గుడివాడ అడ్డా అన్నవారు ఏమయ్యారు?
రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేసేది జగనే
మహానేత వైఎస్సార్, ఎన్టీఆర్ ఆశీస్సులే గెలిపిస్తాయి
వైఎస్సార్ సీపీ గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నాని
గుడివాడ
టీడీపీ అడ్డా.. గుడివాడ గడ్డ అని కబుర్లు చెప్పుకున్న నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమయ్యారని వైఎస్సార్ సీపీ గుడివాడ నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ప్రశ్నించారు స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. తమకు గుడివాడ ప్రజలతోపాటు మహానేత వైఎస్సార్, ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నాయన్నారు. వారి ఆశీస్సులతోనే నియోజకవర్గం పరిధిలో మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో విజయం సాధించామని పేర్కొన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లోనూ తమ పార్టీ విజయం సాధించడం, వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ తనను ఓడించడానికి ఒక వర్గం, ఒక పార్టీ నేతలు ఏకమై పనిచేశారని, వారి కుట్రలను ప్రజలు గమనించి బుద్ధిచెప్పారని అన్నారు. గుడివాడ మున్సిపాల్టీలో తమ పార్టీ అభ్యర్థులు 21 మందిని కౌన్సిలర్లుగా గెలిపించారని, మండల పరిషత్ ఎన్నికల్లో గుడివాడ రూరల్, నంది వాడ మండలాల్లో ఎంపీపీ, జెడ్పీటీసీలను గెలిపించారని పేర్కొన్నారు. గుడ్లవల్లేరు మండలం ఒక్క ఎంపీటీసీ స్థానం కోల్పోయినందున చేజారిందని వివరించారు. అయితే ఎన్నికలు పూర్తయినందున అన్ని పార్టీలను కలుపుకుని అభివృద్ధికి కృషిచేస్తామని ప్రకటిం చారు.
గుడివాడలో మంచి నీటి పైపులైన్లు నిర్మాణానికి రూ.60 కోట్లు, డ్రెయినేజీ నిర్మాణానికి రూ.90 కోట్ల నిధులు అవసరం ఉందన్నారు. తమను నమ్మి ఓట్లు వేసిన ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పారు. గుడివాడ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి యలవర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ పట్టణ సమగ్రాభివృద్ధే తమ లక్ష్యమన్నారు. గుడివాడలో కొడాలి నాని నాయకత్వాన్ని బలపర్చిన ప్రజలు ఈ విజ యాన్ని అందించారని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలిచిన కౌన్సిలర్ అభ్యర్థులు మేరుగు మరియకుమారి, వెంపల హైమావతి, కాటి విశాలి, చోరగుడి రవికాంత్, పార్టీ నాయకులు అడపా బాబ్జీ, గణపతి లక్ష్మణరావు, నెరుసు చింతయ్య, దుక్కిపాటి శశిభూషణ్, నెరుసు శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.