welfare programmes
-
పచ్చ రాతకు పక్కా సమాధానం
-
సంక్షోభంలోనూ సంక్షేమం
సాక్షి, సిరిసిల్ల: తమ ప్రభుత్వం సంక్షోభ సమయంలోనూ సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తోందని మునిసిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్‌నగర్‌లో అర్బన్ ఫారెస్ట్ పార్క్‌కు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలసి ఆయన శంకుస్థాపన చేశారు. మొక్కలు నాటిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ పేదలకు ఇబ్బంది కలుగవద్దనే ఉద్దేశంతో ఆసరా పింఛ న్లు, రేషన్ బియ్యం, కేసీఆర్ కిట్లు కొనసాగిస్తూనే.. రైతుబంధు, రుణమాఫీ అమలు చేస్తున్నారని స్పష్టం చేశారు. కరోనా వచ్చిన ప్రస్తుత సంక్షోభ సమయంలో రాష్ట్రంలోని 54.22 లక్షల మంది రైతులకు ఎకరాకు రూ.5 వేల చొప్పు న రూ.6,889 కోట్ల రైతుబంధు సాయాన్ని అందించామని తెలిపారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తూ.. రాష్ట్రంలోని 5.60 లక్షల మంది రైతులకు రూ.1,200 కోట్ల పంట రుణాలను మాఫీ చేశామని గుర్తు చేశారు. రాష్ట్రంలోని 46 వేల చెరువులను నింపే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. పాడి పంటలతో రాష్ట్రం ఆర్థికంగా బలపడాలని కేసీఆర్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని చెప్పారు. హరితహారం దేశానికే ఆదర్శం: పోచారం రాష్ట్రంలో ఓ యజ్ఞంలా హరితహారం నిర్వహిస్తున్నామని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూర్ మానేరు వాగులో శుక్రవారం చేపట్టిన మెగా ప్లాంటేషన్‌లో మంత్రి కేటీఆర్‌తో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ పవిత్ర హృదయం, చిత్తశుద్ధితో యజ్ఞాన్ని చేసినట్లుగా రాష్ట్రంలో మొక్కలు నాటి సంరక్షించే యజ్ఞా న్ని సీఎం చేపట్టారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 230 కోట్ల మొక్కల్ని నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. మనిషి మనుగడ చెట్లు, కట్టెతో ముడిపడి ఉందన్నారు. ఎంత అభివృద్ధి చేసినా, ఎన్ని సం క్షేమ పథకాలు అమలు చేసినా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటే ప్రజలు జబ్బుల బారిన పడతారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20 శాతం మాత్రమే వన సంపద ఉందన్నారు. పచ్చదనం ఉంటేనే భవిష్యత్ ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు పెద్దఎత్తున సాగుతున్నాయని తెలిపారు. మంత్రి కేటీఆర్ అద్భుతంగా పనిచేస్తూ రాష్ట్రానికి ఎంతో సేవ చేస్తున్నారని కితాబిచ్చారు. హరిత విప్లవం రావాలి రాష్ట్రంలో హరిత విప్లవం రావాలని కేటీఆర్ ఆకాంక్షించారు. మొక్కలు నాటడం ద్వారా రాజకీయంగా లాభమేమీ కాదని, కానీ, భవిష్యత్ తరాల కోసమే ఈ ప్రయత్నం అని పేర్కొన్నారు. హరితహారాన్ని ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యంతో చేపట్టిందని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. ఈసారి ప్రజల సెంటిమెంట్లను గౌరవించి పండ్లు, పూల మొక్కల్ని, రాశీ వనాలు, నక్షత్ర వనాలను పెంచుతున్నామని ఆయన వివరించారు. తెలంగాణలో చేపట్టిన హరితహారం దేశానికే ఆదర్శమన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అర్బన్ ఫారెస్ట్ పార్కులుగా 95 బ్లాక్‌లను గుర్తించామని, సిరిసిల్లలోనూ అర్బన్ ఫారెస్ట్ పార్కు ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. భవిష్యత్‌లో గాలి కొనుక్కోకుండా ఉండాలంటే పాడైన అడవులను బాగు చేసుకోవాలని అభిప్రాయపడ్డారు. -
ఆ కారణంగానే మోదీ లక్ష్యాలు నెరవేరలేదు..
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్థిక లోటును తీర్చే క్రమంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. అందులో భాగంగానే 2017లో జాతీయ స్థాయిలో వినియోగ పన్నును ప్రవేశపెట్టారు. ఈ పన్ను ద్వారా ఆర్థిక ప్రగతి వేగవంతమవుతుందని భావించారు, కానీ పన్ను ఎగవేతల కారణంగా లక్ష్యాలు నెరవేరలేదని కాగ్ నివేదిక తెలిపింది. ముఖ్యంగా పన్ను లక్ష్యాలపై అధికారులు దృష్టి కేంద్రీకరించారు. అయితే ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా పన్ను ఎగవేతదారులు పూర్తి స్థాయిలో పన్నులు చెల్లించకపోవడం ప్రభుత్వాలకు ఆందోళన కలిగిస్తున్నాయి. భారత్‌లో వినియోగ వస్తువుల కారణంగానే 60శాతం వృద్ది రేటు నమోదవుతుంది. కానీ బ్యాంకింగ్ రంగంలో నిధుల లేమి కారణంగా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వినియాగ పన్ను వల్ల ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని భావించినా నకిలీ బిల్లులు, ఆడిటింగ్ మాయాజాలంతో ఆర్థిక వ్యవస్థ మెరుగైన ఫలితాలు సాధించడంలేదని పీడబ్లూసీ అనే సంస్థలో భాగస్వామిగా ఉన్న ప్రతిక్ జైన్ తెలిపారు. జీడీపీ వృద్ది రేటు, ఆర్థిక వ్యవస్థ మందగమనం కారణంగా ప్రభుత్వానికి సంక్షేమ పథకాలు అమలు చేయడం పెద్ద సవాల్ అని నిపుణులు విశ్లేషించారు. కానీ, అభివృద్ధి చెందిన దేశాల వృద్ధితో భారత్‌ను పోల్చడం సరికాదని, త్వరలోనే ఆర్థిక వ్యవస్థలో మెరుగైన ఫలితాలు సాధిస్తుందని పబ్లిక్ ఫైనాన్స్ ప్రొఫెసర్ సచ్చిదానందా ముఖర్జీ ఆశాభావం వ్యక్తం చేశారు. -
మరుపురాని మహానేత
ప్రజా సంక్షేమమే శ్వాసగా, అభివృద్ధే ధ్యాసగా పాలన సాగించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లాపైనా చెరగని ముద్రవేశారు. ఆరోగ్యశ్రీతో ఎందరికో ప్రాణాలు పోసి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపి.. రుణమాఫీ, ఉచిత విద్యుత్‌తో అన్నదాతకు వెన్నుదన్నుగా నిలిచారు. నిమ్స్, కాళేశ్వరం ప్రాజెక్టుకు తొలి అడుగులు పడింది వైఎస్ హయాంలోనే. హ్యాండ్లూమ్ పార్క్, మూసీ కాల్వల ఆధునికీకరణ మహానేత ఘనతే. సోమవారం వైఎస్సార్ జయంతి సందర్భగా ఉమ్మడి జిల్లాలో మహానేత హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలైన సంక్షేమ పథకాలపై ప్రత్యేక కథనాలు.. సాక్షి, యాదాద్రి : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేరరెడ్డి హయాంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి పై చెరగని ముద్ర వేశారు. వైఎస్ చేపట్టిన పథకాలతో లబ్ధిపొందిన వారు ఆయనను గుండెల్లో పెట్టుకుని పూజిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు, విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యత, సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన అభివృద్ధి ప్రదాతగా వైఎస్సార్ నేడు కీర్తించబడుతున్నారు. జిల్లాలో చేనేత పరిశ్రమను నుమ్ముకుని జీవిస్తున్న వేలా దిమంది వృత్తిదారుల కోసం భువనగిరి నియోజకవర్గంలోని పోచంపల్లి మండలం కనుముక్కుల శివారులో పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్‌ను ప్రారంభించారు. ప్రత్యక్షంగా.. పరోక్షంగా 10వేల మందికి నేడు ఉపాధి లభిస్తోంది. ప్రాణహిత చేవేళ్ల పథకం రూపకల్పన సాగు నీటి వసతి లేని జిల్లాకు ప్రాణహిత చేవెళ్ల ద్వారా గోదావరి నదీజలాలను అందించడానికి బస్వాపురం రిజర్వాయర్ ప్రతిపాదించి పనులను పూర్తి చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత సుజల స్రవంతి పథకం పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ప్యాకేజీ 15,16 ద్వారా బస్వాపురం రిజర్వాయర్, సాగునీటి కాల్వల నిర్మాణం చేపట్టారు. ప్రస్తుత ప్రభుత్వం రీడిజైనింగ్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వైఎస్ రూపకల్పన చేసిందే. జిల్లాలో వృథాగా పోతున్న మూసీ జలాలను రైతులకు అందించడానికి బునాదిగాని, పిలాయిపల్లి కాల్వలను మంజూరు చేసి జిల్లా ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయారు వైఎస్సార్. ఆలేరులో ఆరోగ్యశ్రీ ప్రారంభం.. ఆలేరులో ఆరోగ్య శ్రీ పథకాన్ని 2007లో ప్రారంభించారు. భువనగిరి మండలం వడాయిగూడెంలో 2009లో రూపాయికి కిలో బియ్యం పథకం ప్రారంభించారు. ఫ్లోరిన్నీటి నివారణకు ఆలేరు నియోజకవర్గానికి రూ.70కోట్లతో ఉదయసముద్రం నుంచి కృష్ణా నీటి సరఫరా నిధులు కేటాయించి పనులు ప్రారంభించారు. ఇదేకాక ఉమ్మడి జిల్లాలోనే ఫ్లోరైడ్ నివారణకు అంకురార్పణ చేసిన మహనీయుడు రాజశేఖరరెడ్డి. యాదగిరిగుట్టలో రెండో ఘాట్ రోడ్డు నిర్మాణం పనులను నిధులు మంజూరు చేసి ఈ ప్రాంత అభివృద్ధిపై చెరగని ముద్ర వేసుకున్న మహానేత వైఎస్సార్. బీబీనగర్‌లో ఎయిమ్స్.. వైఎస్ చలవే.. బీబీనగర్ శివారులోని రంగాపూర్ వద్ద నిమ్స్‌ను ప్రా రంభించింది వైఎస్సారే. ప్రస్తుతం కేంద్రం మంజూరు చేసిన ఎయిమ్స్ వైఎస్ ప్రారంభించిన నిమ్స్‌లోనే కావడం విశేషం. అప్పట్లోనే ఎయిమ్స్ తరహాలో నిమ్స్‌ను అభివృద్ధి చేయాలని తపించిన దార్శనికుడు వైఎస్. 2005 డిసెంబర్ 31న శంకుస్థాపన చేశారు. నిమ్స్ పనుల కోసం రూ.100 కోట్లను మంజూరు చేశారు. అనంతరం 2009 ఫిబ్రవరి 22న ఆస్పత్రిని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వం నిమ్స్‌లో ఓపి సేవలను ప్రారంభించింది. త్వరలో ఎయిమ్స్వైద్య కళాశాల, పూర్తిస్థాయి వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టింది. అపరసంజీవని.. 108 దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2005లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 108 వాహనం అపరసంజీవనిగా మారింది. 108వాహన సేవలతో మంది క్షతగాత్రులకు ప్రాణాలు కాపాడుతున్నారు. 2005లో కేవలం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా నాలుగు వాహనాలను మాత్రమే కేటాయించి నిర్వాహణ బాధ్యతలను జేవీకే సంస్థకు అప్పగించారు. రెండేళ్ల కాలంలో మంచి ఫలితాలను రావడంతో 2007లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు 34 వాహనాలను కేటాయించారు. నిత్యం వందలాది రోడ్డు ప్రమాద బాధితులతో పాటు పాముకాటు, ప్రసవ వేదనలతో బాధపడుతున్న వారిని, ఇతర అత్యవసర వైద్య సేవల కోసం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రులకు 108 సిబ్బంది తరలించి వారి ప్రాణాలను కాపాడుతున్నారు. కేవలం 108 నంబర్‌కు ఫోన్ చేసిన పది నిమిషాల్లోనే కుయ్.కుయ్ మంటూ సంఘటన స్థనానికి చేరుకుని బాధితులను సకాలంలో సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించి వారిని కాపాడడంలో 108 నిజంగా అపరసంజీవనిగా నిలుస్తోంది. జిల్లాఓ 108 సేవలకు ప్రారంభించిన నాటి నుంచి అంటే 2005 నుంచి 2009 సంవత్సరం నాటికి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మెడికల్ ఎమర్జెన్సీ కేసులు 28,999 , ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కేసులు 6,659, రోడ్డు ప్రమాదాల కేసులు 5,322 మందిని సకాలంలో సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి వారి ప్రాణాలను కాపాడడంలో కీలకపాత్రను పోషించింది. 108 సేవలను మరింత బలోపేతం చేసి ప్రజల ప్రాణాలను కాపాడడంలో ప్రస్తుత ప్రభుత్వం కృషి చేయాలని, వైఎస్ఆర్ ఆశయాలను కొనసాగించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. వెలుగులు నింపిన ‘ రాజీవ్ ఆరోగ్యశ్రీ’ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మానసపుత్రిక అయిన ఆరోగ్యశ్రీ పథకం నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపింది. కారొఇ్పరేట్ స్థాయి వైద్యాన్ని పొందలేక ఎంతోమంది నిరుపేదల ప్రాణాలను వదిలిన సంఘటనలు చూసిన వైఎస్సార్ ఒక డాక్టర్‌గా నిరుపేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్య సేవలను అందించాలని నిర్ణయించి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. 2007లో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఉమ్మడి జిల్లాలో 2009 నాటికి 18,101 మంది ప్రాణాలను కాపాడింది. తెల్లరేషన్ కార్డును తీసుకుని వెళ్లి కార్పొరేట్ ఆస్పత్రుల్లో రూ.లక్షల విలువ చేసే వైద్యాన్ని పొంది ప్రాణాలను దక్కించుకున్న వారంతా నేడు వైఎస్ రాజశేఖరరెడ్డిని దేవునితో సమానంగా చేతులెత్తి మొక్కుతున్నారు. చిన్నారులు, వృద్ధులు, యువకులు, మహిళలు అనే బేధం లేకుండా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లోని కార్పొరేట్ ఆస్పత్రులతో పాటు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో వివిధ రకాల జబ్బులకు చికిత్సలు పొందడంతో పాటు శస్త్ర చికిత్సలను చేయించుకున్నారు. ముఖ్యంగా ఖరీదైన గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తుల, అత్యవసర చికిత్సలు, కీళ్ల, మెదడు, కేన్సర్, ప్లాస్టిక్ సర్జరీ, మూత్రకోశ వ్యాధుల వంటి వ్యాధులకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా కార్పొరేట్ ఆస్పత్రులలో వైద్య సేవలను పొందారు. ఇందుకుగాను సుమారు రూ.53 కోట్ల 22లక్షల 44 వేల 316 రూపాయలు ఖర్చు చేశారు. ఆరోగ్యశ్రీ పథకం లేకుంటే తాము ఏమైపోయే వారమో అని జిల్లాలోని నిరుపేదలు పేర్కొంటున్నారు. తమకు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాణభిక్ష పెట్టారని.. తాము బతికున్నంతకాలం వైఎస్సార్‌ను మరిచిపోలేమని అంటున్నారు. గోదావరి జలాలు అందించిన అపరభగీరథుడు 50ఏళ్లుగా కరువుకాటకాలు.. దర్భిక్ష పరిస్థితులతో ఉండే తుంగతుర్తి ప్రాంతానికి శ్రీరాంసాగర్ కాల్వ ద్వారా గోదావరిజలాలను తీసుకొచ్చిన అపరభగీరథుడు దివంగత సీఎం డాక్టర్ వైఎస్.రాజశఖరరెడ్డి. ఎస్సారెస్పీ రెండోదశ పనులకు టీడీపీ ప్రభుత్వ హయాంలో 1996 మార్చి 6న తిరుమలగిరి మండలం ప్రగతినగర్ వద్ద అప్పటి సీఎం చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. నిధులు విడుదల చేయకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. అయితే వైఎస్సార్ ప్రతిపక్షనేతగా 2003లో ప్రగతినగర్ వద్ద టీడీపీ ప్రభుత్వం వేసిన శిలాపలకం వద్ద మొక్కలు నాటి నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సారెస్పీ రెండోదశ పనులు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక ఎస్పారెస్పీ రెండోదశ పనులకు జలయజ్ఞం కింద నిధులు రూ.550 కోట్లు కేటాయించి 80శాతం పనులను పూర్తి చేశారు. 2009 ఫిబ్రవరి 19న వెలిశాలలో ట్రయల్‌రన్‌లో భాగాంగ నీటిని విడుదల చేశారు. ఈ జలాలతో నియోజకవర్గంలోని చెరువులు, కుంటలు నింపి రైతన్న గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు వైఎస్సార్. ఈ కాల్వ ద్వారా ప్రస్తుతం నియోజకవర్గంలో సుమారు 70వేల ఎకరాలకు, జిల్లాలో 2లక్షల 57వేల ఎకరాలకు నీరందుతున్నది. తాగునీటి ఇబ్బందులు కూడా తొలగిపోయాయి. పేద విద్యార్థులకు వరంలాంటిది దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన ఫీజురీయిబర్స్మెంటు పథకం పేద, మధ్యతరగతి విద్యార్ధులకు వరంలాంటిది. ఈ పథకంతోనే నేను ఇంజనీరింగ్ వరకు చదువుకోగలిగాను. ఈ ఫీజురీయంబర్స్‌మెంటు రాకముందు చాలామంది ఆడపిల్లలు ఇంటర్మీడియేట్లోనే చదువులను మానివేసేవారు. వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజురీయింబర్స్‌మెంట్‌తో అనేక మంది పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివి స్థిరపడ్డారు. ఇప్పుడు నా స్నేహితురాళ్లు కూడా ఇంజనీరింగ్ చదువుతున్నారు. – కె. ప్రియాంక, ఇంజనీరింగ్ విద్యార్థిని, మిర్యాలగూడ -
జలయజ్ఞ ప్రదాత.. వైఎస్సార్
సాక్షి, నాగర్‌కర్నూల్: ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేసి.. వేలాది మందికి లబ్ధిచేకూర్చిన మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి. రెతేరాజు అని నమ్మి శ్రీశైలం మిగులు కృష్ణా నీటిని ఎత్తిపోసేందుకు మహాత్మాగాంధీ కేఎల్ఐ, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాలను జలయజ్ఞం పేరుతో చేపట్టిన సాగునీటిని తీసుకువచ్చారు. ఆయన తీసుకువచ్చిన పథకాలు నేటికీ బడుగు బలహీన వర్గాల ప్రజలుకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఆరోగ్యశ్రీ, 108, 104 ఆరోగ్య సేవలతో పాటు వృద్ధులు, వితంతువుల సామాజిక భద్రతకోసం పెన్షన్లు అందించారు. ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, అభయహస్తం, జలయజ్ఞం, ఫీజురీయింబర్స్‌మెంట్, భూపంపిణీ, మహిళలకు పావళా వడ్డీకే రుణాలు వంటి ఎన్నో సంక్షేమ పథకాలు పేదలపాలిట వరంలా మారాయి. ఏదో ఒక రూపంలో ప్రతి ఒక్కరికీ ఆయన తీసుకువచ్చిన పథకాలు లబ్ధిని చేకూర్చాయి. నేడు ఆయన ప్రజల మద్యలో లేకపోయినా వారి మదిలో చిరస్థాయిగా నిలిచేలా పథకాలను రూపొందించారాయన. జిల్లా ప్రజలు ఎన్నటికీ మరువరు.. జిల్లా వాసులు ఆయనను ఎన్నటికీ మరువలేరు. జలయజ్ఞంలో భాగంగా రూ.2.813కోట్లుతో నల్లగొండ జిల్లాకు 3లక్షల ఎకరాలకు నీళ్లు అందించే ఎస్ఎల్బీసి టన్నెల్ బోరింగ్ మిషన్ ప్రారంభించి ఈప్రాంత వాసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. మరో భారీనీటిపారుదల పథకం కల్వకుర్తి ఎత్తిపోతల. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2005లో జలయజ్ఞంలో భాగంగా కొల్లాపూర్ మండలం ఎల్లూర్ గ్రామ పంచాయతీ రేగుమాన్ గడ్డ ప్రాంతంలో శ్రీశైలం మిగులు కృష్ణా నీటిని 3.40లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు 25టీఎంసీల నీటి కేటాయింపు చేస్తూ రూ.2.990కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించారు. ల్లాపూర్ నియోజకవర్గానికి వైఎస్.రాజశేఖరరెడ్డి పలుమార్లు వచ్చారు. 2004 నియోజకవర్గానికి వచ్చి ఎంజీఎల్‌ఐ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.2,995కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. సింగోటం శ్రీవారిసముద్రాన్ని మినీ రిజర్వాయర్‌గా మారుస్తామని ప్రకటించారు. అక్కడే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పేరును మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకంగా మారుస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఐదోసారి కొల్లాపూర్‌లో పర్యటించి రూ.110కోట్ల వ్యయంతో సోమశిల–సిద్దేశ్వరం వంతెనకు, రూ.85కోట్ల వ్యయంతో కల్వకుర్తినుంచి నంద్యాల వరకు డబుల్‌లైన్ రహదారి పనులకోసం పైలాన్లను ఆవిష్కరించారు. ఆరోగ్యశ్రీ ఆదుకుంది ఉమ్మడి పాలమూరు జిల్లాలో 1,88,896మంది రోగులు లబ్ధి ఆరోగ్య శ్రీ పేదలకు సంజీవని..ఉమ్మడి జిల్లాలో మాత్రం ఎంతో మంది పేదలకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఖరీదైన చికిత్సలు పొందారు. విలువైన వైద్యం చేయించుకోలేని సామాన్యులకు సైతం ఆరోగ్య శ్రీ ద్వారా కార్పోరేట్ స్థాయిలో వైద్యం చేసుకోవడానికి అవకాశం కల్పించిన మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. పేద ప్రజల కోసం అమలు చేసిన ఆరోగ్య శ్రీ పథకం వల్ల ఎంతో మంది వైద్యం చేయించుకోవడం జరిగింది. ఉమ్మడి జిల్లాలో ఆరోగ్య శ్రీ పథకం 2007లో ఐదు ఆస్పత్రుల్లో ప్రారంభం చేయడం జరిగింది. ఆరోగ్య శ్రీ పథకం కింద 948రకాల చికిత్సలు చేసుకోవడానికి వీలు కల్పించారు. ఉమ్మడి జిల్లాలో 2007 నుంచి 2017వరకు 1,88,896మంది రోగులు ఆరోగ్య శ్రీ కింద వివిధ రకాల చికిత్సలు చేసుకోవడం జరిగింది. దీనికోసం ప్రభుత్వాలు ఆయా ఆస్పత్రులకు ఈ 11ఏళ్ల కాలంలో రూ.49కోట్ల 74లక్షలు చెల్లించడం జరిగింది. 108వాహనాలతో వైద్య సేవలు కుయ్..కుయ్ మంటూ గ్రామాల్లోకి వచ్చి బాధితులను ఆస్పత్రికి చేర్చడంలో కీలక బాధ్యత వహిస్తున్నాయి 108 అంబులెన్స్‌లు. ఈ సేవలను ప్రారంభించింది.. అభివృద్ధి చేసింది.. వైఎస్సార్యే. ప్రమాదం.. ఆకస్మిక ఆనారోగ్యం.. ఏదైనా కావొచ్చు లేదా అపస్మారకస్థితికి చేరుకున్న వారినైనా సరే క్షణాల్లో ఆస్పత్రికి తీసుకొచ్చి వారికి మెరుగైన వైద్యం అందించేలా చేసింది. ఈ 108 అంబులెన్స్‌ల వల్ల ఇప్పటికే కొన్ని వేల మంది ప్రాణాలు నిలిచాయి. పీయూ అభివృద్ధికి పునాది పాలమూరు: వెనుకబడిన పాలమూరు జిల్లాకు ఉన్నత చదువుల కోసం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్‌రాజశేఖరరెడ్డి ప్రత్యేక చొరవ చూపించి జిల్లాకు యూనివర్శిటీని మంజూరు చేయడం జరిగింది. ఉస్మానియా పీజీ సెంటర్‌ను స్థాయి పెంచుతూ 2008లో జిల్లాకు పాలమూరు యూనివర్శిటీ నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత బండమీదిపల్లి శివారు ప్రాంతంలో దాదాపు 175ఏకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా 2008 ఆగష్టు 28న అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేతుల మీదుగా పీయూ ప్రారంభానికి శిలఫలాకం వేశారు. తర్వాత భవన నిర్మాణ పనులు, హాస్టల్ నిర్మాణులు ప్రారంభం చేసి విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం పీయూను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆ తర్వత పీయూకు వీసీ గోపాల్‌రెడ్డిని నియామించి త్వరగా అభివృద్ది పనులు చేయాలని వీసీని ఆయన ప్రోత్సహించారు. మొదట్లో 5కోర్సులతో 8మంది ఆచార్యులతో ప్రారంభించిన పీయూ ప్రస్తుతం 19కోర్సులు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం పీయూ పరిధిలో 3పీజీ కళాశాలలు, 94డిగ్రీ కళాశాలలు పని చేస్తున్నాయి. ఈ విద్యా సంవత్సరం పీయూలో అన్ని కోర్సులలో కలిపి 1800మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటి వరకు 9బ్యాచ్‌లు ఇక్కడి నుంచి వెళ్లాయి. అంటే దాదాపుగా 17వేల మంది విద్యార్థులు పీయూలో ఉన్నత విద్యను అభ్యసించి వెళ్లారు. యూనివర్సిటీ ప్రారంభం చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు యూనివర్సిటీ ఇంతటి అభివృద్ధి చెందడానికి కారణం వైఎస్ రాజశేఖరరెడ్డియేనని స్థానిక విద్యార్థులు చెబుతున్నారు. నెట్టెంపాడుతో 1.5 లక్షల ఎకరాలకు సాగునీరు ధరూరు (గద్వాల): రెండు దశాబ్దాల నడిగడ్డ ప్రజల ఆకాంక్ష అయిన నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంతో గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలు సస్యశ్యామలయ్యాయి. 2006లో రూ.1448 కోట్ల అంచనా వ్యయంతో మండలంలోని గుడ్డెందొడ్డిలో నెట్టెంపాడు ఎత్తిపోతలకు ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో బీజం పడింది. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ద్వారా 1.5 లక్షల ఎకరాలకు సాగు నీరు అందనుంది. గద్వాల నియోజకవర్గంలోని గద్వాల, ధరూరు, మల్దకల్, గట్టు, కేటీదొడ్డి మండలాలతో పాటు అలంపూర్‌లోని ఇటిక్యాల తదితర మండలాలకు ఈ జలాలు అందుతున్నాయి. కరువు నేలలు సాగులోకి వచ్చాయి. ఆ ఘనత వైఎస్‌కే దక్కింది. ఏడు రిజర్వాయర్లను నిర్మించారు. అలాగే, ప్రయదర్శిని జూరాల ప్రాజెక్టు దిగువన ఉన్న 234 మెగావాట్ల సామర్థ్యంతో జెన్కో జల విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించారు. కోయిల్‌సాగర్ ఎత్తిపోతల వైఎస్ చలవే దేవరకద్ర: కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే పునాది పడింది. వైఎస్ తలపెట్టిన జలయజ్ఞంలో భాగంగా జిల్లాలో నాలుగు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. అందులో కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాన్ని రూపొందించారు. జూరాల బ్యాక్ వాటర్ నుంచి నీటిని కొయిల్‌సాగర్‌కు తరలించడానికి సాంకేతికంగా రూపకల్పన చేశారు. కృష్ణట్రిబ్యునల్ తీర్పు ప్రకారం కోయిల్‌సాగర్‌కు 3.90 టీఎంసీల నీటిని వినియోగించు కోడానికి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేశారు. 50,250 ఎకరాలకు సాగు నీరు అందించడానికి ఆయకట్టును నిర్దేశించి రూ.359 కోట్ల వ్యయంతో పనులు చేపట్టడానికి ప్రభుత్వ పరంగా పరిపాలన అనుమతులను మంజూరు చేశారు. 2006లో కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకానికి వైఎస్ శంఖుస్థాపన చేశారు. ఆర్డీఎస్ ఆధునీకరణకు కృషి అలంపూర్: 87వేల ఎకరాలకు సాగునీటిని అందించాల్సిన ఆర్డీఎస్ నిరాదరణకు గురికాగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దాని ఆధునీకరణకు ముందుకు వచ్చారు. కాలువల లైనింగ్, హెడ్‌వర్క్స్ వద్ద పూడికతీత, డిస్టిబ్యూటరీల నిర్మాణాలు చేపట్టడానికి అప్పట్లో రూ.112 కోట్లు కేటాయించారు. అంతేగాక, అలంపూర్, ర్యాలంపాడు గ్రామాలను కలుపుతూ తుంగభద్ర నదిపై వంతెన నిర్మాణానికి రూ.35 కోట్లు మంజూరు కావడంతో వాటి శంకుస్థాపనతో పాటు పనుల్లో పాల్గొన్నారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే చల్లావెంకట్రామిరెడ్డికి వైఎస్ఆర్తో ఉన్న అనుబంధంతో ఆయన అలంపూర్ నియోజకవర్గాన్ని మూడు సార్లు రావడం జరిగింది. వైఎస్సార్ పాలన సువర్ణయుగంగా ప్రజల గుండెల్లో గుర్తుండిపోయింది. వైఎస్ దయ వల్లే ఎంటెక్ చేశా నాపేరు అనిల్ సాగర్ మాది కొత్తకోట పట్టణం. పట్టణంలో ఓ మధ్యతరగతి కుటుంబం. ఉన్నత చదువులు చదువుకునే స్తోమత లేదు. ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ రావడంతో బీటెక్, ఎంటెక్ పూర్తి చేసి ప్రస్తుతం రాజశేఖర్‌రెడ్డికి ఇష్టమైనటువంటి ఇరిగేషన్ శాఖలో ఏఈఈగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా. రాజశేఖర్‌రెడ్డి పుట్టిన రోజు నాడే నా పుట్టినరోజు కావడంతో అదృష్టంగా భావిస్తున్నాను. – పి.అనిల్‌కుమార్ సాగర్, కొత్తకోట ‘ఆరోగ్యశ్రీ’తో ఆపరేషన్ చేయించుకున్నా నా పేరు సంగ నర్సింహులు, మాది నారాయణపేట పట్టణం. 2007వ గుండెకు సంబంధిత వ్యాధి లక్షణాలు కనిపించాయి. వైద్యులు అపరరేషన్ చేయాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం కింద హైదరాబాద్‌లోని గ్లోబల్ ఆస్పత్రిలో అపరేషన్ చేయించుకున్నా. అప్పట్లో ఆపరేషన్‌కు ఖర్చు రూ. 1.50 లక్షలు అయింది. నేను బతికి ఉన్నా అంటే వైఎస్సార్ పుణ్యమే. ఆయన మా గుండెలో చిరస్మరణీయులుగా ఉంటారు. – సంగ నర్సింహులు, నారాయణపేట -
‘తెలంగాణ కంటి వెలుగు’లు
సాక్షి, హైదరాబాద్ : కంటి చూపు సమస్యలు లేని తెలంగాణే లక్ష్యంగా సరికొత్త కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్యం అందించేందుకుగాను ‘తెలంగాణ కంటి వెలుగు’కార్యక్రమం చేపడుతోంది. కార్యక్రమం అమలుకు సంబంధించిన ప్రతిపాదనలను మంగళవారం ప్రభుత్వానికి వైద్య, ఆరోగ్య శాఖ పంపింది. కళ్లద్దాల కొనుగోలు, పరీక్షలు చేసేందుకు పరికరాలు, తాత్కాలిక వైద్య సిబ్బంది నియామకం, సిబ్బందికి శిక్షణ, పరీక్ష కేంద్రాల కోసం రూ.100 కోట్లు అవసరమవుతాయని ప్రతిపాదనల్లో పేర్కొంది. ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే కార్యక్రమం మొదలుపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్ మూడో వారంలోనే కార్యక్రమం ప్రారంభించాలనుకున్నా ‘రైతు బంధు’చెక్కుల పంపిణీ నేపథ్యంలో మే మొదటి వారంలో ప్రారంభించనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. 3.5 కోట్ల మంది కోసం ఏర్పాట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో 15 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహిస్తారు. పాఠశాల వయస్సు వారికి ఆర్బీఎస్కే కార్యక్రమంలో భాగంగా పరీక్షలు నిర్వహిస్తుండటంతో వారు మినహా రాష్ట్రంలోని 3.5 కోట్ల మందికి పరీక్షల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా గ్రామాల వారీ షె డ్యూల్‌ను వైద్య, ఆరోగ్య శాఖ ఖరారు చేస్తోంది. రోగులకు ఇచ్చే మందులు, దృష్టి లోపాలున్న వారి కోసం 40 లక్షల కళ్లద్దాలు కొనుగోలు చేస్తోంది. రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక వసతుల కల్పన సంస్థ కళ్లద్దాల కొనుగోలు ప్రక్రియ చేపట్టింది. దేశంలో భారీ సంఖ్యలో కళ్లద్దాలు లభ్యమయ్యే పరిస్థితి లేదు. ఫ్రాన్స్, చైనా వంటి దేశాల్లోనే ఉత్పత్తి ఎక్కువగా ఉంది. టెండర్లలో ఎంపికయ్యే కంపెనీలు తక్కువ సమయంలో కళ్లద్దాలు సరఫరా చేసేలా నిబంధనలు రూపొందించారు. బాధ్యతల పంపిణీ కంటి పరీక్షల నిర్వహణ పూర్తిగా మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. పరీక్షల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ చూసుకుంటారు. అవసరమైన వారికి వైద్య చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తారు. రోగుల వివరాల నమోదు సహా అవసరమైన ఏర్పాట్లు సమకూర్చుతారు. వివరాల నమోదులో మెడికల్ ఆఫీసర్, నేత్ర వైద్య నిపుణుడికి ఏఎన్ఎం (ఎంపీహెచ్ఏ) సహాయం చేస్తారు. రక్త, మూత్ర పరీక్షలకు నమూనాలు సేకరిస్తారు. ఫార్మసిస్టు పరీక్షల నివేదికల ఆధారంగా మందులు, కళ్లద్దాలను వైద్య నిపుణులు రోగులకు ఇస్తారు. కంటి పరీక్షల శిబిరానికి గ్రామ ప్రజలను తీసుకొచ్చేలా ఆశా కార్యకర్తలు పని చేస్తారు. స్కూళ్లు, కమ్యూనిటీ హాళ్లలో.. కంటి పరీక్షల నిర్వహణకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. మెడికల్ ఆఫీసర్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, నేత్ర వైద్య నిపుణుడు, ఫార్మసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్, ఏఎన్ఎం, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆశా కార్యకర్తలతో బృందాలు ఏర్పాటు చేస్తోంది. నేత్ర వైద్య నిపుణులు, జిల్లా వైద్యాధికారుల ఆధ్వర్యంలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బందికి శిక్షణ ఇస్తారు. ప్రభుత్వ కార్యక్రమ లక్ష్యాలు, ఉద్దేశాలు వివరిస్తారు. వేసవి సెలవుల నేపథ్యంలో స్కూళ్లు, కమ్యూనిటీ భవనాల్లో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే స్థానిక పరిస్థితుల దృష్ట్యా పరీక్షలు ఎక్కడ నిర్వహించాలో మండల స్థాయి అధికారులు నిర్ణయించనున్నారు. 43 శాతం శుక్లాల వల్లే.. మారుతున్న జీవన శైలి, పౌష్టికాహారలోపాలే దృష్టి లోపాలకు ప్రధాన కారణమవుతున్నాయి. దశాబ్దం క్రితంతో పోల్చితే కంటి చూపు సమస్యలున్న రోగుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని 25 శాతం మంది కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. పెద్ద వయస్సు వారికి శుక్లాలు (పొర), చిన్న పిల్లల్లో పోషకాహార లోపం వల్ల దృష్టి లోపం ఏర్పడుతున్నాయి. కంటి చూపు కోల్పోయిన వారిలో 43 శాతం మంది శుక్లాల వల్లే చూపు కోల్పోయారని నిర్ధారించారు. రాష్ట్రంలోని 7 శాతం జనాభా మధుమేహం కారణంగా కంటిచూపు సమస్య (డయాబెటిక్ రెటీనోపతి)తో బాధపడుతున్నారు. వీటితోపాటు మరో 7 శాతం మంది నీటి కాసులు (గ్లకోమా)తో బాధపడుతున్నారు. 40 ఏళ్లు దాటిన వారిలో గ్లకోమా లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కంటి సమస్యలతో బాధపడుతున్నవారు శుక్లాలు 43 శాతం నీటి కాసులు 7 శాతం డయాబెటిక్ రెటీనోపతి 7 శాతం బాల్యంలో అంధత్వం 4 శాతం నెలలు నిండని శిశువులకు సమస్యలు 4 శాతం చూపు మందగించడం 3 శాతం -
పథకాలను అందిపుచ్చుకోవాలి
ఎస్సీ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయ్‌కుమార్ గుంటూరు వెస్ట్: ప్రభుత్వం దళితుల కోసం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను అందిపుచ్చుకుని అభివృద్ధిని సాధించాలని రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ వైస్‌ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయ్‌కుమార్ కోరారు. జిల్లా ఎస్సీ కార్పోరేషన్ ఆధ్వర్యంలో గుంటూరులోని సన్నిధి కళ్యాణ మండపంలో యువస్ఫూర్తి సమ్మేళనం శనివారం జరిగింది. ఈసందర్భంగా విజయ్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత చదువుకున్న దళిత యువతపై ఉందన్నారు. నిస్వార్థంగా, నిష్పక్షపాతంగా అర్హులైన వారికి పథకాలను అందించేందుకు కృషి చేయాలని కోరారు. దళితులు మేథోబలం ద్వారా అభివృద్ధిని సాధించి జాతి ఉద్దరణకు పాటుపడాలని ఆయన కోరారు. అంబేద్కర్ జీవితంలోని పలు అంశాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. లక్ష్యం కోసం పనిచేస్తే ఉన్నతస్థానాలు.. జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడుతూ దిశా కలిగి ఉండి ఒక లక్ష్యం కోసం కృషి చేస్తే యువత ఉన్నతస్థానాలకు ఎదగవచ్చన్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలపై అవగాహన పెంచుకొని వాటిని సద్వినియోగించుకోవాలని కోరారు. తొలుత బీఆర్ అంబేద్కర్, బాబూజగ్జీవన్‌రామ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పోరేషన్ జనరల్ మేనేజర్ ఎం.కాలేబ్, డీఈఓ కేవీ శ్రీనివాసులరెడ్డి, ఎస్సీ కార్పోరేషన్ జిల్లా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కే.బాలాజీనాయక్, దళిత యువతీ, యువకులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం దళిత సంఘాల నాయకులు, ఎన్జీఓ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. నిరాశగా వెనుదిరిగిన యువకులు.. సమ్మేళనానికి వచ్చినవారికి ఎస్సీ కార్పోరేషన్ ద్వారా రుణాలు అందిస్తారని ప్రచారం జోరుగా సాగింది. ఈవిధంగా చెప్పి తమను సమావేశానికి పంపించారని పలువురు యువకులు చర్చించుకోవడం కనిపించింది. ఇదే విషయాన్ని ఒకరిద్దరు యువకులు ఎం.డీ.విజయ్‌కుమార్ దృష్టికి తీసుకు వచ్చారు. ఎస్సీ కార్పోరేషన్ ద్వారా రుణాలు ఇస్తారని చెబితే ఇక్కడకు వచ్చామని చెప్పడంతో అధికారులు ఖంగుతిన్నారు. తీరా ఇక్కడ అలాంటి ప్రతిపాదనలు కానీ, రుణాల ఊసే లేకపోయేసరికి యువకులు ఉస్సూరుమంటూ వెనుదిరిగి వెళ్లిపోయారు. -
సంక్షేమానికి క్షవరం @ ఏపీ
-
సంక్షేమం.. క్షవరం
వచ్చే బడ్జెట్లో పలు పథకాలకు కోత కేటాయింపులు జరపబోమని సీఎం చంద్రబాబు స్పష్టీకరణ ఒక్కో శాఖ ఒకట్రెండు సంక్షేమ కార్యక్రమాలకే పరిమితం! ఫలితాలు వస్తాయని అధికారులు చెబితేనే నిధులు.. ప్రస్తుతం రూ. 9 వేల కోట్ల లోటు అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం అమలులో ఉన్న పలు సంక్షేమ పథకాలకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో కోత విధించాలని భావిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. అనవసరమైన, ప్రజలకు ప్రయోజనకరంగా లేని సంక్షేమ కార్యక్రమాలకు వచ్చే బడ్జెట్లో కేటాయింపులు జరపబోమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఒక్కొక్క శాఖలో పదుల సంఖ్యలో సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, వచ్చే బడ్జెట్ నుంచి వాటిని శాఖకు ఒకట్రెండుకు మాత్రమే పరిమితం చేయాలనే ఆలోచన ఉన్నట్టు తెలిపారు. ప్రభుత్వం ఈసారి జీరో బడ్జెట్ ప్రవేశపెడుతుందని, ఎప్పటి మాదిరిగా శాఖలకు బడ్జెట్ కేటాయింపులు జరపకుండా.. ఉన్నతాధికారులు తమ శాఖల్లో ఎలాంటి ఫలితాలు ఇవ్వగలరో ప్రభుత్వానికి చెప్పిన మేరకు కేటాయిస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖలకు ఆర్థిక శాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయన్నారు. రాష్ట్ర బడ్జెట్ తయారీ, పలు అభివృద్ధి కార్యక్రమాల అమలుపై చంద్ర బాబు శుక్రవారం సచివాలయం నుంచి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫిబ్రవరి ఆరంభం నాటికి రూ.9 వేల కోట్ల లోటు ఉందని చెప్పారు. వచ్చే ఏడాదిలోనూ రాష్ట్ర ఆదాయం ఆశించినంతంగా ఉండే అవకాశం లేదన్నారు. ఈ కారణంగా ప్రాధాన్యత అంశాల ఆధారంగానే శాఖలకు బడ్జెట్ కేటాయింపులు ఉంటాయన్నారు. రెండు నెలల్లో 14వ ఆర్థిక సంఘం రాబోతుందని, ఈ ఆర్థిక సంఘంలో రాష్ట్రానికి వచ్చే కేటాయింపుల ఆధారంగా రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులకు తుదిరూపు ఇవ్వనున్నట్టు వివరించారు. కేంద్రం ఆదుకోవాలి.. రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు, రెండు రాష్ట్రాలు సమాన స్థాయికి వచ్చే వరకు కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు చెప్పారు. తొమ్మిది నెలల ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఏడు శాతం ఆర్థిక వృద్ధి సాధించిందని, ఇది దేశ సగటు ఆర్థిక వృద్ధి కన్నా ఎక్కువ అని చెప్పారు. భవిష్యత్తులో ఇది 13- 14 శాతానికి చేరుకోగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది రాష్ట్రంలో సాధారణం వర్షపాతం 36 శాతం తక్కువగా ఉన్నప్పటికీ వ్యవసాయ రంగంలో 11.34 శాతం వృద్ధి రేటు సాధించగలిగామన్నారు. చార్జీల పెంపు అవసరాన్ని ప్రచారం చేయండి రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపునకు దారితీసిన పరిస్థితులను ప్రజలకు వివరించాలని సీఎం అధికారులను ఆదేశించారు. 100 యూనిట్ల లోపు విద్యుత్ వాడుకునే 1.17 కోట్ల కుటుంబాలపై పెంపు ప్రభావం ఉండబోదన్నారు. ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత వారు ప్రభుత్వానికి అందించే నివేదిక ఆధారంగా విద్యుత్ చార్జీల పెంపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇలావుండగా రాష్ట్రంలో డ్రైవర్లకు ఐదు లక్షల వరకు బీమా సౌకర్యం కల్పించబోతున్నట్టు చంద్రబాబు తెలిపారు. వీరితో పాటు రాష్ట్రంలోని కోటి మంది వరకు ఉన్న అసంఘటిత కార్మికులకు దీనిని వర్తింపజేస్తామన్నారు. ఈ నెల 19వ తేదీన నీరు- చెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నామని, రాష్ట్రంలో వర్షపాతం పెరగడానికి నాలుగైదు నెలల పాటు ఉద్యమం మాదిరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి వచ్చే ఏడాది వ్యవసాయ ఆర్థిక వృద్ధి రేటు పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. తక్కువ వర్షపాతం కారణంగా రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు బాగా పడిపోయాయని బాబు చెప్పారు. వచ్చే వేసవిలో మంచినీటి ఎద్దడి రాకుండా జిల్లా కలెక్టర్లు ఇప్పటినుంచే సమగ్ర ప్రణాళికలు తయారు చేసుకోవాలని సూచించారు. అనంత నుంచి కొత్త రాజధానికి రహదారి అనంతపురం పట్టణం నుంచి కర్నూలు మీదుగా కొత్త రాజధానికి నాలుగు లైన్ల రోడ్లు నిర్మాణం చేపట్టబోతున్నట్టు ముఖ్యమంత్రి వివరించారు. రోడ్డు నిర్మాణానికి అవసరపడే భూ సేకరణను అనంతపురం, కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లా కలెకర్లు పూర్తి చేయాలని సూచించారు. మరుగుదొడ్డి నిర్మాణానికి ప్రభుత్వం చేసే సాయాన్ని రూ.12 వేల నుంచి రూ.15 వేలకు పెంచుతున్నామన్నారు. మరుగుదొడ్ల నిర్మాణానికి రాష్ట్రంలో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి ‘ఆత్మగౌరవం’ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో మూకుమ్మడిగా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలకు రూ.5 కోట్లు మద్యం సేవించి వాహనాల నడపడం వల్ల రోడ్లు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించేందుకు అవసరమైన పరికాల కొనుగోలుకు రూ. 5 కోట్లు అందజేస్తామని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఆర్ అండ్ బీ, పోలీసు, రవాణా శాఖలు అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో స్వైన్‌ప్లూ నివారణకు అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు. రుణమాఫీ రెండవ దశలో రైతులు తమ వివరాలను బ్యాంకులకు అందజేయడానికి శనివారంతో గడువు ముగియనుందని, గడువు పెంపుపై శనివారం జరిగే సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.