భూపాలపల్లిలో ప్రచారం నిర్వహిస్తున్న లోక్‌సభ ఎంపీ అభ్యర్థి దయాకర్, సిరికొండ
సాక్షి, భూపాలపల్లి: ఉదయం ఎనిమిది గంటలు దాటితే సూర్యుడు సుర్రుమంటున్నాడు. పది దాటితే రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు మాత్రం ఎండలను లెక్కచేయకుండా కులసంఘాలు, కీలక వర్గాలు, యూనియన్ల వారీగా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమవుతున్నారు. ఒంటి నుంచి చెమటలు కక్కుతున్నా వెనుకడుగు వేయడం లేదు. ఉదయం
నుంచి రాత్రి వరకు బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రచారానికి నాలుగు రోజులే మిగిలి ఉండడంతో దూసుకెళ్తున్నారు. నియోజకవర్గాల వారీగా కీలకంగా ఉన్న వర్గాల ఓట్లను ఆకర్షించేందుకు ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు. అన్ని పార్టీల లోక్‌సభ అభ్యర్థులు కీలకమైన వర్గాలతో ములాఖత్ అవుతూ ఓట్లు అడుగుతున్నారు. స్వయంగా పోటీలో ఉన్న అభ్యర్థులే అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సుడిగాలి ప్రచారాలు నిర్వహిస్తున్నారు. భూపాలపల్లిలో సింగరేణి కార్మికులు, రైతుల ఓట్లు కీలకం కాగా ములుగు అసెంబ్లీ పరిధిలో గిరిజనేతరులు, సెటిలర్ల ఓట్ల కోసం పడరాని పాట్లు.. ఫీట్లు చేస్తున్నారు.
కార్మికుల చుట్టే రాజకీయం..
భూపాలపల్లి జిల్లాలో కార్మికుల చుట్టూ ఓట్ల కోసం అభ్యర్థులు తిరుగుతున్నారు. వరంగల్ లోక్‌సభ పరిధిలో అధిక ఓట్లు ఉండడం, సింగరేణి, జెన్‌కో కార్మికులు కీలకం కావడంతో ఈ వర్గాలను ఆకర్షించే పనిలో నేతలు ఉన్నారు. కార్మికుల ఓట్లు 30 వేల వరకు ఉంటే పరోక్షంగా మరో 20 వేల ఓట్ల వరకు ప్రభావితం చేసే అవకాశం ఉండడంతో ప్రతీ పార్టీకి వీరు కీలకమవుతున్నారు. అన్ని పార్టీల నాయకులు కార్మికుల ఓట్ల కోసం గనుల్లో పర్యటిస్తున్నారు. కార్మికులు షిఫ్ట్‌లు మారే సమయంలో ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
టీఆర్‌ఎస్ తరఫున పసునూరి దయాకర్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి కార్మికులను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. కాంగ్రెస్ తరఫున అభ్యర్థి దొమ్మాటి సాంబయ్య, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి గనుల్లో ఇప్పటికే పర్యటించారు. వీటితో పాటు కేటీపీపీ కార్మికులు కూడా ఎన్నికల్లో కీలకం కానున్నారు. సింగరేణితో పోలిస్తే తక్కువ ఓట్లు ఉన్నప్పటికీ వీరిని కూడా తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్దపల్లి పరిధిలోకి వచ్చే జిల్లాలోని ఐదు మండలాల్లో రైతుల ఓట్లు కీలకంగా మారాయి. ఈ ఐదు మండలాల్లో పెద్ద సంఖ్యలో రైతులు ఉన్నారు. వీరి ఓట్లను ప్రసన్నం చేసుకున్న వారికి మెజారిటీ వచ్చే అవకాశం ఉంది.
గిరిజనేతరులు, సెటిలర్లే టార్గెట్
మహబూబాబాద్ ఎంపీ పరిధి కిందకు వచ్చే ములుగు అసెంబ్లీ సెగ్మెంట్‌లో గిరిజనేతరులు, సెటిలర్ల ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు బరిలో ఉన్న పార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఎస్టీ రిజర్వ్‌డ్ పార్లమెంటరీ స్థానంలో కావడంతో ఇప్పుడు అందరి దృష్టి నాన్ ఎస్టీ ఓటర్లపై పడింది. గెలుపోటములు, మెజారిటీ రావాలన్నా ఈ వర్గంపై ఎక్కువ దృష్టి పెట్టాలని ప్రతీ రాజకీయ పార్టీకి తెలుసు. ప్రస్తుతం పోటీలో ఉన్న అందరు అభ్యర్థులు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో ఎస్టీల ఓట్లు ఎలాగోలా అందరికీ పడతాయి.
ఎస్టీ ఓట్లు పోటీల ఉన్న అందరూ అభ్యర్థులు చీల్చుకుంటే గిరిజనేతర, సెటిలర్ ఓట్లే కీలకం అవుతాయి. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఈ వర్గాలు కీలకంగా మారాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. భూపాలపల్లితో పోలిస్తే ములుగు నియోజకవర్గంలో కమిటీల పేరుతో అన్ని పార్టీలు పోల్ మేనేజ్ మెంట్ చేసేందుకు పథకాలు రచిస్తున్నాయి. ఇదే విధంగా ములుగు నియోజకవర్గంలో గోవిందరావుపేట, మంగపేట, ఏటూరునాగారం, వాజేడు, వెంకటాపురంలో సెటిలర్ల ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లు ఎటు పడుతాయనేది ప్రాధాన అంశంగా మారింది.
ప్రచారంలో దూకుడు..
ఎక్కువ ఓట్లు ఉన్న వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు స్వయంగా పర్యటిస్తున్నారు. వరంగల్ లోక్‌సభ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్, కాంగ్రెస్ అభ్యర్థి దొమ్మాటి సాంబయ్య భూపాలపల్లిలో కార్మికులను ఓట్లు కోరారు. అదే విధంగా పెద్దపల్లి ఎంపీ పరిధిలోకి వచ్చే ఐదు మండలాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి బోర్లకుంట వెంకటేష్ నేత ప్రచారం చేస్తున్నారు. ములుగులో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్, టీఆర్‌ఎస్ తరఫున మాలోత్ కవిత తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. వీరికి మద్దతుగా ఎమ్మెల్యే సీతక్క, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య సెటిలర్లు, గిరిజనేతరుల మద్దతు కోసం శ్రమిస్తున్నారు. టీఆర్‌ఎస్‌కు అన్నీ తానై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అండగా నిలుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment