జలయజ్ఞ ప్రదాత.. వైఎస్సార్‌ | YSR Implemented Irrigation Projects In Mahabubnagar | Sakshi
Sakshi News home page

జలయజ్ఞ ప్రదాత.. వైఎస్సార్‌

Published Mon, Jul 8 2019 7:29 AM | Last Updated on Mon, Jul 8 2019 7:41 AM

 YSR Implemented Irrigation Projects In Mahabubnagar - Sakshi

అలంపూర్‌లో బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేస్తున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి (ఫైల్‌)

సాక్షి, నాగర్‌కర్నూల్‌: ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేసి.. వేలాది మందికి లబ్ధిచేకూర్చిన మహానేత దివంగత ముఖ్యమంత్రి  వైఎస్‌.రాజశేఖరరెడ్డి. రెతేరాజు అని నమ్మి శ్రీశైలం మిగులు కృష్ణా నీటిని ఎత్తిపోసేందుకు మహాత్మాగాంధీ కేఎల్‌ఐ, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల పథకాలను జలయజ్ఞం పేరుతో చేపట్టిన సాగునీటిని తీసుకువచ్చారు. ఆయన తీసుకువచ్చిన పథకాలు నేటికీ బడుగు బలహీన వర్గాల ప్రజలుకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఆరోగ్యశ్రీ, 108, 104 ఆరోగ్య సేవలతో పాటు వృద్ధులు, వితంతువుల సామాజిక భద్రతకోసం పెన్షన్‌లు అందించారు.

ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌ కార్డులు, అభయహస్తం, జలయజ్ఞం, ఫీజురీయింబర్స్‌మెంట్, భూపంపిణీ, మహిళలకు పావళా వడ్డీకే రుణాలు వంటి ఎన్నో సంక్షేమ పథకాలు పేదలపాలిట వరంలా మారాయి. ఏదో ఒక రూపంలో ప్రతి ఒక్కరికీ ఆయన తీసుకువచ్చిన పథకాలు లబ్ధిని చేకూర్చాయి. నేడు ఆయన ప్రజల మద్యలో లేకపోయినా వారి మదిలో చిరస్థాయిగా నిలిచేలా పథకాలను రూపొందించారాయన. 

జిల్లా ప్రజలు ఎన్నటికీ మరువరు..
జిల్లా వాసులు ఆయనను ఎన్నటికీ మరువలేరు. జలయజ్ఞంలో భాగంగా రూ.2.813కోట్లుతో నల్లగొండ జిల్లాకు 3లక్షల ఎకరాలకు నీళ్లు అందించే ఎస్‌ఎల్‌బీసి టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌ ప్రారంభించి ఈప్రాంత వాసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. మరో భారీనీటిపారుదల పథకం కల్వకుర్తి ఎత్తిపోతల. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 2005లో జలయజ్ఞంలో భాగంగా కొల్లాపూర్‌ మండలం ఎల్లూర్‌ గ్రామ పంచాయతీ రేగుమాన్‌ గడ్డ ప్రాంతంలో శ్రీశైలం మిగులు కృష్ణా నీటిని 3.40లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు 25టీఎంసీల నీటి కేటాయింపు చేస్తూ రూ.2.990కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించారు. 

ల్లాపూర్‌ నియోజకవర్గానికి  వైఎస్‌.రాజశేఖరరెడ్డి పలుమార్లు వచ్చారు. 2004 నియోజకవర్గానికి వచ్చి ఎంజీఎల్‌ఐ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.2,995కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. సింగోటం శ్రీవారిసముద్రాన్ని మినీ రిజర్వాయర్‌గా మారుస్తామని ప్రకటించారు. అక్కడే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పేరును మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకంగా మారుస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఐదోసారి కొల్లాపూర్‌లో పర్యటించి రూ.110కోట్ల వ్యయంతో సోమశిల–సిద్దేశ్వరం వంతెనకు, రూ.85కోట్ల వ్యయంతో కల్వకుర్తినుంచి నంద్యాల వరకు డబుల్‌లైన్‌ రహదారి పనులకోసం పైలాన్‌లను ఆవిష్కరించారు.
ఆరోగ్యశ్రీ ఆదుకుంది 

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 1,88,896మంది రోగులు లబ్ధి
 ఆరోగ్య శ్రీ పేదలకు సంజీవని..ఉమ్మడి జిల్లాలో మాత్రం ఎంతో మంది పేదలకు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఖరీదైన చికిత్సలు పొందారు. విలువైన వైద్యం చేయించుకోలేని సామాన్యులకు సైతం ఆరోగ్య శ్రీ ద్వారా కార్పోరేట్‌ స్థాయిలో వైద్యం చేసుకోవడానికి అవకాశం కల్పించిన మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి. పేద ప్రజల కోసం అమలు చేసిన ఆరోగ్య శ్రీ పథకం వల్ల ఎంతో మంది వైద్యం చేయించుకోవడం జరిగింది.

ఉమ్మడి జిల్లాలో ఆరోగ్య శ్రీ పథకం 2007లో ఐదు ఆస్పత్రుల్లో ప్రారంభం చేయడం జరిగింది. ఆరోగ్య శ్రీ పథకం కింద 948రకాల చికిత్సలు చేసుకోవడానికి వీలు కల్పించారు. ఉమ్మడి జిల్లాలో 2007 నుంచి 2017వరకు 1,88,896మంది రోగులు ఆరోగ్య శ్రీ కింద వివిధ రకాల చికిత్సలు చేసుకోవడం జరిగింది. దీనికోసం ప్రభుత్వాలు ఆయా ఆస్పత్రులకు ఈ 11ఏళ్ల కాలంలో రూ.49కోట్ల 74లక్షలు చెల్లించడం జరిగింది.  

108వాహనాలతో వైద్య సేవలు
కుయ్‌..కుయ్‌ మంటూ గ్రామాల్లోకి వచ్చి బాధితులను ఆస్పత్రికి చేర్చడంలో కీలక బాధ్యత వహిస్తున్నాయి 108 అంబులెన్స్‌లు. ఈ సేవలను ప్రారంభించింది.. అభివృద్ధి చేసింది.. వైఎస్సార్‌యే. ప్రమాదం.. ఆకస్మిక ఆనారోగ్యం.. ఏదైనా కావొచ్చు లేదా అపస్మారకస్థితికి చేరుకున్న వారినైనా సరే క్షణాల్లో ఆస్పత్రికి తీసుకొచ్చి వారికి మెరుగైన వైద్యం అందించేలా చేసింది. ఈ 108 అంబులెన్స్‌ల వల్ల ఇప్పటికే కొన్ని వేల మంది ప్రాణాలు నిలిచాయి.

పీయూ అభివృద్ధికి పునాది
పాలమూరు: వెనుకబడిన పాలమూరు జిల్లాకు ఉన్నత చదువుల కోసం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్‌రాజశేఖరరెడ్డి ప్రత్యేక చొరవ చూపించి జిల్లాకు యూనివర్శిటీని మంజూరు చేయడం జరిగింది. ఉస్మానియా పీజీ సెంటర్‌ను స్థాయి పెంచుతూ 2008లో జిల్లాకు పాలమూరు యూనివర్శిటీ నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత బండమీదిపల్లి శివారు ప్రాంతంలో దాదాపు 175ఏకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

దీనిలో భాగంగా  2008 ఆగష్టు 28న అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చేతుల మీదుగా పీయూ ప్రారంభానికి శిలఫలాకం వేశారు. తర్వాత భవన నిర్మాణ పనులు, హాస్టల్‌ నిర్మాణులు ప్రారంభం చేసి విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం పీయూను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆ తర్వత పీయూకు వీసీ గోపాల్‌రెడ్డిని నియామించి త్వరగా అభివృద్ది పనులు చేయాలని వీసీని ఆయన ప్రోత్సహించారు. మొదట్లో 5కోర్సులతో 8మంది ఆచార్యులతో ప్రారంభించిన పీయూ ప్రస్తుతం 19కోర్సులు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం పీయూ పరిధిలో 3పీజీ కళాశాలలు, 94డిగ్రీ కళాశాలలు పని చేస్తున్నాయి. ఈ విద్యా సంవత్సరం పీయూలో అన్ని కోర్సులలో కలిపి 1800మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.

జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటి వరకు 9బ్యాచ్‌లు ఇక్కడి నుంచి వెళ్లాయి. అంటే దాదాపుగా 17వేల మంది విద్యార్థులు పీయూలో ఉన్నత విద్యను అభ్యసించి వెళ్లారు. యూనివర్సిటీ ప్రారంభం చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు యూనివర్సిటీ ఇంతటి అభివృద్ధి చెందడానికి కారణం వైఎస్‌ రాజశేఖరరెడ్డియేనని స్థానిక విద్యార్థులు చెబుతున్నారు. 

నెట్టెంపాడుతో 1.5 లక్షల ఎకరాలకు సాగునీరు
ధరూరు (గద్వాల): రెండు దశాబ్దాల నడిగడ్డ ప్రజల ఆకాంక్ష అయిన నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంతో గద్వాల, అలంపూర్‌ నియోజకవర్గాలు సస్యశ్యామలయ్యాయి. 2006లో రూ.1448 కోట్ల అంచనా వ్యయంతో మండలంలోని గుడ్డెందొడ్డిలో నెట్టెంపాడు ఎత్తిపోతలకు ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో బీజం పడింది. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ద్వారా 1.5 లక్షల ఎకరాలకు సాగు నీరు అందనుంది.

గద్వాల నియోజకవర్గంలోని గద్వాల, ధరూరు, మల్దకల్, గట్టు, కేటీదొడ్డి మండలాలతో పాటు అలంపూర్‌లోని ఇటిక్యాల తదితర మండలాలకు ఈ జలాలు అందుతున్నాయి. కరువు నేలలు సాగులోకి వచ్చాయి. ఆ ఘనత వైఎస్‌కే దక్కింది. ఏడు రిజర్వాయర్లను నిర్మించారు. అలాగే, ప్రయదర్శిని జూరాల ప్రాజెక్టు దిగువన ఉన్న 234 మెగావాట్ల సామర్థ్యంతో జెన్‌కో జల విద్యుత్‌ కేంద్రాన్ని ప్రారంభించారు.

కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల వైఎస్‌ చలవే
దేవరకద్ర: కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల పథకానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే పునాది పడింది.  వైఎస్‌ తలపెట్టిన జలయజ్ఞంలో భాగంగా జిల్లాలో నాలుగు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. అందులో కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల పథకాన్ని రూపొందించారు. జూరాల బ్యాక్‌ వాటర్‌ నుంచి నీటిని కొయిల్‌సాగర్‌కు తరలించడానికి సాంకేతికంగా రూపకల్పన చేశారు.

కృష్ణట్రిబ్యునల్‌ తీర్పు ప్రకారం కోయిల్‌సాగర్‌కు 3.90 టీఎంసీల నీటిని వినియోగించు కోడానికి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేశారు.  50,250 ఎకరాలకు సాగు నీరు అందించడానికి ఆయకట్టును నిర్దేశించి రూ.359 కోట్ల వ్యయంతో పనులు చేపట్టడానికి ప్రభుత్వ పరంగా పరిపాలన అనుమతులను మంజూరు చేశారు.  2006లో కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల పథకానికి వైఎస్‌ శంఖుస్థాపన చేశారు.

ఆర్డీఎస్‌ ఆధునీకరణకు కృషి
అలంపూర్‌: 87వేల ఎకరాలకు సాగునీటిని అందించాల్సిన ఆర్డీఎస్‌ నిరాదరణకు గురికాగా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి దాని ఆధునీకరణకు ముందుకు వచ్చారు. కాలువల లైనింగ్, హెడ్‌వర్క్స్‌ వద్ద పూడికతీత, డిస్టిబ్యూటరీల నిర్మాణాలు చేపట్టడానికి అప్పట్లో రూ.112 కోట్లు కేటాయించారు. అంతేగాక, అలంపూర్, ర్యాలంపాడు గ్రామాలను కలుపుతూ తుంగభద్ర నదిపై వంతెన నిర్మాణానికి రూ.35 కోట్లు మంజూరు కావడంతో వాటి శంకుస్థాపనతో పాటు  పనుల్లో పాల్గొన్నారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే చల్లావెంకట్రామిరెడ్డికి వైఎస్‌ఆర్‌తో ఉన్న అనుబంధంతో ఆయన అలంపూర్‌ నియోజకవర్గాన్ని మూడు సార్లు రావడం జరిగింది. వైఎస్సార్‌ పాలన సువర్ణయుగంగా  ప్రజల గుండెల్లో గుర్తుండిపోయింది.

వైఎస్‌ దయ వల్లే ఎంటెక్‌ చేశా
నాపేరు అనిల్‌ సాగర్‌ మాది కొత్తకోట పట్టణం. పట్టణంలో ఓ మధ్యతరగతి కుటుంబం. ఉన్నత చదువులు చదువుకునే స్తోమత లేదు. ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్‌మెంట్‌ రావడంతో బీటెక్, ఎంటెక్‌ పూర్తి చేసి ప్రస్తుతం రాజశేఖర్‌రెడ్డికి ఇష్టమైనటువంటి ఇరిగేషన్‌ శాఖలో ఏఈఈగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా. రాజశేఖర్‌రెడ్డి పుట్టిన రోజు నాడే నా పుట్టినరోజు కావడంతో అదృష్టంగా భావిస్తున్నాను.
 –  పి.అనిల్‌కుమార్‌ సాగర్, కొత్తకోట

‘ఆరోగ్యశ్రీ’తో ఆపరేషన్‌ చేయించుకున్నా
నా పేరు సంగ నర్సింహులు, మాది నారాయణపేట పట్టణం.  2007వ గుండెకు సంబంధిత వ్యాధి లక్షణాలు కనిపించాయి. వైద్యులు అపరరేషన్‌ చేయాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం కింద హైదరాబాద్‌లోని గ్లోబల్‌ ఆస్పత్రిలో అపరేషన్‌ చేయించుకున్నా. అప్పట్లో ఆపరేషన్‌కు ఖర్చు రూ. 1.50 లక్షలు అయింది.  నేను బతికి ఉన్నా అంటే వైఎస్సార్‌ పుణ్యమే. ఆయన మా గుండెలో చిరస్మరణీయులుగా ఉంటారు. 
 – సంగ నర్సింహులు, నారాయణపేట        

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement