
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారబోతోందా? ప్రతిపక్ష స్థానం కోసం కాంగ్రెస్‌కు బీజేపీ గట్టిపోటీ ఇచ్చే స్థాయికి చేరుకోబోతోందా? వరుస ఓటములు, భారీ వలసలతో డీలాపడిన కాంగ్రెస్‌కు దీటుగా బీజేపీ దూసుకెళ్తోందనే చర్చ ఊపందుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా ఆరుచోట్ల రెండోస్థానంలో బీజేపీ ఉండ నుందనే అంచనాలే ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. క్షేత్రస్థాయిలో జరుగుతున్న మార్పుల ప్రకారం.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అనుకున్న స్థాయిలో ప్రభావం చూపిస్తేమాత్రం.. రాష్ట్రంలో కాంగ్రెస్ రాజకీయ భవిష్యత్తు సంకటస్థితిలో పడిపోవడం ఖాయమని రాజకీయ వర్గాలంటున్నాయి. అదే జరిగి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష స్థానం కోసం బీజేపీతో తలపడాల్సిన పరిస్థితే వస్తే.. బీజేపీ నాయకత్వం రాష్ట్ర రాజ కీయాలపై దృష్టి సారిస్తుందని విశ్లేషకులంటున్నారు.
చిత్రం మార్చిన ఎన్నికలు
ఈనెల 11న జరిగిన పార్లమెంటు ఎన్నికల పోలింగ్ సరళి, స్థానిక రాజకీయ వర్గాల సమాచారం పై చర్చకు ఊతమిచ్చే విధంగా ఉన్నాయి. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు గానూ.. హైదరాబాద్ స్థానంలో వన్‌మ్యాన్‌షోగా మజ్లిస్ హవా నడుస్తుందని, మిగిలిన 16 స్థానాల్లో ఆరింట బీజేపీ టీఆర్‌ఎస్‌కు గట్టిపోటీ ఇచ్చి కాంగ్రెస్ కన్నా ఎక్కువ ఓట్లు దక్కించుకుం టుందని పరిశీలకులంటు న్నారు. ఇందులో సికింద్రాబాద్, మహబూబ్‌నగర్, జహీరా బాద్, నిజా మాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ స్థానాలున్నాయని తెలు స్తోంది. గెలుపోటములను పక్కన పెడితే 6 చోట్ల బీజేపీ గట్టి పోటీ ఇచ్చిందని, కేవలం 60% స్థానాల్లోనే టీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ తలపడిందనే సమాచారం గాంధీభవన్ వర్గాలను కలవరపరుస్తోంది.
మళ్లీ అధికారంలోకి వస్తే!
ప్రస్తుత సమాచారం ప్రకారం కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే మాత్రం కమలనాథులు వ్యూహాన్ని మార్చే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలంటున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి చెప్పుకోదగిన స్థాయిలో వలసలను తీసుకోగలిగిన బీజేపీ లోక్‌సభ ఫలితాల తర్వాత రాష్ట్ర రాజకీయాలపై తీవ్రంగా దృష్టి కేంద్రీకరిస్తుందని అంటున్నాయి. పశ్చిమబెంగాల్, ఒడిశా, త్రిపుర, అస్సాంల్లో అనుసరించిన వ్యూహాలను తెలంగాణలోనూ అమలు చేయాలనే యోచనలో బీజేపీ ఢిల్లీ పెద్దలు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్‌కు ఇన్నాళ్లు అండగా ఉండి చేయూతనిచ్చిన ఓ ప్రధాన వర్గాన్ని ఆకర్షించే వ్యూహానికి బీజేపీ పదును పెడుతుందని, తద్వారా రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానం కోసం బరిలో నిలిచే అవకాశాలను బలోపేతం చేసుకుంటుందని విశ్లేషకులంటున్నారు. ఇప్పటికే ఆ దిశలో ఒకరిద్దరు నేతలను తమ బుట్టలో వేసుకున్న కమలనాథులు ఈసారి బిగ్‌షాట్స్‌పై దృష్టి పెట్టి కాంగ్రెస్‌ను కోలుకోకుండా చేసి ఆ స్థానాన్ని ఆక్రమించే కసరత్తు చేయడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కాంగ్రెస్ కోలుకుంటుందా?
వాస్తవానికి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితిని బట్టి లోక్‌సభ ఫలితాలు తారుమారైతే మాత్రం కోలుకునే పరిస్థితులు ఇప్పట్లో లేవనేది బహిరంగ రహస్యమే. వందల సంఖ్యలో కేడర్‌ను, పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కోల్పోయిన ఆ పార్టీ లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకే ఆపసోపాలు పడాల్సి వచ్చింది. ముఖ్యంగా పార్టీ ఇంటి మనుషుల్లాంటి పొంగులేటి సుధాకర్‌రెడ్డి, రాపోలు ఆనందభాస్కర్ లాంటి నాయకులు కూడా పార్టీని వీడివెళ్లిపోవడం, పార్టీ నాయకత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేయడం మొదట్నుంచీ పార్టీ జెండా మోసిన కేడర్‌ను నైరాశ్యంలోకి నెట్టింది. దీనికితోడు గాంధీ కుటుంబానికి వీరవిధేయుడైన వీహెచ్ లాంటి నేతలు కాంగ్రెస్‌లో సామాజిక న్యాయం అమలు కావడం లేదని, రాహుల్‌గాంధీకి జ్ఞానోదయం కావాలని తాజాగా వ్యాఖ్యలు చేసిన తీరు ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది.
ఓ వైపు వలసల జోరు, మరోవైపు ఓటముల హోరు నడుమ రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ ప్రభ మసకబారిపోతుందనే చర్చ జోరందుకుంది. అయితే, ఈ పరిస్థితులను అంచనా వేస్తున్న గులాబీ శిబిరంలో మరికొంత ఉత్సాహం కనిపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీలు ప్రతిపక్ష స్థానం కోసం పోరాడాల్సిన పరిస్థితే వస్తే తమకు చాలా వెసులుబాటు కలుగుతుందని, ఆ రెండు పార్టీల పోరాటం ఓ కొలిక్కి వచ్చేసరికి 2023 అసెంబ్లీ ఎన్నికలు పూర్తవుతాయనే అంచనాలో ఆ పార్టీ నేతలున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కమలనాథులు రాష్ట్రంలో పుంజుకుని ప్రతిపక్ష పార్టీగా ఎదుగుతారా? కాంగ్రెస్ కోలుకుని కష్టంగానయినా బరిలో నిలుస్తుందా? ఈ రెండు జాతీయ పార్టీల్లో ఎవరు టీఆర్‌ఎస్‌కు రాజకీయ ప్రత్యర్థిగా మిగులుతారన్నది లోక్‌సభ ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి.
జెండాలు మారాయిలా!
1950 నుంచి 80వ దశకం వరకు తెలంగాణ రాజకీయాలను పరిశీలిస్తే మొదటి మూడు సాధారణ ఎన్నికల్లోనూ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల మధ్య పోటీ ఉండేది. కాంగ్రెస్ గెలిచేది.. కమ్యూనిస్టులు పోటీ ఇచ్చి ఓడిపోయేవాళ్లు. అప్పుడు రాజకీయ రణక్షేత్రంలో పోటీ అంతా కాంగ్రెస్ జెండా – ఎర్రజెండాల మధ్యే ఉండేది. ఆ తర్వాత కొన్నాళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఎదురే లేకుండా పోయింది. 1980వ దశకంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత మూడు దశాబ్దాల పాటు కాంగ్రెస్–తెలుగుదేశం పార్టీల మధ్య అధికారం దోబూచులాడింది. క్రమంగా ఎర్రజెండా కనుమరుగై మూడురంగుల జెండా – పచ్చ జెండాల మధ్య పోటీ పెరిగింది.
ఇక, 2014లో తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాజకీయ క్షేత్రం ఉన్నట్టుండి మారిపోయింది. అధికారం కోసం పోరు కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల మధ్య నడిచింది. ఈ పోరాటంలో రెండుసార్లూ గులాబీ జెండాదే పైచేయి అయింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కూడా కాంగ్రెస్ జెండా వెలవెలబోయింది. ఈ జెండాకు మరో 10 రకాల రంగులను కలుపుకుని 2018 అసెంబ్లీ రణక్షేత్రంలో పోరాడినా ఓటమి తప్పలేదు. 2019 పార్లమెంటు ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌కు ధీటుగా మరో పార్టీ పుంజుకునే పరిస్థితి వస్తే రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం రంగులు మారనున్నాయి. తొలిసారి కాంగ్రెస్ పోటీలో కనుమరుగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment