రాష్ట్రాభివృద్ధిపై బీజేపీ, టీడీపీ దొంగాట
పీసీసీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి మండిపాటు
మైలవరం: రాష్ట్రాభివృద్ధిపై బీజేపీ, టీడీపీ దొంగాట అడుతున్నాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి విమర్శించారు. తిరువూరు నుంచి విజయవాడ వెళ్తూ మార్గమధ్యంలో మైలవరంలో మంగళవారం కొద్దిసేపు నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు. రాష్ట్రానికి రూ. 5 లక్షల కోట్ల విలువైన ప్రయోజనాలు కలిగేలా విభజన చట్టంలో కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించిందని తెలిపారు. ప్రస్తుతం కేంద్రం రూ.6 వేల కోట్లు మాత్రమే ఇచ్చిందని తెలుగుదేశం, రూ. 1.70 లక్షల కోట్లు ఇచ్చామని బీజేపీ చెబుతున్నాయన్నారు.
ఈ నిధులపై ఇరు పార్టీలు పోట్లాడుకుని రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరలా తయారు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రజా కోర్టులో వీరు ద్రోహులుగా మిగిలిపోతారన్నారు. కాపులకు చంద్రబాబు ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తోందన్నారు. పార్లమెంట్‌లో కాపు వర్గీకరణపై సవరణ చేయాలని కోరారు. కాపు వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు దేవినేని ఆవినాష్, పార్టీ ప్రధాన కార్యదర్శులు ఆకుల శ్రీనివాస్‌కుమార్, పర్సా రాజీవ్త్రన్, మైలవరం నియోజకవర్గ ఇన్‌చార్జి బొర్రా కిరణ్ తదితరులు పాల్గొన్నారు.