సాక్షి, మహబూబ్‌నగర్: పాలమూరు.. ఈ పేరు వినగానే ఠక్కున గుర్తొచ్చేది ఈ ప్రాంతంలో నెలకొన్న కరువే.వ్యవసాయ భూములున్నా సాగుకు నీరు లేక.. స్థానికంగా చేసేందుకు పని దొరక్క పొట్ట కూటి కోసం ముంబై.. పూణె.. కర్ణాటక.. హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వలస వెళ్లిన లక్షలాది కుటుంబాలు గుర్తొస్తాయి. దశాబ్దాల కాలంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా.. ఎంత మంది పాలకులు మారినా.. వలసజీవుల తల రాతలు మారడం లేదు. పరాయి ప్రాంతాల్లో వారు పడుతోన్న కష్టాలు గుర్తుకొస్తాయి. ‘స్థానికంగా సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి జిల్లాను సస్యశామలం చేస్తాం.. నిరుద్యోగ యువత ఇతర ప్రాంతాలకు తరలివెళ్లకుండా ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పిస్తాం’ అంటూ ప్రతిసారీ ఎన్నికల్లో అభ్యర్థులు ఇచ్చే హామీలు గుర్తొస్తాయి.
ఇప్పుడు మళ్లీ వలస జీవులతో మన నాయకులకు పని పడింది. ఈ నెల 11 తేదీన జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలను మచ్చిక చేసుకునే పనిలో పడ్డ ఎంపీ అభ్యర్థులు తాజాగా వలస జీవుల ఓట్లనూ తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రస్తుత ఎన్నికలు బీజేపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే బహిరంగసభలు, ర్యాలీలు, రోడ్ షోలు, కార్యకర్తలు.. కుల.. మత పెద్దలతో సమావేశాలు నిర్వహిస్తున్న అభ్యర్థులు తాజాగా ఇతర ప్రాంతాల్లో నివసిస్తోన్న వలస కూలీలు, కార్మికుల ఓట్లపై దృష్టి సారించారు.
మూడున్నర లక్షలకు పైనే..
ఉమ్మడి జిల్లాలో మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానాలున్నాయి. మహబూబ్‌నగర్ పరిధిలో 15,05,190మంది, నాగర్‌కర్నూల్ పరిధిలో 15,88,746మంది ఓటర్లున్నారు. రెండు సెగ్మెంట్ల నుంచి మూడున్నర లక్షలకు పైగా మంది ఓటర్లు ఇతర ప్రాంతాల్లో వలస కూలీలు, కార్మికులుగా పని చేసుకుంటున్నారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని నారాయణపేట అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్న కోయిలకొండ, దామరగిద్ద, ధన్వాడ, నారాయణపేట, కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని కొడంగల్, దౌల్తాబాద్, బొంరాజ్‌పేట, మద్దూరు, కోస్గి మండలాల నుంచి పెద్ద మొత్తంలో ముంబయి, బెంగళూరు, పూణె నగరాల్లో ఉంటున్నారు.
మక్తల్ మండలం కర్లి, గుడిగండ, మంతన్‌గోడ్, అనుగొండ, జక్లేర్ ప్రాంతాలకు చెందిన ప్రజలు ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో ఉంటున్నారు. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధి నుంచి నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి ఎక్కువ మంది ముంబైలో ఉంటున్నారు. ఇలా వలస వెళ్లిన వారిని గుర్తించిన ఎంపీ అభ్యర్థులు, అనుచరులు వారికి ఫోన్లు చేస్తున్నారు. ఉగాది పండుగకు రాకున్నా.. పోలింగ్ రోజు కచ్చితంగా రావాలని అభ్యర్థిస్తున్నారు. ఉగాదికి తమ సొంతూర్లకు విచ్చేసిన వారి వివరాలు తీసుకుని వారిని కలుస్తున్నారు. ఎన్నికల తర్వాతే వెళ్లాలని అప్పటి వరకు ఏవైనా ఖర్చులున్నా తామే చూసుకుంటామని భరోసా ఇస్తున్నారు.
అందరి నోటా అదే మాటా..
ఎన్నికలు సమీపిస్తున్నా కొద్దీ ప్రచారాన్ని వేగిరాన్ని పెంచిన ఎంపీ అభ్యర్థులందరూ ‘వలస’ ఓట్లు రాబట్టేందుకు హామీల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, ఇతర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులను ప్రధాన ప్రచారాస్త్రంగా ఎంచుకున్న అభ్యర్థులు తాము గెలిస్తే వలసలకు అడ్డుకట్ట వేసేలా స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటూ హామీలు చేస్తున్నారు. అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల నాయకులందరూ క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహిస్తూ ఇలాంటి హామీలే ఇస్తున్నారు.
కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలో వస్తుందని.. నరేంద్రమోదీ మళ్లీ ప్రధానమంత్రి అవుతారని.. తమను ఎంపీగా గెలిపిస్తే కేంద్రంతో పోరాడైనా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నిధులు తీసుకొచ్చి పనులు పూర్తి చేస్తామని, వలసలను నివారించేందుకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామంటూ బీజేపీ అభ్యర్థులు డీకే అరుణ, బంగారు శ్రుతి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తమకు మహబూబ్‌నగర్ ప్రజల సమస్యలు తెలుసని.. ఎంపీగా గెలిస్తే జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఎవరూ వలస వెళ్లకుండా, వలస వెళ్లిన వారిని రప్పించి ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని కాంగ్రెస్ అభ్యర్థులు చల్లా వంశీచందర్‌రెడ్డి, మల్లురవి హామీలు ఇస్తున్నారు.
వలస వెళ్లిన వారందరూ తిరిగి వచ్చేలా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి వలసలకు అడ్డుకట్ట వేస్తామంటూ టీఆర్‌ఎస్ అభ్యర్థులు మన్నె శ్రీనివాస్‌రెడ్డి, పోతుగంటి రాములు ఎన్నికల ప్రచారంలో హామీల వర్షం కురిపిస్తున్నారు. ఏదేమైనా ఈ ఎన్నికల్లో వలస జీవులు ఎవరి వైపు మొగ్గు చూపుతారో అని అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment