సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. లోక్‌సభ పరిధిలో 11,37,231 మంది ఓట్లు వేయగా.. బరిలో నిలిచిన అభ్యర్థులు ఎవరి అంచనాల్లో వారు నిమగ్నమయ్యారు. గురువారం సాయంత్రం 5 గంటల వరకు 67.9 శాతం ఓటింగ్ జరిగినట్లు తొలుత అధికారులు ప్రకటించగా.. 5గంటల తర్వాత కూడా అనేక మంది ఓటర్లు క్యూలో నిల్చోవడం.. వారంతా ఓటు హక్కు వినియోగించుకోవడంతో ఓటింగ్ శాతం 75.16కు చేరింది. పోలింగ్ సరళినిబట్టి ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఏయే పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయి.. తమకెన్ని ఓట్లు వస్తాయని లెక్కలేసుకుంటున్నారు.
ఖమ్మం లోక్‌సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. వాటి పరిధిలో 15,13,094 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 7,39,600 మంది, 7,73,428 మంది మహిళలు, 66 మంది ఇతరులు ఉన్నారు. వీరిలో 11,37,231 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వారిలో 5,59,387 మంది పురుషులు, 5,77,812 మంది మహిళలు, 32 మంది ఇతరులు ఉన్నారు. దీంతో మొత్తం పోలింగ్ 75.16 శాతం జరిగినట్లు అధికారులు శుక్రవారం ప్రకటించారు.
ఉదయం సమయంలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆసక్తి చూపించలేదు. దీంతో మొదట పోలింగ్ మందకొడిగా ప్రారంభమైంది. ఎండలు ఎక్కువగా ఉండడంతో మధ్యాహ్నం వరకు ఓటర్లు చాలా తక్కువ మంది పోలింగ్ బూత్‌లకు వచ్చారు. అయితే ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో మధ్యాహ్నం తర్వాత ఓటర్లు బూత్‌ల వద్దకు చేరుకున్నారు. దీంతో పోలింగ్ సమయం దాటిన తర్వాత కూడా ఓటు వేసేందుకు వచ్చిన వారు మిగిలిపోవడంతో అప్పటి వరకు క్యూలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు.
ఈవీఎంలలోనే..
ఖమ్మం లోక్‌సభ పరిధిలో ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లను తనికెళ్లలోని విజయ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపరిచారు. ఇక్కడ మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మొదటి దశలో కేంద్ర బలగాలు, రెండో దశలో రాష్ట్రస్థాయి బలగాలు, మూడో దశలో జిల్లాస్థాయి బలగాలతో భద్రతను ఏర్పాటు చేశారు. మే 23వ తేదీ వరకు స్ట్రాంగ్‌రూమ్‌లలో అభ్యర్థుల భవిష్యత్ నిక్షిప్తమై ఉంటుంది. అప్పటి వరకు అభ్యర్థుల తరఫున కూడా బందోబస్తు నిర్వహించే అవకాశం కూడా కల్పించారు. ఈసారి ఎన్నికల నిర్వహణకు, ఫలితాల ప్రకటనకు దాదాపు 40 రోజుల గడువు ఉంది.
అంచనాల్లో పార్టీలు..
ఎన్నికలు ముగియడంతో వివిధ పార్టీల నాయకులు, అభ్యర్థులు అంచనాల్లో మునిగిపోయారు. పోలింగ్ సరళి ఎలా నమోదైంది.. తమ పార్టీకి ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఎక్కడ ఉంటుంది.. ఎక్కడ ఓట్లు పడలేదనే దానిపై లెక్కలు వేయడంలో అభ్యర్థులు లీనమయ్యారు. ఫలితాల వెల్లడికి ఎక్కువ రోజులు గడువు ఉండడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠతో కూడిన ఆందోళన నెలకొంది. అయితే విజయం ఎవరిని వరిస్తుందనే దానిపై ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, సీపీఎం, బీజేపీలతోపాటు సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, జనసేన అభ్యర్థులు పోలింగ్ సరళినిబట్టి తమకు ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉందనే దానిపై అంచనాలకు వస్తున్నారు.
పాలేరులో అత్యధికంగా పోలింగ్..
ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో మొత్తం 75.16 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాలేరు నియోజకవర్గంలో అత్యధికంగా 82.87 శాతం పోలింగ్ జరిగింది. ఇక్కడ 2,16,622 మంది ఓటర్లు ఉండగా.. 1,79,518 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ తర్వాత మధిర నియోజకవర్గంలో 81.40 శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ 2,10,358 మంది ఓటర్లు ఉండగా.. 1,71,232 మంది ఓటు వేశారు.
వైరాలో 79.15 శాతం పోలింగ్ జరిగింది. మొత్తం 1,83,286 మంది ఓటర్లు ఉండగా.. 1,45,077 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. సత్తుపల్లిలో 77.84 శాతం ఓటింగ్ జరిగింది. ఇక్కడ మొత్తం 2,30,426 మంది ఓటర్లు ఉండగా.. 1,79,353 మంది ఓటు వేశారు. అశ్వారావుపేటలో 77.72 శాతం పోలింగ్ జరిగింది. ఇక్కడ 1,50,205 మంది ఓటర్లు ఉండగా.. 1,16,735 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
కొత్తగూడెం నియోజకవర్గంలో 66.77 శాతం పోలింగ్ జరిగింది. ఇక్కడ 2,28,597 మంది ఓటర్లు ఉండగా.. 1,52,641 మంది ఓటర్లు ఓటు వేశారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో 65.63 శాతం పోలింగ్ జరిగింది. ఇక్కడ 2,93,600 మంది ఓటర్లు ఉండగా.. 1,92,675 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా.. పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో ఈవీఎంలను తనికెళ్లలోని విజయ ఇంజనీరింగ్ కళాశాలలో గల స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపరిచారు. భద్రపరిచిన ఈవీఎంలను కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ శుక్రవారం పరిశీలించారు. స్ట్రాంగ్‌రూమ్‌ను దగ్గరుండి సీల్ చేయించారు. అలాగే ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు కూడా సందర్శించారు.
స్ట్రాంగ్‌రూమ్‌కు సీల్ వేస్తున్న దృశ్యం
Comments
Please login to add a commentAdd a comment