సాక్షి, మంచిర్యాల: పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సింగరేణి కార్మికులు అధిక సంఖ్యలో ఉన్నారు. కార్మికులు, వారి కుటుంబాలు, కాంట్రా క్టు కార్మికులు, వారి కుటుంబాలు, సింగరేణిపై ఆధారపడిన ఇతరత్రా కుటుంబాల ఓట్లు ఈ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములకు కీలకం కానున్నాయి. పెద్దపల్లి లోక్‌సభ పరిధిలో జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, పెద్దపల్లి, ధర్మపురి, మంథని, రామగుండం అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో బెల్లంపల్లి సింగరేణి రీజియన్ పరిధిలో మంచిర్యాల, చెన్నూ రు, బెల్లంపల్లి, రామగుండం రీజియన్‌లో రామగుండం, మంథని అసెంబ్లీలున్నాయి. జిల్లాకు సంబంధించి బెల్లంపల్లి సింగరేణి రీజియన్‌లో మూడు డివిజన్లు ఉన్నాయి.
ఇందులో బెల్లంపల్లి నియోజకవర్గంలో బెల్లంపల్లి డివిజన్, చెన్నూరు నియోజకవర్గంలో మందమర్రి డివిజన్, మంచిర్యాల నియోజకర్గం పరిధిలో శ్రీరాంపూర్ డివిజన్లు ఉన్నాయి. ఇవి పెద్దపల్లి లోక్‌సభ పరిధిలోకి రాగా.. బెల్లంపల్లి డివిజన్‌లోని డోర్లీ, కైరీగూడ ఓసీపీలు మాత్రం అదిలాబాద్ లోక్‌సభ పరిధిలోకి వస్తాయి. గనులు ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఉన్నా.. కార్మికులు మాత్రం బెల్లంపల్లి నియోజకవర్గంలోనే ఉన్నారు. బెల్లంపల్లి జీఎం కార్యాలయం, గోలేటీ ప్రాంతాల్లోని కొంతమంది సింగరేణి ఓటర్లు మాత్రం ఆదిలాబాద్ పరిధిలోకి వస్తారు. జిల్లాలో సింగరేణి కార్మికులకు సంబంధించిన ఓటర్లు లక్షల్లో ఉన్నారు. కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య దాదాపు 30వేలు ఉండగా.. వారి కుటుంబాలను కలుపుకుంటే లక్షా 20 వేల మంది ఓటర్లు కార్మికుల ఇళ్లలోనే ఉన్నారు. సింగరేణిపై ఆధారపడిన ఇతరత్రా కుటుంబాలూ ఉన్నాయి. ఈ లెక్కన ఎన్నికల్లో సింగరేణి కార్మికుల పాత్రే కీలకం కానుంది.
కార్మికులపైనే నజర్
లోక్‌సభ సభ్యుడు ఎవరనేది నిర్ణయించడంలో సింగరేణి కార్మికుల పాత్ర కీలకం కావడంతో అన్ని పార్టీలూ ప్రస్తుతం కార్మికులను ఆకర్షించే పనిలో పడ్డాయి. తమను గెలిపిస్తే కార్మికుల డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నాయి. గతంలో పరిష్కరించిన హామీలనూ గుర్తు చేస్తున్నాయి. ప్రస్తుతం కార్మికుల ఆదాయ పన్ను రద్దు డిమాండ్ ప్రధాన ఎన్నికల నినాదంగా మారింది. అన్ని పార్టీల అభ్యర్థులు ఇదే హామీ ఇస్తుండగా.. స్వ యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఇటీవల గోదావరిఖనిలో సభలో ఆదాయపన్ను రద్దు అంశాన్ని ప్రస్తావించారు. అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించామంటూ కార్మికుల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. 20 ఏళ్లుగా ఆదాయపన్ను రద్దు చేయాలనే డిమాండ్ కార్మికుల్లో ఉంది.
ఇది రద్దు కావాలంటే పార్లమెంట్‌లో చట్టం తీసుకురావాల్సి ఉంటుంది. ఇందుకోసం ఎంపీలు పోరా టం చేయాలి. అందుకే లోక్‌సభ ఎన్నికల్లో ఇది ప్రధాన నినాదామైంది. అలాగే సింగరేణి ప్రాంతలో మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. గోలేటి నుంచి ఇల్లందు వరకు ప్రత్యేక రైల్వే లైన్ వేయడం వల్ల కోల్‌కారిడార్ ఏర్పడి బొగ్గు రవాణా, ప్రజారవాణా వ్యవస్థ మెరుగుపడనుంది. ఈ అంశం కూడా ఎన్నికల్లో నినాదంగానే మారింది. 1998లో చేసిన పెన్షన్ చట్టం అమలవుతోంది. ప్రతి మూడేళ్లకోసారి పెన్షన్‌ను పెంచాలని చట్టంలో ఉంది. కాని ఇప్పటివరకూ ఒక్కశాతం కూడా పెరగలేదు. అప్పటినుంచి అదే 25శాతం పెన్షన్ అమలవుతోంది.
దీన్ని 40 శాతానికి పెంచాలనే డిమాండ్ ఉంది. అంతేకాకుండా కారుణ్యనియామకాలు, రూ.10 లక్షల ఇంటి రుణంవంటి రాష్ట్ర పరిధిలోకి వచ్చే డిమాండ్లు కూడా ఎన్నికల అస్త్రాలుగా మారాయి. మరోవైపు ఓసీపీలను మూసివేయాలనే డిమాండ్ కూడా రోజురోజుకూ పెరుగుతోంది. సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని తమ ప్రభుత్వమే పట్టించుకుటుందని, తమకే మద్దతు ఉంటుందని టీఆర్‌ఎస్ భావిస్తోంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కోల్‌బెల్ట్ ప్రాంతంలో తమకు సానుకూల ఫలితాలు వచ్చాయిని కాంగ్రెస్ పేర్కొంటుంది. ఏదేమైనా పెద్దపల్లి లోక్‌సభ ఎన్నికల్లో సింగరేణి కార్మికుల ఓట్లు కీలకం కానున్నాయి.
బెల్లంపల్లి రీజియన్‌లో కార్మికుల వివరాలు..
డివిజన్ | కార్మికుల సంఖ్య |
శ్రీరాంపూర్ | 10,343 |
మందమర్రి | 5,955 |
బెల్లంపల్లి | 1,606 |
ఎస్‌టీపీపీ(జైపూర్) | 150 |
కాంట్రాక్ట్ కార్మికులు | 12,000 |
Comments
Please login to add a commentAdd a comment