
పొన్నకల్‌లో ఓట్లు వేయడానికి వరుసలో నిలబడిన ఓటర్లు
సాక్షి,అడ్డాకుల: ఊర్లలో వరుసగా ఎన్నికలు...నాలుగు నెలల వ్యవధిలో మూడు ఎన్నికలు. నాలుగు నెలలుగా నాయకులు, కార్యకర్తలు ఎన్నికల కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. ఊర్లలో ఉండే ఓటర్లు ముందు జరిగిన రెండు ఎన్నికల్లో అంతా ఓట్లేశారు. పొట్టకూటి కోసం వలస వెళ్లిన ఓటర్లు, ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన ఓటర్లు రెండు ఎన్నికల్లో ఓట్లు వేయడానికి కొంత ఉత్సాహం కనబర్చడంతో జిల్లాలో దేవరకద్ర నియోజకవర్గంలోనే అత్యధిక పోలింగ్ నమోదైంది.
కానీ గురువారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఓట్లు వేయడానికి ఓటర్లు పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. వరుస ఎన్నికలకు తోడు వేసవికాలం ఎండలు తోడు కావడం లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం చూపింది. వలస ఓటర్లే కాకుండా గ్రామాల్లో ఉన్న ఓటర్లు కూడా ఓట్లు వేయడానికి పోలింగ్ కేంద్రాలను వెళ్లకపోవడంతో ఈసారి పోలింగ్ శాతం తగ్గిపోయింది. పోలింగ్ శాతం తగ్గడంతో ఏ పార్టీకి లాభం కలుగుతుంది, ఏ పార్టీకి నష్టం కలుగుతుందన్న దానిపై నేతలు లెక్కలేస్తున్నారు.
తగ్గిన పోలింగ్ శాతం..
2018 డిసెంబర్ 7న జరిగిన శాసనసభ ఎన్నికల్లో నియోజకవర్గ వ్యాప్తంగా 84.6శాతం పోలింగ్ నమోదైంది. అదే 2014 శాసనసభ ఎన్నికల్లో 71.67శాతం జరిగింది. ఇదిలా ఉంటే లోక్‌సభ ఎన్నికల్లో నియోజకవర్గ వ్యాప్తంగా 65.95శాతం పోలింగ్ నమోదైంది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 18శాతం తక్కువ పోలింగ్ జరిగింది. దేవరకద్ర మండలంలో 65.98శాతం, అడ్డాకుల 59.67 శాతం, కొత్తకోట 64.02శాతం, మూసాపేట 63. 23శాతం, మదనాపురంలో 67.04శాతం, భూ త్పూర్ 69.5శాతం, చిన్నచింతకుంట మండలం లో 69.14శాతం పోలింగ్ నమోదైంది. అయితే నియోజకవర్గ వ్యాప్తంగా అడ్డాకుల మండలంలో అత్యల్పంగా 59.67శాతం పోలింగ్ నమోదు కావడం గమనార్హం. నియోజకవర్గ వ్యాప్తంగా 71,572 మంది పురుషులు, 71,728 మంది మహిళలు కలిపి మొత్తం 1,43,300 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు.
వలస ఓటర్లు రాకపోవడంతోనేనా..!
నియోజకవర్గంలోని గ్రామాలకు చెందిన కూలీలు ఎక్కువ మంది హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. వారంతా ఎన్నికలప్పుడు ఊర్లకు వచ్చి ఓట్లు వేసి వెళ్తారు. మొన్న జరిగిన శాసనసభ, పంచాయతీ ఎన్నికల్లో నేతలు వలస ఓటర్లను ఊర్లకు రప్పించి ఓట్లు వేయించుకున్నారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం వలస ఓటర్లపై నేతలు పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో పోలింగ్‌పై ప్రభావం పడింది. ఎండల తీవ్రత మూలంగా ఇతర గ్రామాలకు వెళ్లి ఓట్లు వేయాల్సిన చోట ఊర్లలో ఉండి కూడా చాలా మంది ఓట్లు వేయడానికి వెళ్లలేదని తెలుస్తోంది.