పాల్మాకుల స్ట్రాంగ్‌రూంలో భద్రపర్చిన ఈవీఎంలను పరిశీలిస్తున్న కలెక్టర్ లోకేష్‌కుమార్, ఎన్నికల పరిశీలకులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల లోక్‌సభ స్థానంలో గెలుపుపై ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరి అంచనాల్లో వారు నిమగ్నమయ్యారు. ఒక పక్క మునుపెన్నడూ లేని విధంగా తగ్గిన పోలింగ్ శాతం దడ పుట్టిస్తున్నా.. గెలుపుపై అందరూ నమ్మకం పెట్టుకున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్‌లో చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు చాలా మంది పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. కనీసం 50 శాతం మార్క్‌ను కూడా అధిగమించలేదు. గ్రామీణ ఓటర్లలో మాత్రం చైతన్యం వెల్లివిరిసింది. గత లోక్‌సభ ఎన్నికలతో పోల్చితే పోలింగ్ శాతం తగ్గినప్పటికీ పట్టణ ప్రాంతాల కంటే ఎక్కువగానే నమోదైంది.
రెండింటి మధ్యే..
చేవెళ్ల స్థానానికి టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ జరిగినట్లు పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాలు టీఆర్‌ఎస్‌కు సానుకూలంగా ఉండగా.. ఇంకొన్ని కాంగ్రెస్‌కు అండగా నిలిచినట్లు క్షేత్రస్థాయి పరిస్థితిని బట్టి అవగతమవుతోంది. ఒకటి రెండు సెగ్మెంట్లలో బీజీపీ కూడా అధిక ఓట్లను తన ఖాతాలో వేసుకున్నట్లు అంచనా. ఈ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో చూస్తే చేవెళ్లలో అత్యధికంగా పోలింగ్ నమోదైంది. 71.05 శాతం పోలైన ఓట్లలో కాంగ్రెస్‌ది పైచేయి ఉన్నట్లు తెలుస్తోంది. రైతులు, నిరుద్యోగ ఓటర్లను కాంగ్రెస్ బాగా ఆకర్షించినట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
- పూర్తిగా పట్టణ ప్రాంతమైన శేరిలింగంపల్లిలో పోలింగ్ శాతం గణనీయంగా పడిపోయింది. ఇక్కడ 41.80 శాతం మంది ఓటర్లు మాత్రమే తమ హక్కును వినియోగించుకున్నారు. ఇక్కడి ఓటర్లలో అత్యధికులు సెటిలర్లే. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వీరు టీఆర్‌ఎస్ వైపు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఈ వలస ఓటర్లందరూ ఓటేసేందుకు తమ సొంత ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లారు. ఇక మిగిలిన వారిలో అత్యధికులు స్థానికులు. వీరిలో అధిక ఓటర్లు కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ఉన్నట్లు అంచనా. రాజేంద్రనగర్ సెగ్మెంట్‌లోనూ కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నువ్వా నేనా అన్న రీతిలో పోరు నడిచినట్లు తెలుస్తోంది. ఇక్కడి సెటిలర్లలో చాలామంది తమ సొంత స్థలాలకు వెళ్లారు. ఇందులో దాదాపు టీఆర్‌ఎస్ సానుకూల ఓటర్లే ఎక్కువగా ఉంటారని రాజకీయ విశ్లేషకుల భావన. దీంతో టీఆర్‌ఎస్‌కు కొంతమేర గండి పడినట్లు తెలుస్తోంది. ఈ లోటును ముస్లిం ఓటర్లు భర్తీ చేసినట్లు వెల్లడవుతోంది. బహిరంగంగానే ఎంఐఎం.. టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వడం వల్ల వారి ఓట్లన్నీ కారు గుర్తు వైపు మళ్లినట్లు కనిపిస్తోంది.
- సగం పట్టణ, మిగిలిన సగభాగం గ్రామీణంగా ఉన్న మహేశ్వరంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా తలపడినట్లు స్పష్టమవుతోంది. పట్టణ ప్రాంతవాసులు బీజీపీ పట్ల మొగ్గుచూపినట్లు ఆయా వర్గాలను బట్టి తెలుస్తోంది. పైగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చెప్పుకోదగ్గ రీతిలో ఓట్లు దక్కడం, తాజాగా లోక్‌సభ ఎన్నికలకు రెండురోజుల ముందు ఆ పార్టీ చీఫ్ అమిత్‌షా సభ కొంత ప్రభావం పడినట్లు కనబడుతోంది. ఇక పల్లె ప్రాంతాల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఢీ అంటే ఢీ అనే రీతిలో ఓట్లను రాబట్టుకున్నట్లు వెల్లడవుతున్నాయి.
- వికారాబాద్‌లో కారు, హస్తం మధ్యం రసవత్తర పోరు నడిచినట్లు తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే వెంట నడిచేందుకు మొగ్గుచూపని నేతలు ప్రచారానికి పెద్దగా ఆసక్తి చూపనట్లు చర్చ జరుగుతోంది. దీని కారణంగా ఓట్లు హస్తం వైపు మళ్లినట్లు తెలుస్తోంది.
- పరిగి నియోజకవర్గంలో కారు జోరు కొనసాగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే ప్రతిష్టాత్మకంగా తీసుకుని సెగ్మెంట్‌పై పూర్తిస్థాయి సమయాన్ని కేటాయించి విస్తృత ప్రచారం చేసినట్లు క్షేత్రస్థాయి పరిస్థితిని బట్టి అర్థమవుతోంది. ఫలితంగా అధిక శాతం ఓటర్లు కారు వైపు ఉన్నట్లు వెల్లడవుతోంది. ఆ తర్వాత స్థానంలో కాంగ్రెస్‌కు ఓట్లు దక్కినట్లు తెలుస్తోంది.
- తాండూరులో కాంగ్రెస్ గాలి వీచినట్లు వెల్లడవుతోంది. స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి. పైగా కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి అత్యంత విశ్వాసపాత్రుడు కావడంతో కొండా గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా హస్తానికి అధిక ఓట్లు పడినట్లు స్పష్టమవుతోంది.
గ్రామీణంలో ‘స్థానికత’ అస్త్రం
చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు నియోజకవర్గాల్లో అభ్యర్థుల స్థానికత అంశం బాగా పనిచేసినట్లు ఆయా వర్గాల ఓటర్లు చెబుతున్నారు. స్థానిక అభ్యర్థి అయితే తమకు అందుబాటులో ఉంటారని వారు భావించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక అభ్యర్థి అంశం.. ఓట్లు సాధించేందుకు కొంత అస్త్రంగా పనిచేసి ఉండొచ్చని అంచనా. ఇదే జరిగితే కాంగ్రెస్ అభ్యర్థికి కలిసిరావొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment