పటాన్‌చెరు సభలో ప్రసంగిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: వచ్చే ఎన్నికల్లో గులాబీ గడీలను బద్దలు కొడతామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభంజనంలో కాంగ్రెస్ కంచుకోటలు, కమ్యూనిస్టుల ఎర్రకోటలు కూడా కొట్టుకుపోతాయని పేర్కొన్నారు. బీజేపీ జన చైతన్య బస్సు యాత్రలో భాగంగా సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో గురువారం రాత్రి జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నందీశ్వర్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో లక్ష్మణ్ టీఆర్‌ఎస్ ప్రభుత్వ పనితీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
ఒక వ్యక్తి కోసమో, సంస్థ కోసమో బీజేపీ తెలంగాణలో జన చైతన్య బస్సు యాత్ర చేపట్టలేదన్నారు. రాష్ట్రంలో పాలన మార్పు కోసం, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం ఈ యాత్ర జరుగుతోందని అన్నారు. తమ బస్సు యాత్రతో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల నుదుటి రాతను మార్చడమే బస్సు యాత్ర ముఖ్య ఉద్దేశమన్నారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ 3డీ (డెవలప్‌మెంట్, డైనమిజం, డెసిషన్ మేకింగ్) విధానంలో పని చేస్తున్నారన్నారు.
కానీ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం 3సీ (కరప్షన్, కాంట్రాక్టులు, కలెక్షన్లు) లక్ష్యంగా పని చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల అమలు కోసం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఆరోపించారు. విద్యార్థుల త్యాగాల పునాదుల మీద ఏర్పాటైన తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులు, దళిత, గిరిజనుల హక్కులను కాలరాస్తోందని దుయ్యబట్టారు. రైతుబంధు పథకాన్ని ప్రభుత్వం సర్వరోగ నివారిణిగా ప్రచారం చేస్తోందన్నారు.
ప్రజాస్వామ్యం మీద కాంగ్రెస్‌కు నమ్మకం లేదు..
70 ఏళ్ల స్వతంత్ర భారతంలో కాంగ్రెస్‌లోని ఒక కుటుంబమే ఎక్కువ కాలం పరిపాలించిందని, ప్రజాస్వామ్యం మీద కాంగ్రెస్‌కు నమ్మకం లేదని లక్ష్మణ్ దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ను చచ్చిన పాముగా అభివర్ణించిన ఆయన, పదవుల కోసమే వారు ఢిల్లీయాత్రలు చేస్తున్నా రన్నారు. బీజేపీకి బస్సు యాత్రలు చేయడం కొత్త కాదని, కాంగ్రెస్ చేపట్టిన బస్సు యాత్ర తుస్సుమందని ఎద్దేవా చేశారు. విద్యార్థుల త్యాగాల పునాదుల మీద ఏర్పాటైన తెలంగాణ ఎవరి పాలైందో ప్రజలు ఆలోచించాలన్నారు. ఉద్యమంలో చెప్పిన మాటలను టీఆర్‌ఎస్ అటకెక్కించిందని, నిరుద్యోగ సమస్యను తుంగలో తొక్కిందని మండిపడ్డారు. ఇప్పటివరకు కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్‌లకు అధికారం ఇచ్చినా.. మూస పద్ధతిలో వారసత్వ, అవినీతి, కుంభకోణాలతో కూడిన రాజకీయాలను అం దించారని ఆరోపించారు.
దళితులకు మూడెకరాల భూమి, కౌలు, పోడు వ్యవసాయం చేస్తు న్న గిరిజనులకు రైతుబంధు పథకం వర్తింప చేయకపోవడాన్ని లక్ష్మణ్ ప్రశ్నించారు. కాం గ్రెస్, టీఆర్‌ఎస్ సహా అన్ని పార్టీలు మజ్లిస్‌కు వత్తాసు పలుకుతూ మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నాయన్నారు. కోర్టు తీర్పునకు లోబడి అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామన్నారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, బీజేపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలం పంచపాండవుల తరహాలో పోరాడి పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తెస్తా మని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దమ్ముంటే ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని సవాల్ చేశారు. సభలో పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి చింత సాంబమూర్తి, రాష్ట్ర కార్యదర్శి ఎస్.కుమార్, నేతలు కాసాల బుచ్చిరెడ్డి, ఆకుల రాజయ్య, నర్సింగరావు, సతీశ్ గౌడ్, రవీందర్, అభిషేక్ గౌడ్ పాల్గొన్నారు
దళిత ఐఏఎస్‌లపై ప్రభుత్వం వివక్ష
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: దళితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అన్ని స్థాయిల్లో వివక్ష చూపుతోం దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆరో పిం చారు. ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్‌లకు సరైన పోస్టింగ్‌లు ఇవ్వకుండా వారిని అవమానిస్తోందని మండిపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు రోజుల పాటు సాగిన బీజేపీ జన చైతన్యయాత్ర గురువా రం ముగిసింది. అంతకుముందు ఆయన మహబూబ్‌నగర్ ఆర్ అండ్ బీ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ల్యాండ్, ఇసుక, మద్యం మాఫియా రెచ్చిపోతోందని లక్ష్మణ్ విమర్శించారు. ఇసుక మాఫియా ఆగడాలు శృతిమించి నేరెళ్ల వంటి ప్రాంతాల్లో దళితులను చిత్రహింసలకు గురిచేశారన్నారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పడంతో పాటు ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి వంటి హామీలను విస్మరించారని ధ్వజమెత్తారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం ఇష్టంలేకే సీఎం కేసీఆర్ చట్టంలో లొసుగులు పెట్టారని లక్ష్మణ్ ఆరోపించారు.
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని వెల్లడించారు. ముందస్తు ఎన్నికలకు సంబంధించి కేంద్రం నుంచి తమకు ఎలాంటి సంకేతాలు రాలేదని లక్ష్మణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది 1.6 లక్షల డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన సీఎం కేసీఆర్ మాటలు ఏమయ్యాయని లక్ష్మణ్ ప్రశ్నించారు. తన నియోజకవర్గంలోని ఎర్రవల్లిలో నిర్మించిన ఇళ్లను చూపిస్తూ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. కేంద్రం ఇప్పటి వరకు రాష్ట్రానికి 7.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి సాయం అందించిందని వివరించారు. పట్టణాల్లో రాయితీ కింద ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ముందుకొస్తే రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే 3 లక్షల దరఖాస్తులను బుట్టదాఖలు చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో భావప్రకటనాస్వేచ్ఛను ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని, ప్రజాసమస్యలపై పోరాడే ప్రజాసంఘాల గొంతునొక్కుతోందన్నారు. కుటుంబ పాలనకు స్వస్తి పలికే దిశలో ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికే బీజేపీ జన చైతన్యయాత్ర చేపట్టినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment