పార్టీ మారి ప్రజలకు ద్రోహం చేస్తున్నారు : భట్టి | Congress Leader Bhatti Vikramarka Slams TRS Party | Sakshi
Sakshi News home page

ప్రమాదంలో ప్రజాస్వామ్యం

Published Mon, May 20 2019 11:10 AM | Last Updated on Mon, May 20 2019 11:10 AM

Congress Leader Bhatti Vikramarka Slams TRS Party - Sakshi

ఎన్టీఆర్‌నగర్‌: మాట్లాడుతున్న మల్లు భట్టి విక్రమార్క

దిల్‌సుఖ్‌నగర్‌/మీర్‌పేట: శాసనసభ విలువలను కాపాడే విధంగా సీఎం వ్యవహరించాలని, కానీ అందుకు విరుద్ధంగా ఆయనే ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు ప్రోత్సహించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ప్రతిపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇప్పటికే ఓటర్లు పార్టీలు మారిన ఎమ్మెల్యేలపై కేసులు పెడుతున్నారని, పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్రం తలదించుకోవాల్సి వస్తుందన్నారు. ఓటర్లను మోసం చేసిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆయన ఆదివారం మహేశ్వరం నియోజవర్గంలోని ఆర్‌కేపురం, సరూర్‌నగర్‌ డివిజన్‌లలో ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌నగర్‌లో నిర్వహించిన సభలో మాట్లాడుతూ... కాంగ్రెస్‌ తరఫున గెలిచి పార్టీ మారిన సబితా ఇంద్రారెడ్డి పై 420, 405, 406 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారన్నారు. ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను ప్రతిపక్షం ప్రశ్నిస్తుందనే భయంతోనే ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారన్నారు.

సబితకు కాంగ్రెస్‌లో పెద్దపీట వేశామని, కానీ ఆమె పార్టీ మారి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఏమాత్రం నైతిక నైతిక విలువలున్నా సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్‌ విసిరారు. సదరు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. దీంతో కోర్టుకు వెళ్లామన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. సబితకు కాంగ్రెస్‌ పెద్దపీట వేసిందని, పార్టీ మారిన ఆమెపై 420 కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో వస్తుందని, కేసీఆర్‌ అందరికంటే ముందే పోయి కాళ్లు మొక్కుతాడని వ్యాఖ్యానించారు. సభలో మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, నాయకులు కుసుమకుమార్, భానుప్రకాశ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చల్ల నరసింహారెడ్డి, జంగారెడ్డి, నరసింహాæరెడ్డి, హర్షిలత, శిరీష తదితరులు పాల్గొన్నారు.  

చట్టసభలు దేవాలయాలతో సమానం...  
ప్రజాస్వామ్యంలో చట్టసభలు దేవాలయాలతో సమానమని, అలాంటి చోట పవిత్రమైన మనుషులే ఉండాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ‘ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర’లో భాగంగా ఆయన ఆదివారం బాలాపూర్, మల్లాపూర్, కుర్మల్‌గూడ, నాదర్‌గుల్, బడంగ్‌పేట, అల్మాస్‌గూడ, మీర్‌పేట, జిల్లెలగూడ మున్సిపాలిటీల మీదుగా రోడ్‌షో నిర్వహించారు. అనంతరం జిల్లెలగూడలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఓటర్ల నమ్మకాన్ని వమ్ము చేశారన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు వారి పదవులకు రాజీనామా చేసేలా ఒత్తిడి తేవాలన్నారు. సభాపతి చట్టాలను చట్టాలను గౌరవించి, వారి సభ్యత్వాలను రద్దు చేయాలని కోరారు. 

‘కార్పొరేట్‌’తో ప్రభుత్వ వ్యాపారం...  
ప్రభుత్వం కార్పొరేట్‌ జూనియర్‌ కళాశాలలతో రూ.వేల కోట్ల వ్యాపారం చేస్తూ వారికి అనుకూలంగా వ్యవహరిస్తోందని భట్టి విక్రమార్క ఆరోపించారు. కార్పొరేట్‌ కళాశాలలతో ప్రభుత్వం కుమ్మక్కు కావడం వల్లే రాష్ట్రంలో దాదాపు 23 మంది ఇంటర్‌ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్లోబరీనా సంస్థతో కోట్లలో ఒప్పందం కుదుర్చుకొని ఎంతోమంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుందన్నారు. ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలపై వెంటనే సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్‌ చేశా>రు. లేని పక్షంలో అందులో ప్రభుత్వ ప్రమేయం ఉన్నట్లేనని అన్నారు. సమావేశంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ విప్‌ అనిల్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, నర్సింహారెడ్డి, టీపీసీసీ కార్యదర్శి వంగేటి ప్రభాకర్‌రెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి రాచమల్ల సిద్దేశ్వర్, బడంగ్‌పేట మున్సిపాలిటీ వైస్‌ ఛైర్మన్‌ చిగిరింత నర్సింహారెడ్డి, జంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

పార్టీ మారి ప్రజలకు ద్రోహం చేస్తున్నారు : భట్టి
మీర్‌పేట: టీఆర్‌ఎస్‌ హయాంలో వేసిన ఓటుకు విలువ లేకుండా పోయిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రలో భాగంగా జిల్లెలగూడ మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం రాత్రి బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహేశ్వరంలో కాంగ్రెస్‌పై అభిమానంతో  1.26 లక్షల మంది ఓటు వేసి గెలిపిస్తే సబితా ఇంద్రారెడ్డి ఓటర్లను మోసం చేసి పార్టీ మారారని దుయ్యబట్టారు. ఓ పార్టీలో గెలిచిన అనంతరం మరోపార్టీలో చేరిన వారిపై, ప్రోత్సహించిన సీఎం కేసీఆర్‌పై ఆర్టికల్‌ 356 ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. మిషన్‌ భగీరథ, ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పేరిట టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లక్షల కోట్లు వెచ్చిస్తున్నామని చెప్పి నిధులన్నీ దోచేస్తోందని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement