కారు.. జోరు! | TRS Win in Warangal | Sakshi
Sakshi News home page

కారు.. జోరు!

Published Fri, May 24 2019 12:34 PM | Last Updated on Fri, May 24 2019 12:34 PM

TRS Win in Warangal - Sakshi

వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌తో సంబరాల్లో అభిమానులు

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: ఉద్యమాల ఖిల్లా.. ఉమ్మడి వరంగల్‌ జిల్లా జనం మళ్లీ గులాబీ జెండాకే జైకొట్టారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఊపిరులూదిన ఈ జిల్లా లోక్‌సభ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టింది. రాజకీయ ఉద్ధండుల కోటగా పేరొందిన ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఈసారి కూడా కారు జోరు కొనసాగించింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మొత్తం రెండు లోక్‌సభ స్థానాలు ఉండగా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు అసెంబ్లీ సెగ్మెంట్లు కలుపుకుని 14 శాసనసభ నియోజకవర్గాలున్నాయి. ఈ ఎన్నికల్లోటీఆర్‌ఎస్‌కు 14 చోట్ల కూడా భారీ ఆధిక్యం లభించింది. వరంగల్, మహబూబాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. వరంగల్‌ నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పసునూరి దయాకర్‌ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ అభ్యర్థి దొమ్మాటి సాంబయ్యపై 3,50,298 ఓట్ల గణనీయమైన మెజార్టీ సాధించారు. ఇక మహబూబాబాద్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాలోతు కవిత తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ అభ్యర్థి పోరిక బలరాంనాయక్‌పై 146663 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

టీఆర్‌ఎస్‌ నేతల విజయ విహారం
వరంగల్, మహబూబాబాద్‌ పార్లమెంట్‌ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు మొదటి నుంచి ఆధిక్యం కొనసాగించారు. ప్రత్యర్థులను దరిదాపుల్లోకి రాకుండా రౌండ్‌ రౌండ్‌కు మెజార్టీ పొం దారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో వరంగల్‌ స్థానాన్ని ఎస్సీలకు రిజర్వ్‌ చేశారు. ఈ స్థానం నుంచి 2009లో సిరిసిల్ల రాజయ్య(కాంగ్రెస్‌) ఎంపీగా గెలుపొందగా, 2014లో టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసిన కడియం శ్రీహరి 3,92,574 ఓట్లతో గెలుపొందారు. ఆ తర్వాత తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన ఎంపీ స్థానానికి రాజీనామా చేయడంతో వచ్చిన ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పసునూరి 4,59,403 ఓట్ల మెజార్టీతో గెలు పొంది రికార్డు నెలకొల్పారు. కాంగ్రెస్, టీడీపీకి కంచుకోటగా ఉన్న వరంగల్‌ నుంచి వరుసగా రెండు సార్లు భారీ మెజార్టీతో గెలిచిన టీఆర్‌ఎస్‌... ఈ ఎన్నికల్లోనూ విజయపతాకం ఎగురవేసింది. అయితే ఈసారి పోలింగ్‌ శాతం తగ్గినప్పటికీ... 3,50,289 ఓట్ల ఆధిక్యం సాధించిన దయాకర్‌ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ సాధించిన ఎంపీగా రికార్డులకెక్కారు.

మానుకోటలో..
2009లో చేపట్టిన నియోజకవర్గాల పునర్విభజనలో మహబూ బాబాద్‌(ఎస్టీ) లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి గతంలోని వరంగల్‌ పార్లమెంట్‌ స్థానంలోని మహబూబాబాద్‌(ఎస్టీ), డోర్నకల్‌(ఎస్టీ), ములుగు(ఎస్టీ), నర్సంపేట(జనరల్‌) అసెంబ్లీ నియోజకవర్గాలు, రద్దయిన భద్రాచలం(ఎస్టీ) లోక్‌సభ స్థానంలోని పినపాక(ఎస్టీ), ఇల్లందు(ఎస్టీ), భద్రాచలం(ఎస్టీ) వచ్చి చేరాయి. ఈ స్థానం నుంచి 2009లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలిచిన పోరిక బలరాం నాయక్‌కు కేంద్రమంత్రి పదవి దక్కగా.. ఆయనపై 2014 ఎన్నికల్లో ప్రొఫెసర్‌ సీతారాంనాయక్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా 34,992 ఓట్ల ఆధిక్యంతో గెలు పొందారు. ఈ ఎన్నికల్లో అదే కాంగ్రెస్‌ అభ్యర్థి బలరాం నాయక్‌పై మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాలోతు కవిత 1,46,663 ఓట్ల మెజార్టీతో గెలిచి రికార్డు సాధించడం విశేషం.

ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు
పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలు గురువారం వెల్లడి కావడంతో 43 రోజుల ఉత్కంఠకు తెరపడినట్లయింది. పోలింగ్‌ ముగిసిన మరుసటి రోజు నుంచి ఫలితాల కోసం ఇటు నేతలు, అటు ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూశారు. ఇక గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన లెక్కింపు ప్రక్రియ సాయంత్రం వరకు కొనసాగింది. పోస్టల్, ఈటీపీబీఎస్‌(ఎలక్ట్రానిక్‌ ట్రాన్స్‌మిటెడ్‌ పోస్టల్‌ బ్యాలెట్‌) ఓట్లు.. ఆ తర్వాత ఈవీఎంలు, అనంతరం వీవీ ప్యాట్లలోని స్లిప్‌లను లెక్కించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని వరంగల్, మహబూబాబాద్‌ లోక్‌సభ పరిధిల్లో ఏడు చొప్పున అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వరంగల్‌లో ఏనుమాముల మార్కెట్, మహబూబాబాద్‌లో సాంఘిక సంక్షే మ బాలికల గురుకుల కళాశాలలో నిర్వహించిన ఓట్ల లెక్కింపు చేపట్టగా ప్రశాతంగా ముగిసింది. ఉదయం 8 గంటలకు స్ట్రాం గ్‌ రూమ్‌లో ఉన్న ఈవీఎంలను కౌంటింగ్‌ కేంద్రాలకు తీసుకొచ్చి, ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓట్లను 14 టేబుళ్లలో లెక్కించారు. వరంగల్‌ పరిధిలో భూపాలపల్లిలో అత్యధికంగా 24, అత్యల్పంగా వరంగల్‌ తూర్పులో 16 రౌండ్లలో ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించారు. అదే విధంగా మానుకోట పరిధిలో అత్యధికంగా ములుగులో 22, అతి తక్కువగా భద్రాచలం నియోజకవర్గంలో 13 రౌండ్లలో లెక్కించాక అధికారులు ఫలితాలను ప్రకటించారు. కాగా, వీవీ ప్యాట్ల విషయంలో ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు చొప్పున లాటరీ పద్ధతిన ఎంపిక చేసి లెక్కించారు. దీనికి అరగంట నుంచి గంట సమయం పట్టింది. కాగా ఎన్నికల ఫలితాలు తెలుసుకోవడానికి ఈసారి సువిధ యాప్‌ను అందుబాటులోకి తీసుకు రాగా, ఫలితాలను రౌండ్ల వారీగా అధికాకారులు అప్‌డేట్‌ చేశారు.

‘ఎర్రబెల్లి’ సూచనలతో ముందుకు..
లోక్‌సభ ఎన్నికలకు ముందు మంత్రి పదవి చేపట్టిన ఎర్రబెల్లి దయాకర్‌రావు కృషి ఫలించింది. పార్లమెంట్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థుల భారీ విజయం సాధించడానికి ఆయన పన్నిన వ్యూహం కలిసొచ్చింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి ఒక్క ఎర్రబెల్లికే మంత్రిగా అవకాశం కల్పించిన సీఎం కేసిఆర్‌.. జిల్లాకు చెందిన రెండు లోక్‌సభ స్థానాలను గెలిపించాల్సిన బాధ్యతను ఆయన భుజస్కందాలపై ఉంచారు. నాటి నుంచి పలు నియోజకవర్గాల్లో పర్యటించి, టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థుల విజయానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలు, నాయకులను కలుపుకుని పర్యటనలు చేశారు. పలు నియోజకవర్గాల్లో పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్మలాటలను సద్దుమణిగేలా చేయగలిగారు.

ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం తగ్గినా.. వరంగల్‌ పార్లమెంట్‌ స్థానాన్ని దయాకర్‌రావు తన రాజకీయ అనుభవంతో రాష్ట్రంలోనే మెజార్టీలో అగ్రస్థానంలో నిలుపగలిగారు. ఇక మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలోనూ విస్తృతంగా పర్యటించిన ఆయన పార్టీ అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థి విజయానికి కృషి చేశారు. నాటి వరంగల్‌.. నేటి మహాబూబాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ, ఎవరికి రాని మెజార్టీ సాధించడం వెనుక మంత్రి కృషి ఉందని చెప్పాలి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలోని అంతర్గత విభేధాలతో ములుగు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పరాజయం పొందడంతో.. పార్లమెంట్‌ ఎన్నికల్లో పునరావృతం కాకుండా జాగ్రత్తలు చేపట్టారు. పార్టీ నాయకుల మధ్య ఎప్పటికప్పుడు సమన్వయ సమావేశాలు ఏర్పాటుచేసి మహబూబాబాద్‌ లోక్‌సభ ఎన్నికల్లో ములుగు నియోజకవర్గం అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా కృషి చేశారు. ఈ ఎన్నికల్లో రెండు పార్లమెంట్‌ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయాన్ని సాధించేలా మంత్రాంగం నడిపిన ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రత్యేక గుర్తింపు పొందారు.  

కేసీఆర్‌ పథకాలతోనే గెలుపు
తెలంగాణలో సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలే నా గెలుపునకు సహకరించాయి. మంత్రి దయాకర్‌రావుతో పాటు టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలందరూ నా విజయం కోసం అహర్నిశలు శ్రమించారు. వారితో పాటు నాకు ఓటు వేసిన ప్రజలందరికీ రుణపడి ఉంటా. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వరంగల్‌పై ప్రత్యేక దృష్టి సారించడంతో అత్యధిక మెజార్టీ సాధించడానికి దోహదపడింది.  – పసునూరి దయాకర్, వరంగల్‌ ఎంపీ

నమ్మకాన్ని నిలబెట్టుకుంటా..
మహబూబాబాద్‌: ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తా. సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మెచ్చిన ప్రజలు నన్ను గెలిపించారు. టీఆర్‌ఎస్‌ హయాంలో అమలవుతున్న పథకాలే నా విజయానికి దోహదపడ్డాయి. మంత్రి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తల సహకారం మరువలేనిది. నన్ను గెలిపించిన ప్రజల సమస్యలు పరిష్కరించేలా అందుబాటులో ఉంటా.– మాలోతు కవిత, మహబూబాబాద్‌ ఎంపీ

వరంగల్‌ లోక్‌సభ స్థానం
మొత్తం ఓట్లు : 16,66,085
పోలైన ఓట్లు : 10,61,672
విజేత : పసునూరి దయాకర్‌ (టీఆర్‌ఎస్‌)
సాధించిన ఓట్లు :  6,12,498

రెండో స్థానం : దొమ్మాటి సాంబయ్య(కాంగ్రెస్‌)
సాధించిన ఓట్లు : 2,62,200
టీఆర్‌ఎస్‌ ఆధిక్యం : 3,50,298
మహబూబాబాద్‌ లోక్‌సభ
మొత్తం ఓట్లు : 14,24,385
పోలైన ఓట్లు : 9,83,708

విజేత : మాలోతు కవిత (టీఆర్‌ఎస్‌)
సాధించిన ఓట్లు : 4,62,109
రెండో స్థానం : పోరిక బలరాంనాయక్‌ (కాంగ్రెస్‌)
సాధించిన ఓట్లు : 3,15,446
టీఆర్‌ఎస్‌ ఆధిక్యం : 1,46,663

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement