గులాబీదే పెద్దపల్లి | TRS Won in Peddapalli Telangana Lok Sabha Elections 2019 | Sakshi
Sakshi News home page

గులాబీదే పెద్దపల్లి

Published Fri, May 24 2019 1:13 PM | Last Updated on Fri, May 24 2019 1:13 PM

TRS Won in Peddapalli Telangana Lok Sabha Elections 2019 - Sakshi

విజయ సంకేతం చూపుతున్న టీఆర్‌ఎస్‌ నాయకులు

సాక్షి, మంచిర్యాల: పెద్దపల్లి లోక్‌సభస్థానాన్ని టీఆర్‌ఎస్‌ తిరిగి నిలబెట్టుకుంది. ఆ పార్టీ అభ్యర్థి బొర్లకుంట వెంకటేష్‌నేత తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ అభ్యర్థి ఆగం చంద్రశేఖర్‌పై 63 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గురువారం చేపట్టిన ఓట్ల లెక్కింపుల్లో అన్ని రౌండ్లలోనూ టీఆర్‌ఎస్‌ ఆధిక్యతను కనపరిచింది. ఉత్తర తెలంగాణలో బీజేపీ ఘన విజయాలు సొంతం చేసుకోవడం, ఒక్క పెద్దపల్లిలో మాత్రం చతికలపడడంపై కమలనాథులు అంతర్మథనం చెందుతున్నారు.

టీఆర్‌ఎస్‌ విజయం
పెద్దపల్లి లోకసభ స్థానంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చి కూడా ఫలితాన్ని రాబట్టుకుంది. ఏప్రిల్‌ 11వ తేదీన మొదటి విడతలోనే తెలంగాణలో ఎన్నికలు జరగగా.. దేశవ్యాప్తంగా ఏడు విడతలుపూర్తయ్యాక గురువారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. పెద్దపల్లి లోకసభ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ నుంచి బొర్లకుంట వెంకటేశ్‌నేత, కాంగ్రెస్‌ నుంచి ఆగం చంద్రశేఖర్, బీజేపీ నుంచి ఎస్‌.కుమార్‌ పోటీపడ్డారు. 17 మంది పోటీలో ఉన్నప్పటికి, టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. పెద్దపల్లి లోక్‌సభ పరిధిలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, రామగుండం, మంథని, పెద్దపల్లి, ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పెద్దపల్లి జిల్లా సెంటినరీకాలనీలోని జెఎన్‌టీయూ భవనంలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. గురువారం రాత్రికి ఫలితం ప్రకటించారు.

పార్టీ మార్పు.. దక్కిన ఫలితం
జిల్లాకు చెందిన బొర్లకుంట వెంకటేశ్‌ నేత పార్టీ మారినా ఫలితం దక్కించుకున్నారు. ఎక్సైజ్‌ శాఖలో ఉన్నతాధికారిగా ఉన్న వెంకటేశ్‌ నేత.. ఎన్నికల్లో పోటీచేసేందుకు ఉద్యోగాన్ని సైతం వదులుకున్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బాల్క సుమన్‌తో తలపడ్డారు. ఆ ఎన్నికల్లో ఓటమి అనంతరం అదే బాల్క సుమన్‌ సహకారంతో అనూహ్యంగా టీఆర్‌ఎస్‌లో చేరి లోకసభ అభ్యర్థిత్వం దక్కించుకున్నారు. టీఆర్‌ఎస్‌లో నెలకొన్న అంతర్గత విభేదాలు ఆయనకు బాగా కలిసొచ్చాయి. అప్పటికే ఎంపీ టికెట్‌ దాదాపు ఖాయమనుకున్న జి.వివేక్‌కు బాల్క సుమన్‌కు మధ్య పొరపొచ్చాలు రావడం అభ్యర్థి మార్పునకు బీజం పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా వ్యవహరించారని ఆరోపిస్తూ వివేక్‌కు టికెట్‌ రాకుండా చేయడంతోపాటు.. ప్రత్యామ్నయంగా వెంకటేశ్‌ నేతను పార్టీ నేతలు తెరపైకి తీసుకొచ్చారు. చివరి నిమిషంలో వెంకటేశ్‌ నేతను పార్టీలో చేర్చుకుని పార్టీ బీ–ఫారం అందజేశారు. ఎమ్మెల్యే కోసం ఉద్యోగాన్ని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చిన వెంకటేశ్‌ నేత అనూహ్యంగా పార్టీ మారి ఎంపీగా లోక్‌సభలో అడుగుపెడుతున్నారు.

తగ్గిన మెజార్టీ
అసెంబ్లీ ఎన్నికల్లో ఏకపక్ష విజయాలు సాధించిన టీఆర్‌ఎస్‌.. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాస్త వెనక్కి తగ్గింది. గత లోకసభ ఎన్నికలతో పోల్చితే ఈ సారి మెజార్టీ బాగా తగ్గింది. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాల్క సుమన్‌ 2,91,158 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. అప్పటితో పోల్చితే ఇప్పుడు లోక్‌సభ పరిధిలో మంథని మినహా అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే ఉన్నారు. కాని వెంకటేశ్‌ నేతకు 63 వేల మెజార్టీ మాత్రమే వచ్చింది. కాంగ్రెస్‌ అభ్యర్థి స్థానికేతరుడైనా మెజార్టీ తగ్గడాన్ని టీఆర్‌ఎస్‌ నేతలు పలువురు అంతర్గత సంభాషణల్లో ప్రస్తావిస్తున్నారు.

కమలనాథుల్లో అంతర్మథనం
ఎంపీ ఎన్నికల్లో బీజేపీ నేతల పరిస్థితి విచిత్రంగా మారింది. ఓ వైపు పక్కనే ఉన్న ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌లో పార్టీ అభ్యర్థులు ఘన విజయాలు సాధిస్తే.. పెద్దపల్లిలో మాత్రం మూడో స్థానంలో, అది కూడా చాలా తక్కువ ఓట్లు సాధించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. బీజేపీ గెలిచిన స్థానాల్లో పార్టీతోపాటు బలమైన అభ్యర్థులు ఉండడం కూడా కారణమైంది. పెద్దపల్లిలో కూడా బలమైన అభ్యర్థి పోటీలో ఉంటే విజయం తథ్యమయ్యేదని చెబుతున్నారు. టీఆర్‌ఎస్‌ టికెట్‌ దక్కని జి.వివేక్‌ను బీజేపీ నుంచి బరిలోకి దింపేందుకు పార్టీ పెద్దలు తీవ్ర ప్రయత్నాలు చేసినా.. అప్పట్లో ఫలించలేదు. ఒకవేళ వివేక్‌లాంటి అభ్యర్థి పోటీకి దిగితే కచ్చితంగా ఫలితం వచ్చేదని పార్టీ సీనియర్‌ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఏదేమైనా పక్కనున్న మూడు నియోజకవర్గాల్లో బీజేపీ ఘన విజయం సాధించగా.. పెద్దపల్లిలో మాత్రం పాత కథే పునరావృతం కావడంతో ఊసురుమంటున్నారు.  

ప్రధాన పార్టీలు సాధించిన ఓట్లు
బొర్లకుంట వెంకటేశ్‌ (టీఆర్‌ఎస్‌)  4,41,321
ఆగం చంద్రశేఖర్‌ (కాంగ్రెస్‌)        3,46,141
ఎస్‌.కుమార్‌ (బీజేపీ)              92,606
బొర్లకుంట వెంకటేశ్‌(టీఆర్‌ఎస్‌)మెజార్టీ 95,180

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement