మహబూబ్‌నగర్ జేపీఎన్‌సీఈలోని కౌంటింగ్ కేంద్రంలోని రికార్డులను పరిశీలిస్తున్న కలెక్టర్ రొనాల్డ్‌రోస్ (ఫైల్)
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు కౌంట్‌డౌన్ మొదలైంది. 42 రోజుల నుంచి నెలకొన్న లోక్‌సభ ఎన్నికల ఫలితాల ఉత్కంఠకు త్వరలోనే తెరపడనుంది. హోరాహోరీగా జరిగిన లోక్‌సభ పోరులో అభ్యర్థుల భవితవ్యం మరో ఐదు రోజుల్లో తేలనుంది. దీంతో దాదాపు నెలన్నర రోజుల పాటు స్తబ్దతగా ఉన్న పార్టీ నేతల్లో మళ్లీ హడావుడి మొదలైంది. పోలింగ్ తర్వాత వివిధ కార్యక్రమాల్లో నిమగ్నమైన లోక్‌సభ అభ్యర్థుల్లో ఎన్నికల ఫలితాల సమయం దగ్గర పడుతున్న కొద్దీ టెన్షన్ పెరుగుతోంది. ఇప్పటికే గెలుపుపై ధీమాతో ఉన్నా.. ఓటరన్న ఎవరిని ఆశీర్వదించాడో తెలియక ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు గత నెల 11న జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోలైన ఓట్లను ఈనెల 23న ఓట్ల లెక్కించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన మేరకు అధికారులూ కౌంటింగ్ ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లు.. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇటు ఎంపీ అభ్యర్థులు సైతంఓట్ల లెక్కింపు ఘట్టానికి సన్నద్ధమవుతున్నారు. ఈపాటికే కౌంటింగ్ ఏజెంట్ల ఎంపికలో తలమునకలయ్యారు. చురుకైన వారిని కౌంటింగ్ కేంద్రాల్లో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు.
రెండు చోట్లా హోరాహోరీ
ఈసారి మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి 12 మంది, నాగర్‌కర్నూల్ నుంచి 11 మంది పోటీ చేశారు. రెండు స్థానాల్లోనూ ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ కొనసాగింది. ఆయా పార్టీల అభ్యర్థులందరూ గెలుపు కోసం ఎత్తుకు పైఎత్తులు వేశారు. ఒకవైపు ప్రచారం నిర్వహిస్తూనే మరోవైపు తమ గెలుపుపై ప్రభావితం చేసే అంశాలపై దృష్టి సారించారు. మహబూబ్‌నగర్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డికి బీజేపీ అభ్యర్థి డి.కె.అరుణ గట్టి పోటీ ఇచ్చారు. నాగర్‌కర్నూల్‌లోనూ టీఆర్‌ఎస్, బీజేపీ మధ్యే పోరు కొనసాగింది.
కాగా మహబూబ్‌నగర్ పార్లమెంటు పరిధిలోని మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర, నారాయణపేట, మక్తల్, షాద్‌నగర్, కోస్గి అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 15,05,151 ఓట్లు ఉండగా 9,82,888 పోలయ్యాయి. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి, వనపర్తి, గద్వాల, అలంపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో మొత్తం 15,87,281 మంది ఓట్లు ఉంటే.. 9,92,226 పోలయ్యాయి. ఇక పోలింగ్ ముగిసిన వెంటనే బూత్‌ల వారీగా నమోదైన ఓట్ల వివరాలు తెప్పించుకున్న పార్టీలు ఇప్పటికే ఎవరి గెలుపుపై వారు ధీమాతో ఉన్నారు. అయితే ఓటరన్న ఎవరిని ఆశీర్వదించాడో ఓట్ల లెక్కింపు రోజే తేలనుంది.
రెండు స్థానాలు.. మూడు కౌంటింగ్ కేంద్రాలు
జిల్లాలో మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానాలు ఉండగా.. అధికారులు మూడు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. మహబూబ్‌నగర్ పార్లమెంటు ఓట్ల లెక్కింపునకు జిల్లా కేంద్రంలోని భగీరథకాలనీ వద్ద ఉన్న జయప్రకాశ్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ (జేపీఎన్‌సీఈ) లో ఓట్ల లెక్కింపు జరగనుంది. అధికారులు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక్కో హాలు ఏర్పాటుచేశారు.
ప్రతి నియోజకవర్గ హాలులో 14 టేబుళ్లు ఉంటాయి. మొత్తం 18 రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది. ఒక్కో టేబుల్‌కు ఒక్కో ఏజెంటు చొప్పున నియమించుకునే అవకాశం అన్ని పార్టీలకు ఎన్నికల సంఘం కల్పించింది. వీరితోపాటు ఏజెంట్లందరికీ కలిపి మరో ఏజెంట్లను నియమించుకోవచ్చని సూచించింది. ఓట్ల లెక్కింపు రోజు ఉదయం 5.30 గంటలకు అన్ని పార్టీల అభ్యర్థులు లేదా ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్‌రూం తెరుస్తారు. తర్వాత పోలింగ్ ప్రారంభం కానుంది. ముందుగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఐదు వీవీప్యాట్లను ఆయా రిటర్నింగ్ అధికారుల ముందు లెక్కిస్తారు. తర్వాత ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇదిలావుండగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 615ను మహబూబ్‌నగర్ హాల్‌లోనే లెక్కిస్తారు.
∙నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానానికి సంబంధించి రెండు చోట్ల ఓట్ల లెక్కింపు ఉంటుంది. వనపర్తి, కల్వకుర్తి, గద్వాల, అలంపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పోలైన ఓట్లను నాగర్‌కర్నూల్ శివారులోని ఉయ్యాలవాడలోని ప్రైవేట్ బీఎడ్ కాలేజీలో లెక్కించనున్నారు. నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పోలైన ఓట్లను జిల్లా కేంద్రంలోని నెల్లికొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో లెక్కిస్తారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటుచేసిన అధికారులు వీడియో, సీసీ కెమెరాల నిఘాలో ఓట్లు లెక్కిస్తారు. ఇప్పటికే ఓట్ల లెక్కింపు సిబ్బందిని నియమించిన అధికారులు వారికి శిక్షణ ఇచ్చారు. అలాగే ఓట్ల లెక్కింపు, ఏర్పాట్లకు సంబంధించి అభ్యర్థులతో భేటీ అయిన రిటర్నింగ్ అధికారులు వారికి అవగాహన కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment