గుడివాడ మున్సిపల్ కార్యాలయం (ఫైల్ ఫొటొ)
సాక్షి, కృష్ణా : గుడివాడలో టీడీపీ నేతల కక్షసాధింపు చర్యలకు దిగారు. ఇటీవల గూడివాడ మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం సందర్భంగా కౌన్సిలర్ కిమిలి వెంకటరెడ్డి టీడీపీకి వ్యతిరేకంగా ఓటేశారు. దీంతో స్థానిక టీడీపీ నేతలు కుటిలయత్నాలకు తెరలేపారు. కిమిలి వెంకటరెడ్డిపై ఎక్సైజ్ అధికారులతో తప్పుడు కేసులు బనాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు చెందిన కిరాణా దుకాణంలో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కిరాణా షాపులో మద్యం బాటిళ్లు దొరికాయంటూ ఈ తనిఖీల సందర్భంగా హడావుడి చేశారు. కౌన్సిలర్ సోదరిని విచారణ పేరుతో ఎక్సైజ్ కార్యాలయానికి తీసుకెళ్లారు.
అక్కడ తమ వద్ద ఉన్న మద్యం బాటిళ్లను చూపి ఎక్సైజ్ అధికారులు ఆమెపై కేసు నమోదుకు ప్రయత్నించినట్టు తెలిసింది. ఈ విషయం తెలియడంతో ఎమ్మెల్యే కొడాలి నాని వెంటనే అక్కడికి చేరుకున్నారు. మద్యం బాటిళ్లపై ఉన్న లేబుళ్లను పరిశీలించి.. ఇవి టీడీపీకి చెందిన మున్సిపల్ చైర్మన్ యలవర్తి బంధువు దుకాణానికి సంబంధించినవని గుర్తించారు. ఈ విషయమై ఎక్సైజ్ అధికారులను నిలదీయడంతో వారు కంగారుపడ్డారు. కేవలం విచారణ కోసమే కౌన్సిలర్ సోదరిని తీసుకొచ్చామని చెప్తూ.. ఆమెను విడిచిపెట్టారు. టీడీపీ రాజకీయ కక్షసాధింపులకు అధికారులు సహకరిస్తే సహించబోమని ఎమ్మెల్యే కొడాలి నాని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment