఓటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మందకొడిగానే సాగింది. ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటడంతో జనాలు మధ్యాహ్నం పూట బయటకు రావడానికి జంకారు. దీంతో ములుగు, భూపాలపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లతో ఓటింగ్ శాతం తగ్గింది. ఎండ తీవ్రత కారణంగా ఉదయం 7 గంటల నుంచి నుంచి 11 గంటల వరకే ఎక్కువ మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు చాలా తక్కువగా పోలింగ్ నమోదైంది. 3 గంటల తర్వాత పోలింగ్ ముగిసే వరకు మళ్లీ పోలింగ్ ఊపందుకుంది. అంతంత మాత్రంగా ప్రచారం.. పల్లెల్లో ఎన్నికల వాతావరణంకనిపించలేదు. గత అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల్లో పండగ వాతావరణం కనిపించింది. ఈసారి మాత్రం గ్రామాల్లో ఆ జోషే లేదు. చాలా వరకు అభ్యర్థుల ప్రచారాలు, రోడ్ షోలు పట్టణాలకే పరిమితమయ్యాయి. దీంతో గ్రామాల్లోని రాజకీయ పార్టీల కార్యకర్తలు కానీ, నేతలు కానీ కనీసం ప్రచారం కూడా చేయలేదు. దీంతో పల్లెల్లో ఎన్నికల కళ తప్పింది. గత ఎన్నికల్లో ఇంటింటికి వచ్చి ఓటేశారా లేదా అని ఆరా తీసిన నేతలు ప్రస్తుతం మొహం చాటేశారు. పోలింగ్ కేంద్రాల దగ్గర పార్టీల సందడే కనిపించలేదు. గ్రామాల్లో కనీసం పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లు కూడా తెలియని పరిస్థితి ఉంది. నియోజకవర్గాల పరిధి పెద్దది కావడంతో ఈసారి గ్రామాల్లో కార్యకర్తలను, నేతలను అభ్యర్థులు పట్టించుకోలేదనే వాదన నేతల్లో ఉంది. గడిచిన అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో కార్యకర్తలు పెద్ద ఎత్తున ఖర్చు చేశారు. ఈసారి ఆ పరిస్థితి కనపడలేదు. ఇన్ని కారణాలతో కిందిస్థాయి కార్యకర్తలు, నేతలు లోక్‌సభ ఎన్నికలపై ఆసక్తి చూపించలేదు. -
ఏళ్లకు తీరిన ఓట్ల కష్టం
కెరమెరి(ఆసిఫాబాద్): అదో కుగ్రామం. కెరమెరి మండలానికి అతి సమీపం. ఏ కాలంలో.. ఏ సందర్భంలో ఆ గ్రామాన్ని సిర్పూర్(యూ) మండలంలో చేర్పించారో ఎవరికి తెలియదు. అనాదిగా వారు కష్టాలు అనుభవిస్తున్నారు. సమస్యల్లోనే కాదు ఓట్లు వేయడంలోనూ వారికి ఇబ్బందులే.. అదే సిర్పూర్(యూ) మండలంలోని బాబ్జిపేట్ గ్రామ పంచాయతీలోని మెట్టిగూడ గ్రామం. అక్కడ నివసిస్తున్నది గోండు తెగలు, ఆదివాసీలు. మొత్తం జనాభా 129, పురుష ఓటర్లు 31, మహిళా ఓటర్లు 38 మొత్తం కేవలం 69 మంది మాత్రమే ఉన్నారు. ఏళ్ల తర్వాత తీరిన సమస్య! ప్రతిసారి జరిగే ఎన్నికల్లో వారు ఓటు వేయాలంటే 24కిలో మీటర్ల దూరంలోని పంగిడి పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓట్లు వేయకతప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటీవల నిర్వహించిన శాసన సభ ఎన్నికల్లో మాత్రం వారు 6కిలో మీటర్ల సమీపంలోని బాబ్జిపేట్ (ఖాతీగూడ) గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. దేశంలో ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ నుంచి వారు ప్రతిసారి జరిగే ఎన్నికల్లో 24కిలో మీటర్ల దూరం వెళ్లి ఓటు వేయాల్సి వచ్చేది. రెండు గుట్టలు ఎక్కడం.. రాళ్లు రప్పల రహదారి. విషప్రాణులు సంచరించే అభయారణ్యం అయినా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవాలనే తపనతో వారు ఎంత దూరమైన కాలిబాటతో వెళ్లి ఓటు వేసేవారు. కానీ ఈసారి ఎన్నికల నిబంధన ప్రకారం రెండు కిలో మీటర్ల దూరంలో పోలింగ్‌స్టేషన్ ఉంటే స్వంత గ్రామంలోనే పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయవచ్చనే నిబంధన వారి సమస్యకు చెక్ పడినట్లయింది. రికార్డుకెక్కిన ఆదివాసీ గ్రామం... తెలంగాణ రాష్ట్రంలోని అతితక్కువ మంది ఓటర్లు ఉన్న పోలింగ్ బూత్ కేంద్రంగా మెట్టిగూడ రాష్ట్ర రికార్డుల్లో చేరింది. తమ గ్రామంలోనే పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడంతో అక్కడి ఆదివాసీల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఇన్నాళ్లు రాళ్లు రప్పలు, వాగులు వంకలు దాటి అష్టకష్టాలు పడేవాళ్లమని కానీ అధికారులు మాపై కరుణ చూపారని వారు పేర్కొంటున్నారు. -
సీమాంధ్ర, తెలంగాణ నేతల వ్యూహ, ప్రతివ్యూహాలు
హైదరాబాద్ : రాష్ట్ర విభజన బిల్లుపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పొడగించిన గడువు నేటితో ముగుస్తున్న నేపధ్యంలో సర్వత్రా ఉత్కంఠ రేగుతోంది. ఎక్కడచూసినా విభజన బిల్లుపైనే చర్చ జరుగుతోంది. అన్నిపార్టీల నేతలూ గురువారం అసెంబ్లీలో, శాసనమండలిలో అనుసరించాల్సిన వ్యూహ, ప్రతివ్యూహాలపై చర్చల్లో తలమునకలయ్యారు. బిల్లుపై గడువు ఇవాళ్టితో ముగియటంతో అసెంబ్లీ సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. బిల్లుపై చర్చకు మరింత గడువు పెంచాలంటూ ముఖ్యమంత్రితో పాటు పలు పార్టీలు రాసిన లేఖలపై రాష్ట్రపతి నుంచి ఇంతవరకు ఎలాంటి సమాచారం రాలేదు. దీనిపై ఉదయం 11 గంటల్లోపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆతర్వాతే ఓటింగ్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సభలో తీవ్ర గందరగోళ పరిస్థితులుండటంతో స్పీకర్ ఎలా వ్యవహరిస్తారన్నదే ప్రస్తుతం కీలకంగా మారింది. మరోవైపు సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత నేతలు పోటా పోటీగా భేటీలు జరుపుతున్నారు. ఓటింగ్ పెట్టాలని సీమాంధ్ర, ఓటింగ్ జరగకుండా చేయాలని తెలంగాణ ప్రాంత నేతలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. పార్టీలకు అతీతంగా అసెంబ్లీ కమిటీ హాల్లో చర్చలు జరుపుతున్నారు. -
బిల్లుపై ఓటింగ్ ఉండాల్సిందే: విజయమ్మ
ఓట్లకోసం, సీట్లకోసం ప్రాంతాలవారీగా కాంగ్రెస్ , టీడీపీలు వాదనలు వినిపిస్తున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. కాని మేం రాజకీయంగా నష్టాలన్ని లెక్కచేయకుండా ఒకే వాదాన్ని వినిపిస్తున్నాం అని వైఎస్ విజయమ్మ తెలిపారు. మీరు స్వార్థంతో వాదనలు వినిపిస్తున్నారని, మేం త్యాగంతో ఒకే వాదన వినిపిస్తున్నామని వైఎస్ విజయమ్మ అన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రజల మధ్య విబేధాలు సృష్టిస్తున్నాయని విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు-2013 పై ఓటింగ్ ఉండాల్సిందే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున విజయమ్మ డిమాండ్ చేశారు.