హౌస్‌ ఫర్‌ సేల్‌ | House for sale | Sakshi
Sakshi News home page

హౌస్‌ ఫర్‌ సేల్‌

Published Mon, Feb 26 2018 12:41 PM | Last Updated on Fri, Aug 10 2018 8:46 PM

House for sale - Sakshi

బొబ్బిలిలో హౌస్‌ ఫర్‌ ఆల్‌ నిర్మాణానికి జెండాలు పాతిన దృశ్యం(కార్టూన్‌తో)


‘పురపాలికల్లో ఇళ్ల కోసం అధికారులను మాత్రమే సంప్రదించాలి. మధ్యవర్తులు, ఇతరులను సంప్రదించవద్దు’.. ఆదివారం విజయనగరంలో పురపాలక మంత్రి నారాయణ పేదలకిచ్చే ‘హౌస్‌ ఫర్‌ ఆల్‌’ పథకంపై స్వయంగా చెప్పిన మాటలు.. 
పై  చిత్రం చూశారా.. బొబ్బిలి మున్సిపాలిటీలోని పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల విభాగానికి చెందిన కార్యాలయంలో కంప్యూటర్ల ముందు కూర్చున్నవారు అధికారులు కారు. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు. హౌస్‌ ఫర్‌ ఆల్‌ పథకానికి వచ్చిన దరఖాస్తులను పరిశీలించడం.. అర్హులంటూ తమ వారిని ఎంపిక చేసుకోవడం వారి పని. మొత్తంగా ఇళ్ల ఎంపిక బాధ్యతను వారి చేతుల్లోకి తీసుకున్నారు.  ఇటీవల వారం రోజులుగా బొబ్బిలి మున్సిపాలిటీలో పలువురు కౌన్సిలర్లు  మున్సిపల్‌ కార్యాలయాల్లోనే తిష్ట వేసి లబ్ధిదారుల పేర్లు, కొత్త దరఖాస్తులు చేస్తున్నారు. కేవలం అధికారులే చేయాల్సిన పనిని వీరు అక్కడి కంప్యూటర్‌ ఆపరేటర్లతో చేయించుకోవడం గమనార్హం. ఈ విషయం తెల్సినా అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. మరికొందరు అధికారులు సహకరిస్తున్నారు. 

 

బొబ్బిలి: టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఆరాచక పాలన సాగిస్తోంది. పింఛన్లు, ఇళ్లు, రేషన్‌ కార్డులు ఇలా.. అన్నింటిలోనూ రాజకీ య వివక్ష చూపుతోంది. జన్మభూమి కమిటీల సభ్యులు, పార్టీ చోటా నాయకులతో అవినీతి చేస్తోంది. పథకానికి ఓ రేటు చొప్పున దందా చేస్తోందంటూ జనం మండిపడుతున్నారు. ప్రజా ధనంతో అమలుచేసే పథకాలు అర్హులకు అందడం లేదని వాపోతున్నారు. పట్టణాల్లో పేదలకు ఇచ్చే ఇళ్లలోనూ టీడీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని, తమ వారికే ఇళ్లు కేటాయించేలా జాబితాలు రూపొంది స్తున్నారని ఆవేదన చెందుతున్నారు. పేదలు బతకడం కష్టం గా మారిందని, పనులు మానుకుని ఇంటిళ్లపాదీ నేతల సేవ చేస్తే తప్ప ప్రభుత్వ పథకాలు అందేలా లేవంటూ మదనపడుతున్నారు. టీడీపీ పాలనా తీరును దుమ్మెత్తి పోస్తున్నారు. 

దగ్గరుండి జాబితాల రూపకల్పన.. 
పట్టణ పేదల కోసం కేటాయించిన హౌస్‌ ఫర్‌ ఆల్‌ పథకం.. హౌస్‌ ఫర్‌ టీడీపీగా మారింది.  ఓ పక్క అర్హులను కొర్రీలు వేసి తొలగిస్తూనే.. కొత్త దరఖాస్తులంటూ అధికార పార్టీ కౌన్సిలర్లు మున్సిపల్‌ కార్యాలయంలో కూర్చుని తమ వారి జాబితాలు రూపొందిస్తున్నారు. అధికారుల్లా కార్యాయాల్లో ని కంప్యూటర్ల ముందు కూర్చొని జాబితాలు సిద్ధం చేస్తున్నా రు. అన్నింటా తామై ఉండి నడిపించాల్సిన పట్టణ ప్రణాళికా విభాగం చేష్టలుడిగి చూస్తోంది. బొబ్బిలి మున్సిపాలిటీలో కంప్యూటర్ల ముందు కౌన్సిలర్ల పెత్తనమే కనిపిస్తున్నా కిమ్మనడంలేదు. ఎవరికి దరఖాస్తు చేయాలి? మరెవరిని అనర్హులు గా చూపించాలనే విషయంలో అధికారమంతా అధికార పార్టీ కౌన్సిలర్ల  చేతుల్లోకి వెళ్లిపోవడంతో ఇక్కడి అధికార విభాగం లోపభూయిష్టంగా మారిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కౌన్సిలర్లు కూడా తమ వర్గానికి చెందిన వారికే ఇళ్ల లబ్ధిదారులుగా గుర్తించే ప్రయత్నాలు ప్రారంభించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీల్లో ఉన్న నిరుపేదలు, ఎటువంటి ఆసరా లేని వారికోసం ఈ ఇళ్లను కేంద్ర ప్రభుత్వ నిధులతో టిడ్కో ఆధ్వర్యంలో నిర్మాణాలు చేయాలని సంకల్పించారు. ఇప్పుడు కౌన్సిలర్లకు అధికారం ఇవ్వడంతో అర్హులను వివిధ కారణాలతో తొలగి స్తున్నారన్న వ్యాఖ్యలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. 

ఎవరికోసం ఈ ఇళ్లు? 
జిల్లాలోని పార్వతీపురం, బొబ్బిలి, నెల్లిమర్ల, సాలూరు ము న్సిపాలిటీల్లో ఈ ఇళ్లను నిర్మించేందుకు స్థలాలు కేటాయిస్తున్నారు. ఇప్పటికే విజయనగరం, నెల్లిమర్ల, బొబ్బిలి ప్రాంతా ల్లో స్థలాలను కేటాయించారు. ఆయా మున్సిపాలిటీల్లో సొంత ఇల్లు లేనివారు, సొంత ఇంటి స్థలం లేనివారిని గుర్తించాల్సి ఉంది. మున్సిపాలిటీ పరిధిలో మాత్రమే నివసిస్తున్న వారు అర్హులు. అలాగే, సంవత్సరాదాయం రూ.3 లక్షలకు మించి ఉండరాదు. గతంలో ఎటువంటి గృహరుణం పొంది ఉండకూడదు. 


అపార్ట్‌మెంట్ల నిర్మాణం కోసం యంత్రాలతో మట్టి నమూనాలు సేకరిస్తున్న కాంట్రాక్టర్లు

నామమాత్రంగా సిబ్బంది నియామకం..  
వార్డుల్లో మున్సిపల్‌ సిబ్బందిని అర్హుల ఎంపికకు నియమిస్తున్నామని మున్సిపాలిటీ అధికారులు చెబుతున్నారు. ఇక్కడ కేవలం నామమాత్రంగానే వీరిని నియమించారని, వార్డుల్లో ఇళ్ల గురించి చెప్పేది మాత్రం కౌన్సిలర్లేననీ, సంబంధిత అధికారులు ఎవరూ రావడం లేదని వార్డువాసులు చెబుతున్నారు. చాలా వార్డుల్లో నియమించిన మున్సిపల్‌ సిబ్బందిని వార్డుల్లోకి రావద్దని కౌన్సిలర్లు ముందే హెచ్చరించినట్టు సమాచారం. ఇప్పటికే ఈ ఇళ్ల కోసం దరఖాస్తులు చేసి ఉన్న వారి సంఖ్య సుమారు 20 వేలకు పైగానే ఉంది.

రుణాలిచ్చేదుందా? 
హౌస్‌ ఫరాల్‌ పథకంలో రుణాలు, డిపాజిట్లు ముఖ్యం.  కేటగిరీల ప్రకారం ఒకటో కేటగిరీలో రూ.2.65లక్షలు, రెండో కేటగిరీకి రూ.3.15 లక్షలు, మూడో కేటగిరీకి రూ.3.65 లక్షల రుణం బ్యాంకులు ఇవ్వాలన్నది పథక నిర్ణయం. దీంతో ఈ రుణాలు నిజంగా బ్యాంకులు ఇస్తాయా అని జనం నోరెళ్లబెడుతున్నారు. దీంతో పాటు నిరుపేదలంతా మూడు కేటగిరీల్లోనూ రూ.500, 50,000, 100,000 వంతున డిపాజిట్లు చెల్లించాల్సి ఉంది. ఈ డిపాజిట్ల చెల్లింపుతో పాటు రుణ వాయిదాలు చెల్లించాలి. దీంతో ఈ గృహ నిర్మాణాలపై  నమ్మకం లేకుండా పోతోందని ప్రజలు వాపోతున్నారు. 

రైల్వే శాఖ అనుమతిస్తేనే ఇళ్ల నిర్మాణం.. 
బొబ్బిలిలో నిరుపేదల కోసం అందరికీ ఇళ్లు పథకంలో ప్లాట్లు నిర్మించేందుకు గ్రోత్‌ సెంటర్‌ పక్కన 34 ఎకరాల స్థలం కేటాయించారు. ఈ స్థలానికి వెళ్లేందుకు దారి లేదు. రైల్వే లైన్‌ దాటి వెళ్లాల్సిన అవసరం ఉన్నందున అధికారులు ఇప్పుడు డీఆర్‌ఎంకు లేఖ రాస్తున్నారు. ఇక్కడ గేటు వేయడం లేదా ఓవర్‌ బ్రిడ్జి నిర్మించడం అవసరం. గేట్లను ఇప్పటికే రైల్వే శాఖ తొలగిస్తున్నది. దీంతో ఓవర్‌బ్రిడ్జి తప్పనిసరి. ఇదంతా అయ్యే పనేనా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ముందుగా సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ పార్కు ఎదురుగా ఉన్న స్థలం చూపించిన అధికారులు దానిని ఎందుకు మార్చాతో తెలియడంలేదు. దారిలేని చోటును ఎందుకు  కేటాయించారో వారికే తెలియాలి. మొత్తం అన్ని మున్సిపాలిటీల్లోనూ స్థల సేకరణ జరిగాక నిర్మాణాలు ప్రారంభిస్తామని టెండర్‌ దక్కించుకున్న సంస్థ చెబుతుండగా.. ముందుగా అర్హులను తేల్చేందుకు కౌన్సిలర్లు ఉబలాట పడుతుండటం కొసమెరుపు. 

బొబ్బిలి పట్టణంలోని ఆరో వార్డులో గెంబలి కవిత అనే మహిళ ఉంది. అదే పేరుతో ఐదో వార్డులో మరో మహిళ ఉంది. ఇద్దరూ ఇల్లు కోసం దరఖాస్తు చేశారు. ఇందులో గెంబలి కవిత పేరున ఇల్లు మంజూరై ఉందని మరొకరి దరఖాస్తును తిరస్కరించారు. కాదు బాబోయ్‌ అంటున్నా అటు హౌసింగ్, ఇటు మున్సిపల్‌ కార్యాలయానికి తిప్పుతున్నారే తప్ప సమస్యను పరిష్కరించడంలేదు. వీరే కాదు పట్టణంలోని హౌస్‌ఫర్‌ఆల్‌ పథకానికి వచ్చిన దరఖాస్తుల్లో సుమారు 30 శాతం ఇళ్లున్నాయని, ఇక్కడి వారు కాదని తిరస్కరిస్తున్నారు.


మా పేరు గల్లంతైందని పట్టణ ప్రణాళికా విభాగం అధికారిని ప్రశ్నిస్తున్న కవిత

 ఈ చిత్రంలోని వ్యక్తి పేరు ఈశ్వరరావు. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ భార్య సుమ, కుమార్తె హారికలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. సొంత ఇల్లు లేకపోవడంతో ఇందిరమ్మ కాలనీలోని ఓ ఇల్లు అద్దెకు తీసుకుని తనకొచ్చే కొద్దిపాటి సంపాదనలోనే రూ.1500 నెలకు అద్దె చెల్లిస్తున్నాడు. హౌస్‌ ఫర్‌ ఆల్‌ పథకంలో ఇటువంటి వారికి ఇల్లు మంజూరు చేస్తారనే సరికి దరఖాస్తు చేసుకున్నాడు. ఇతనికి ఆధార్‌ లింక్‌ కావడం లేదని జాబితా లోంచి పేరు తొలగించారని ఆవేదన చెందుతున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement