కాంగ్రెస్, టీడీపీ కుంభకోణాలను బయటపెడ్తాం
- తెలంగాణ పునర్నిర్మాణానికి కేసీఆర్ కృషి
- హోంమంత్రి నాయిని
- టీఆర్‌ఎస్‌లో చేరిన విజయారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రజల ఆస్తులను దోచుకున్న కాంగ్రెస్, టీడీపీ వారి కుంభకోణాలను బయటపెడ్తామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి హెచ్చరించారు. సీఎల్పీ మాజీ నేత పీజేఆర్ కుమార్తె, వైఎస్సార్ సీపీ నేత పి.విజయా రెడ్డి బుధవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీ సెక్రటరీ జనరల్, ఎంపీ కె.కేశవరావు, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఎంపీలు కె.కవిత, కె.విశ్వేశ్వర్ రెడ్డి సమక్షంలో ఆమె పార్టీ కండువా కప్పుకొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి నాయిని మాట్లాడుతూ తెలంగాణ పునర్నిర్మాణం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాత్మకంగా పనిచేస్తున్నారన్నారు. వీటి ఫలాలు అందడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు. రెండు నెలల్లోనే ఏమీ అభివృద్ధి చేయలేదని మాట్లాడటం మంచిది కాదన్నారు. తెలంగాణ ప్రభుత్వం కేవలం రెండు నెలల పసిపాప అని, ఆ శిశువు డ్యాన్స్ చేస్తుందా? అని ప్రశ్నించారు. ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ పార్టీలను పక్కనబెట్టి తెలంగాణ వాదులంతా ఏకం అవుతున్నారని చెప్పారు.
టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం జెండాలన్నీ పక్కనబెట్టి నేతలంతా ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ ఎంపీ కవిత మాట్లాడుతూ తెలంగాణకు అండగా నిలిచినందుకు పీజేఆర్ రాజకీయంగా నష్టపోయినా రాజీపడకుండా పోరాటం చేశారని కొనియాడారు. పీజేఆర్ స్ఫూర్తితో తెలంగాణ కోసం పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ రాములు నాయక్ అధ్యక్షత వహించారు.
భారీ ర్యాలీ
బంజారాహిల్స్: విజయారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరే ముందు ఖైరతాబాద్‌లోని మహంకాళి దేవాలయం లో పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి ర్యాలీగా తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. విజయారెడ్డికి మద్దతుగా ఆమె అనుచరులు ఖైరతాబాద్ నియోజక వర్గం నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బంజారాహిల్స్‌లోని నందినగర్ నుంచి తేజావత్ రామకృష్ణ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. జహీరానగర్ చౌరస్తాలో టీఆర్‌ఎస్ నాయకులు సి.రాంచందర్, పి.సారంగపాణి ఆధ్వర్యంలో భారీ స్వాగత వేదిక ఏర్పాటు చేశారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలు, పీజేఆర్ అభిమానులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.