
సాక్షి, సిటీబ్యూరో: లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సిటీలో ప్రశాంతంగా ముగిసింది. అత్యంత సమస్మాత్మంగా భావించిన ప్రాంతాలు, ప్రధాన పార్టీల ప్రాబల్యం ఉన్న ఏరియాల్లోనూ అవాంఛనీయ ఘటనలు లేకుండానే ఓటింగ్ ఘట్టం పూర్తయింది. అయితే అనేక ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు, బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసుల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకోవడానికి పార్కింగ్ ఒక కారణమైంది. ఓటింగ్ జరిగే రోజు పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరం నుంచి నిషేధాజ్ఞలు, 144 సెక్షన్ అమలులో ఉంటాయి. దీన్ని నిర్దేశిస్తూ అధికారులు గీత కూడా గీస్తారు. సాధారణంగా ఈ ‘గీతదాటే’ అంశంలో నిత్యం పోలీసులు, అభ్యర్థుల వెంట ఉండే అనుచరులు, ఓటర్ స్లిప్పులు పంచేందుకు సిద్ధమైన పార్టీల కార్యకర్తల మధ్య తరచుగా వాగ్వాదాలు జరుగుతూ ఉంటాయి.
ఈసారి దీనికి భిన్నంగా ‘గీత’ ఓటర్లకు, పోలీసులకు మధ్య ఘర్షణలకు తావిచ్చింది. ఉదయం 7 గంటలకు ముందే పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన ఓటర్లు ఆయా ప్రాంతాలు ఖాళీగా ఉండటంతో తమ వాహనాలను ఈ గీత దాటించి ముందకు తీసుకువెళ్లారు. ఆపై బందోబస్తు పూర్తి స్థాయికి చేయడంతో పోలింగ్ కేంద్రానికి వచ్చిన వారి వాహనాలను ఈ గీత లోపలి ప్రాంతంలో పార్కింగ్ చేయడానికి పోలీసులు అంగీకరించలేదు. ఓటింగ్‌కు వచ్చే వారి కోసం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలూ కల్పించలేదు. అయితే అప్పటికే పార్క్ చేసిన వాహనాలు గీత లోపల ఉండటం, తమవి మాత్రం వద్దంటూ పోలీసులు వారిస్తుండటంతో ఓటర్లు అసహనానికి లోనయ్యారు. ఈ అంశంపైనే అనేక చోట్ల వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. పోలింగ్ ప్రారంభమైన తొలి రెండు గంటల్లో ఎదురైన పార్కింగ్ వాగ్వాదాలతో మేల్కొన్న పోలీసులు ఆ తరవాత చాలాచోట్ల ‘గీత’ దగ్గరే సిబ్బందిని ఏర్పాటు చేసి వ్యక్తిగత వాహనాలను అనుమతించలేదు. కేవలం వృద్ధులు, వికలాంగుల్ని తీసుకువస్తున్న వాటినే ముందుకు వెళ్లనిచ్చారు.
ఏ లోటూ రానివ్వని కమిషనర్లు..
సాధారణంగా బందోబస్తు విధులంటే పోలీసుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. తాగడానికి నీళ్లుండవు, తినడానికి తిండి దొరకదు, పోనీ ఉన్న పాయింట్‌ను వదిలి దాహం, ఆకలి తీర్చుకుందామంటే ఏమవుతుందో అనే సందేహం. రిపోర్ట్ చేసిన అధికారి కార్యాలయం నుంచి డ్యూటీ పాయింట్‌కు వెళ్లాలంటే నానా యాతనా పడాల్సిందే. అయితే ఈసారి మాత్రం సిబ్బందికి ఇలాంటి ఇబ్బందుకు రాకుండా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు అంజనీకుమార్, వీసీ సజ్జనార్, మహేష్ భగవత్ ప్రత్యేక దృష్టి పెట్టారు. పోలింగ్ నేపథ్యంలో గురువారం ‘గ్రేటర్’ వ్యాప్తంగా స్థానిక పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలు కలిపి దాదాపు 27 వేల మందిని వినియోగించారు. సిబ్బంది మొత్తం రిపోర్ట్ చేసిన ప్రాంతం నుంచి విధులు నిర్వర్తించాల్సిన పాయింట్‌కు చేరడానికి, అవసరమైన పక్షంలో ప్రత్యేక గస్తీలు నిర్వహించడానికి కమిషనరేట్స్‌లో ఉన్న వాటికి తోడు అదనంగా దాదాపు 800 వాహనాలు అద్దెకు తీసుకున్నారు. గురువారం రాత్రి నుంచి నిర్విరామంగా విధుల్లో ఉన్న ఈ సిబ్బందికి అల్పాహారం, టీ, భోజనం, తాగునీరు తదితరాలన్నింటినీ వారు విధులు నిర్వర్తిస్తున్న ప్రాంతాలకు చేరేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ బాధ్యతలను స్థానిక పోలీసులకు అప్పగించడంతో పాటు పర్యవేక్షణ బాధ్యతల్ని ఉన్నతాధికారులకు అప్పగించారు. పోలింగ్ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 6 నుంచి విస్తృత స్థాయి బందోబస్తు ప్రారంభమైంది. రాత్రి ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్)లు స్ట్రాంగ్‌రూమ్‌లకు చేరే వరకు ఈ ఏర్పాట్లు కొనసాగాయి.
Comments
Please login to add a commentAdd a comment