
సాక్షి, హైదరాబాద్ : నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ గెలవబోతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ఓట్ల శాతంతో పాటు సీట్లు కూడా పెరుగుతాయన్నారు. సీఎం కేసీఆర్ మీద రైతులు తిరుగుబాటు చేశారని, నిజామాబాద్‌లో సీఎం కూతురు కవిత కచ్చితంగా ఓడిపోతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్, కేటీఆర్‌లు హిందూవులను కించపరిచి వారి మనోభావాలను దెబ్బతీశారన్నారు. ఓవైసీని మచ్చిక చేసుకోవడం కోసం హిందూవులను అవమానించారని ఆరోపించారు.
ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. అక్రమ చొరబాటుదారులకు మతం రంగు పులుపుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అబద్దపు పునాదుల మీద రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. అవార్డుల వాపసి, అసహనం బ్యాచ్‌తో పాటు ఇప్పుడు రిటైర్డ్ సైనికులతో సంతకాల సేకరణ అంటూ కొత్త నాటకాలు వేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ స్పష్టమైన రాజకీయ ప్రత్యామ్నాయంగా అవతరిస్తోందని, ఎన్నికల ఫలితాల తార్వత పెనుమార్పులు వస్తాయన్నారు. రాజకీయ పార్టీ గుర్తులతో జరగాల్సిన పరిషత్ ఎన్నికలను ఆదరా బాదరాగా చేస్తున్నారని మండిపడ్డారు. పరిషత్ ఎన్నికలపై పార్టీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.