పనులు జేసెటోళ్లనే ఢిల్లీకి పంపుడు! | Politicadl Setirical Story on Lok Sabha Elections | Sakshi
Sakshi News home page

పనులు జేసెటోళ్లనే ఢిల్లీకి పంపుడు!

Published Mon, Apr 8 2019 10:09 AM | Last Updated on Mon, Apr 8 2019 10:09 AM

Politicadl Setirical Story on Lok Sabha Elections - Sakshi

‘అరె, ఎవలకేం జెప్పుడు.. ఎలచ్చన్లు రాంగనే ఎవలకు తోసినట్లు గాళ్లు మాట్లాడబట్టిరి. ఎవల ముచ్చట్లిన్న నమ్మబుద్దైతది. ఇప్పుడు గిట్ల జెప్పేటోళ్లు ఇంతకు ముందుగాల గెల్చి సుత ఎందుకు పట్టించుకోలే. గిప్పుడేమో మస్తు నీతులు చెప్తాండ్లు. గిదేం సిత్రమో..’ అని గులుక్కుంట గోపాలు అగ్గి మీద గుగ్గిలమైకుంట గా ఆరెంపీ డాక్టర్‌ రవి ఇంటిగల్మకాడికచ్చిండు.

‘అగ్గో .. ఏందో.. నోట్ల్యనోట్ల్యనే నీకు నువ్వే గులుక్కుంట అత్తన్నవేంది’ అని గోపాల్ను సూడంగనే రవి డాక్టరడిగిండు. ‘గట్లనే.. మెల్లగ ఇంట్లకడ్గు పెట్టన్న’డు రవి డాక్టరు.
‘అవుగని.. డాక్టరు సాబ్‌.. దునియల ఏంజర్గుతాందేంది? ఎలచ్చన్ల నిలబడ్డోల్లంత రామ సక్కని ముచ్చట్లు చెప్తండ్లు. ఎవల్నీ నమ్మాలో సూతారం ఎర్కైతలేదు. జెరంత గా ముచ్చట్లేవో దెల్సుకుందామని నీకాడికచ్చిన’న్నడు గోపాలు.

‘ఇగో గోపాలు.. దునియల గిప్పుడు ఎంపీ ఎలచ్చన్లు అచ్చినయ్‌ గదా. గిన్నేండ్లు ఏలినోళ్లు మనకు, మన రాష్ట్రానికి ఏం జెయ్యలె. గిప్పుడు తెలంగాణ అచ్చింది గదా. మనకున్న 16 సీట్లు మొత్తం మనమే గెల్సుకుంటే ఇగ ఢిల్లీల  చక్రం దిప్పచ్చని ముఖ్యమంత్రి కేసీయార్‌ భరోసిత్తండ’న్నడు రవి డాక్టర్‌.
‘అగ్గో.. గట్లంటవా డాక్టరూ.. గా ముచ్చట్లన్నీ ఉత్తయే. కేసీయార్ను నమ్మద్దని ఎవల కాల్లు మీటింగులు బెట్టి గా కాంగ్రెస్, బీజేపోళ్లు చెప్తండ్లు’ అన్నడు జెరమత్తే సూదేపిచ్చుకోనికి డాక్టరింటి కచ్చిన ఎంకటేసు.
‘గాళ్లన్నది సుత కరస్టే అనిపిత్తంది. గట్లని కేసీయార్‌ ముచ్చట్లను ఉత్తగా తీసేసేటట్టు లేవ్‌. గిప్పుడు దునియ మొత్తంల గా కాంగ్రెస్, బీజేపోళ్లు బలం లేక డీలపడి పోతండ్లంట. గట్ల గా పార్టోళ్లకు మెజార్టీ రాదంటండ్లు. మన రాష్ట్రంలున్న 16 సీట్లు కారు గుర్తోళ్లు గెల్సుంటే గాళ్లకు మన ఎంపీల హిమ్మతిప్పిచ్చి గట్ల ఏర్పాటయ్యే సర్కార్తోనీ మస్తు పనులు జేపియచ్చు. మన రాష్టాన్నీ గట్ల మస్తు ముందుకు తీస్కెల్లచ్చనీ ఎర్కజెప్తండ్లు టీయారెసోళ్ల’ని ఇడమర్చి చెప్పిండు రవి డాక్టరు.

‘అబ్బా. గా ముచ్చట్లల్ల గంత ఇసారం దాగుందన్న మాట’న్నడు గోపాలు.
‘అవును మల్ల. అరవై ఏండ్ల సంది ఏలి మనకు ఏం ఎల్గబెట్లిండ్లు? ఉత్త చేతులే చూపిండ్లు గదా. ఇక గిప్పుడు గిలిపిత్తే సుత మొకం తెల్వీ దెచ్చుకుని ఏమన్న పనులు జేత్తరనే నమ్మకం నాకైతే గల్గుతలేద’న్నడు గాళ్ల  ముచ్చట్లినుకుంట బెంచీ మీద కొసకు గూసోనున్న శెంకర్‌.

‘గట్ల గాదుగని.. గిప్పుడైతే దునియ మొత్తంల మన తెలంగాణ గురించే ముచ్చట్లు బెట్టు కుంటండ్లు. ఎవుసందార్లకు పంట పెట్టుబడి ఎకరానికి లెక్కగట్టి ఇచ్చుడు. ఖర్మగాలి పంట పండక, చేసినప్పు తీర్సుడెట్లనో దెల్వక పాణం తీసుకున్న, ఇంకేమన్నై చనిపోయిన సుత ఏం కిరికిరి జేయకుండా ఐదు లచ్చలు నెల లోపల్నే ఇప్పిత్తండ్లు గదా. గట్ల మంచి స్కీములు పెట్టి అందరి మన్సును కేసీయారు దోసుకున్నడు. గందుకనే తెలంగాణలున్న 16 సీట్లు సుత గెలిపించుకోవాలంటాం’డ్లని ఎర్క జప్పిండు రవి డాక్టరు.

‘అది సరేగని డాక్టరు సాబ్‌.. కేసీయార్‌ గింత పెధానమంత్రయితడా’ అని రవి డాక్టర్ను అమాయకంగా అడిగిండు శెంకర్‌.
‘మొన్న వరంగల్లుల జర్గిన మీటింగులనైతే పెధానమంత్రి గావల్ననీ నాకు లేదు. మెజార్టీ సీట్లను గెలిపిచ్చుకోవాలే. గట్ల ఏరే పార్టోళ్లకు మన ఎంపీలతోని హిమ్మత్‌ ఇప్పిచ్చి పనులు జేపిచ్చుకోవాల్ననీ కేసీయారన్నడ’ని ఏం ఎర్క లేనట్లు సప్పుడుగాకుండున్న ఎంకటేసు ఎర్క సెప్పిండు.

‘గట్లనా.. గట్లయితే మంచిదే గదా. మన రాష్టం గురించి ఇసారం జేసేటోళ్లకు ఓట్లేసీ ఇగ ఢిల్లీకి పంపుడే గావాలే. గట్ల మన రాష్టం బాగు చేసుకునుడే గావాలని గోపాలు అనంగనే, అక్కడున్నోళ్లంతా గట్లనే చేద్దాం’ అనుకుంట డాక్టరు సాబ్‌కు శెనార్తీ పెట్టి ఎవల పనులకు గాళ్లు ఎల్లిపోయిండ్లు.– గడ్డం రాజిరెడ్డి, సాక్షి ప్రతినిధి– వరంగల్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement