♦ నానిపై సభలో నిర్ణయం తీసుకోండి
♦ నివేదికలో పేర్కొన్న సభా హక్కుల కమిటీ!
♦ వ్యతిరేకించిన వైఎస్సార్‌సీపీ సభ్యులు
♦ రోజా వాదన వినాలని పట్టుబట్టిన పెద్దిరెడ్డి, జ్యోతుల
♦ ససేమిరా అన్న అధికారపక్ష సభ్యులు
సాక్షి, హైదరాబాద్: అంతా అనుకున్నట్లే జరుగుతోంది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్.కె.రోజాను శాసనసభకు ఏడాదిపాటు దూరం చేయాలన్న ప్రభుత్వ పన్నాగానికి అనుగుణంగా సభా హక్కుల కమిటీ (ప్రివిలేజెస్ కమిటీ) సిఫారసు చేయనున్నట్లు తెలిసింది. రోజా వాదన వినకుండా ఏకపక్ష నివేదిక ఇవ్వడం సరికాదని కమిటీలోని వైఎస్సార్‌సీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారని సమాచారం. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)పై చర్య విషయంలో సభ నిర్ణయం తీసుకోవాలని కమిటీ సిఫారసు చేస్తున్నట్లు తెలిసింది.దీన్ని కూడా వైఎస్సార్‌సీపీ సభ్యులు వ్యతిరేకించినట్లు తెలిసింది.
శాసనసభ హక్కుల కమిటీ సమావేశం శనివారం అసెంబ్లీలోని మూడో కమిటీ హాలులో చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన జరిగింది. సభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జ్యోతుల నెహ్రూ (వైఎస్సార్‌సీపీ), బండారు సత్యనారాయణమూర్తి, కురుగొండ్ల రామకృష్ణ, బీసీ జనార్ధన రెడ్డి, నందమూరి బాలకృష్ణ (టీడీపీ) హాజరయ్యారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కమిటీ నోటీసులు అందుకున్న కమిటీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ తన వివరణను రాతపూర్వకంగా అందజేశారు. చెవిరెడ్డి భాస్కరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (వైఎస్సార్‌సీపీ), వంగలపూడి అనిత (టీడీపీ) కమిటీ ముందు హాజరై తమ వాదనలు వినిపించారు.
శాసనసభ ఏకపక్షంగా విధించిన సస్పెన్షన్‌ను హైకోర్టు నిలుపుదల చేస్తూ తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా సభలోకి ప్రవేశించేందుకు అనుమతించకపోవడంతో ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఆందోళన చేస్తున్న రోజా శనివారం అస్వస్థతకు గురైనందున కమిటీ ముందు హాజరు కాలేరని, 15 రోజులు గడువు ఇవ్వాలని వైఎస్సార్‌సీఎల్పీ పక్షాన కమిటీకి లేఖ అందజేశారు. కమిటీ ఆ లేఖను పరిగణనలోకి తీసుకోలేదు. గత ంలో నిర్వహించిన సమావేశాలకు రోజా హాజరు కాలేదు కాబట్టి ఇక సమయం ఇవ్వాల్సిన అవసరం లేదని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. గత డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన పరిణామాలపై ఉప సభాపతి బుద్ధప్రసాద్ అందచేసిన నివేదికపై సమావేశం చర్చించింది.
సభ్యులు కమిటీ ముందు హాజరైనప్పుడు వారు సభలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో,వీడియో టేపులను ప్రదర్శించి చూపారు. వారి వివరణలు, వాదనలు నమోదు చేశారు.‘బుద్ధప్రసాద్ కమిటీ సిఫారసులకనుగుణంగా తాము వ్యవహరిస్తున్నామని వారికి తెలిపారు. కమిటీ నివేదికను సోమవారం స్పీకర్‌కు అందచేయటంతో పాటు సభలో ప్రవేశపెట్టనున్నారు. దాని ఆధారంగా సభ నిర్ణయం వెలువడనుంది. ప్రివిలేజ్ క మిటీ సమావేశం జరుగుతున్నంత సేపూ చీఫ్‌విప్ కాలువ శ్రీనివాసులు టీడీఎల్పీ ఆఫీసులోనే ఉన్నారు. సమావేశం ముగిసిన వెంటనే ఆయన సభ్యులతో మంతనాలు జరిపా రు.అంతా అనుకున్నట్లే జరుగుతోందని నిర్ధారించుకున్న తరువాత ఆర్థిక, సభా వ్యవహరాల మంత్రి యనమల రామకృష్ణుడుకు పరిస్థితిని వివరించారు. కమిటీ సమావేశంలో ఏం జరిగిందో సభ్యుడు బీసీ జనార్ధనరెడ్డి ఆర్థికమంత్రికి ఫోన్‌లో తెలిపారు.
మా నేతను విమర్శించినందువల్లే ప్రతి విమర్శలు
మా ముందు మా నేత జగన్‌మోహన్‌రెడ్డిని అధికారపక్ష సభ్యులు నోటికొచ్చినట్లు విమర్శిస్తుంటే తామెందుకు ప్రతి విమర్శలు చేయం.. అని ప్రివిలేజ్ కమిటీ ముందు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి వాదించినట్లు సమాచారం. అధికారపక్షం ప్రతిపక్ష నేతపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా కమిటీ సూచించాలని, కమిటీ సూచన మేరకు వారు నడుచుకుంటే తామూ అదే మార్గంలో నడుస్తామని చెప్పినట్లు అధికారవర్గాల సమాచారం. మీరు చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటారా, క్షమాపణ చెప్తారా అని కమిటీ సభ్యులు ప్రశ్నించగా తనకు నివేదిక ఇస్తే చూసి సమాధానం చెప్తానని చెవిరెడ్డి అన్నారు. మండలి నేతృత్వంలోని కమిటీ అన్నీ చూసే నివేదిక ఇచ్చిందని చెప్పగా తనకు సీడీ ఇస్తే పరిశీలించి సమాధానం చెప్తానని చెవిరెడ్డి స్పష్టం చేశారు. దీంతో కమిటీ సీడీని ప్రదర్శించింది. అందులో చెవిరెడ్డి అనని మాటలు కూడా కొన్ని ఉన్నట్లు కమిటీ నివేదికలో పేర్కొన్నారు. ఈ విషయమై ఆయన గట్టిగా ప్రశ్నించటంతో కమిటీ కూడా అది నిజమేనని అంగీకరించింది. దీంతో ఇలాంటి నిరాధారమైన నివేదికకు తాను సమాధానం ఎందుకు ఇవ్వాలని చెవిరెడ్డి ప్రశ్నించారు.
చింతిస్తున్నాను: జ్యోతుల నెహ్రూ
తనపై ఈ రకమైన అభియోగం వచ్చినందుకు చింతిస్తున్నానని తాను కమిటీకి ఇచ్చిన వివరణలో పేర్కొన్నట్లు కమిటీ సభ్యుడు కూడా అయిన నెహ్రూ చెప్పారు.
అప్పుడే క్షమాపణ చెప్పా: కొడాలి నాని
తన వ్యాఖ్యల వల్ల బాధపడి ఉంటే క్షమాపణ చెప్తున్నానని గతంలోనే చెప్పానని, ఇప్పుడు ప్రివిలేజ్ కమిటీ ముందు కూడా అదే విషయం చెప్పానని నాని చెప్పారు.
మీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
తాను శాసనసభలో ఉపయోగించిన భాషలో అన్ పార్లమెంటరీ పదాలు ఉన్నట్లు భావిస్తే ప్రివిలేజ్ కమిటీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పినట్లు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చెప్పారు.
కఠినంగా శిక్షించమని కోరా: అనిత
తనపై వ్యాఖ్యలు చేసిన ఆర్‌కే రోజాను కఠినంగా శిక్షించాలని ప్రివిలేజ్ కమిటీని కోరినట్లు అనిత చెప్పారు.
రోజాపై ఏడాదిపాటు వేటుకు సిఫారసు?
Published Sun, Mar 20 2016 2:26 AM | Last Updated on Mon, Oct 29 2018 8:08 PM
Advertisement
Advertisement