సాక్షి, సిరిసిల్ల: తమ ప్రభుత్వం సంక్షోభ సమయంలోనూ సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తోందని మునిసిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్‌నగర్‌లో అర్బన్ ఫారెస్ట్ పార్క్‌కు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలసి ఆయన శంకుస్థాపన చేశారు. మొక్కలు నాటిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ పేదలకు ఇబ్బంది కలుగవద్దనే ఉద్దేశంతో ఆసరా పింఛ న్లు, రేషన్ బియ్యం, కేసీఆర్ కిట్లు కొనసాగిస్తూనే.. రైతుబంధు, రుణమాఫీ అమలు చేస్తున్నారని స్పష్టం చేశారు.
కరోనా వచ్చిన ప్రస్తుత సంక్షోభ సమయంలో రాష్ట్రంలోని 54.22 లక్షల మంది రైతులకు ఎకరాకు రూ.5 వేల చొప్పు న రూ.6,889 కోట్ల రైతుబంధు సాయాన్ని అందించామని తెలిపారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తూ.. రాష్ట్రంలోని 5.60 లక్షల మంది రైతులకు రూ.1,200 కోట్ల పంట రుణాలను మాఫీ చేశామని గుర్తు చేశారు. రాష్ట్రంలోని 46 వేల చెరువులను నింపే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. పాడి పంటలతో రాష్ట్రం ఆర్థికంగా బలపడాలని కేసీఆర్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని చెప్పారు.
హరితహారం దేశానికే ఆదర్శం: పోచారం
రాష్ట్రంలో ఓ యజ్ఞంలా హరితహారం నిర్వహిస్తున్నామని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూర్ మానేరు వాగులో శుక్రవారం చేపట్టిన మెగా ప్లాంటేషన్‌లో మంత్రి కేటీఆర్‌తో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ పవిత్ర హృదయం, చిత్తశుద్ధితో యజ్ఞాన్ని చేసినట్లుగా రాష్ట్రంలో మొక్కలు నాటి సంరక్షించే యజ్ఞా న్ని సీఎం చేపట్టారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 230 కోట్ల మొక్కల్ని నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.
మనిషి మనుగడ చెట్లు, కట్టెతో ముడిపడి ఉందన్నారు. ఎంత అభివృద్ధి చేసినా, ఎన్ని సం క్షేమ పథకాలు అమలు చేసినా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటే ప్రజలు జబ్బుల బారిన పడతారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20 శాతం మాత్రమే వన సంపద ఉందన్నారు. పచ్చదనం ఉంటేనే భవిష్యత్ ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు పెద్దఎత్తున సాగుతున్నాయని తెలిపారు. మంత్రి కేటీఆర్ అద్భుతంగా పనిచేస్తూ రాష్ట్రానికి ఎంతో సేవ చేస్తున్నారని కితాబిచ్చారు.
హరిత విప్లవం రావాలి
రాష్ట్రంలో హరిత విప్లవం రావాలని కేటీఆర్ ఆకాంక్షించారు. మొక్కలు నాటడం ద్వారా రాజకీయంగా లాభమేమీ కాదని, కానీ, భవిష్యత్ తరాల కోసమే ఈ ప్రయత్నం అని పేర్కొన్నారు. హరితహారాన్ని ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యంతో చేపట్టిందని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. ఈసారి ప్రజల సెంటిమెంట్లను గౌరవించి పండ్లు, పూల మొక్కల్ని, రాశీ వనాలు, నక్షత్ర వనాలను పెంచుతున్నామని ఆయన వివరించారు. తెలంగాణలో చేపట్టిన హరితహారం దేశానికే ఆదర్శమన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అర్బన్ ఫారెస్ట్ పార్కులుగా 95 బ్లాక్‌లను గుర్తించామని, సిరిసిల్లలోనూ అర్బన్ ఫారెస్ట్ పార్కు ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. భవిష్యత్‌లో గాలి కొనుక్కోకుండా ఉండాలంటే పాడైన అడవులను బాగు చేసుకోవాలని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment