లోగుట్టు పెరుమాళ్లకు ఎరుక అంటే ఇదేనేమో...!
ఏపీలో కుంభకోణాలు, పలువురు మంత్రుల అక్రమ లావాదేవీలు ఒక రేంజ్‌లో జరుగుతున్నాయని టీడీపీ నాయకులే చెవులు కొరుక్కుంటున్నారట. ఒక మంత్రిని మించి మరో మంత్రి నడుపుతున్న మంత్రాంగంపై కథలు కథలుగా చెప్పుకుంటున్నారట. కాదేది అవినీతికి అనర్హం అన్నట్లుగా అక్కడి మంత్రుల పరిస్థితి ఉందని చెవులు కొరుక్కుంటున్నారట. ఏపీ రాజధాని చుట్టూ పెద్ద ఎత్తున అస్మదీయులు భూములను కొనుగోలుచేసిన విషయం బయటపడి నానా రచ్చ అయినా, కుంభకోణాలకు వెనక్కుతగ్గే పరిస్థితి లేదంటున్నారు.
నిర్మాణరంగ కార్మికులకు సంబంధించిన పథకంలో, గ్రామీణ ఉపాధిహామీ, చివరకు ప్రకటనలు, హోర్డింగ్‌ల ఏర్పాటులోనూ అవినీతి కోడై కూస్తున్నదని వాపోతున్నారట. ఒక మంత్రి హోర్డింగ్‌లు, ప్రకటనల రూపంలో తనకు డబ్బులు ఇవ్వాలంటూ సంబంధిత కార్పొరేషన్‌పై ఒత్తిడి తెస్తున్నారట. హోర్డింగ్‌లు పెట్టకపోయినా పెట్టినట్లుగా బిల్లులు ఇవ్వాల్సిందిగా ఒకటే పోరుతున్నారట. మరో మంత్రి గ్రామీణ ఉపాధి హామీ కింద కూలీలకు కూలీ ఇవ్వకుండా జిల్లాకు రూ.రెండు లక్షల చొప్పున గడ్డపారలు కొన్నట్లుగా లెక్కలు చూపే ప్రయత్నం చేస్తున్నారట.
ఇంకో మంత్రి నిర్మాణ రంగ కార్మికులకు సంబంధించిన పథకాన్ని మాయచేసే ప్రయత్నాలు చేస్తున్నారని అధికారపార్టీ వారే గుసగుసలు పోతున్నారు. ఇంతా చేసి ఈ కుంభకోణాలన్నింటికి కూడా బయటపెడుతున్నది, అంతర్గత సమాచారాన్ని వెల్లడి చేస్తున్నది మాత్రం లోగుట్టు తెలిసిన టీడీపీ నాయకులతో పాటు ఇతరపార్టీల నుంచి టీడీపీలో చేరినవారేనట. లోగుట్టు పెరుమాళ్లకు ఎరక అంటే ఇదేనేమో.. మరి...!