Illegal transactions
-
తస్మాత్ జాగ్రత్త!
ముంబై: అక్రమ లావాదేవీలపై బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ)సహా తన నియంత్రణలో ఉన్న అన్ని సంస్థలూ ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్దేశించింది. ఈ సమస్య అరికట్టడానికి సంబంధిత అంతర్గత, బాహ్య వనరుల నుండి పొందిన సమాచారాన్ని వినియోగించుకోవాలని సూచించింది. ఈ మేరకు సెంట్రల్ బ్యాంక్ ‘మనీ లాండరింగ్/టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ ఇంటర్నల్ రిస్క్ అసెస్మెంట్ గైడెన్స్’ను జారీ చేసింది. అక్రమ ధనార్జన, తీవ్రవాదులకు ఫైనాన్షింగ్ వంటి అంశాలు వ్యవస్థలపై త్రీవ ప్రభావం చూపుతాయని, బ్యాంక్ సాధరణ ఖాతాదారులకు, దేశాలకు, భౌగోళిక ప్రాంతాలకు, ఉత్పత్తులకు, సేవలకు, లావాదేవీలకు అలాగే డెలివరీ చానెళ్ల ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగజేస్తాయని వివరించింది. ఈ నేపథ్యంలో ఈ సమస్యకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కొనడానికి నిరంతర నిఘా, కాలానుగుణమైన పర్యవేక్షణ అవసరమని సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది. ఎప్పటికప్పుడు మారుతున్న వ్యాపార పరిస్థితులు, బ్యాంకులు– తదితర నియంత్రిత సంస్థలు అందించే బ్యాంకింగ్, ఇతర ఆరి్థక ఉత్పత్తులలో పెరుగుతున్న సంక్లిష్టత స్థాయిలు, పోటీ పరిస్థితుల నేపథ్యంలో మనీలాండరింగ్, ఉగ్రవాద ఫైనాన్సింగ్ వంటి సవాళ్లు పెరిగే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. అత్యాధునిక సాంకేతికత వినియోగం, చెల్లింపుల విధానాల్లో కొత్త పద్ధతులు వంటి అంశాలు సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నాయని పేర్కొంది. -
బ్యాంకు ఖాతాల్లో ‘హవాలా’ లావాదేవీలు
పళ్లిపట్టు(తవిుళనాడు): యువకుల బ్యాంకు ఖాతాల్లో అక్రమ లావాదేవీలకు సంబంధించి నలుగురు యువకులను ఈడీ అధికారులు అరెస్టు చేసి బెంగళూరుకు తరలించి దర్యాప్తు ముమ్మరం చేసిన ఘటన తమిళనాడులోని పళ్లిపట్టులో చోటు చేసుకుంది. తిరువళ్లూరు జిల్లాలోని పళ్లిపట్టు సమీపం కుమారాజుపేట దళితవాడకు చెందిన తమిళరసన్ (25), మెట్టూరుకు చెందిన అరవిందన్ (24), ప్రకాష్ (25)ల బ్యాంకు ఖాతాల్లో రూ.3కోట్లు అక్రమంగా జమ చేసినట్లు, గుర్తించి వారి అకౌంట్లు సీజ్ చేసిన బ్యాంకు అధికారులు ఈడీకి సమాచారం ఇచ్చారు. ముంబై. చెన్నై, బెంగళూరు, పాండిచ్చేరికి చెందిన ఈడీ అధికారుల బృందం 20 మంది గురువారం కుమారాజుపేట, మోట్టూరులో గురువారం ఉదయం నుంచి శుక్రవారం వేకువజాము వరకు దాడులు నిర్వహించి వారిని విచారించారు.తమిళరసన్ తమ్ముడు అజిత్‌కు సైతం సంబంధం ఉందని నిర్ధారించి నలుగురిని అరెస్ట్ చేసి బెంగళూరుకు తరలించారు. యువకుల ఖాతాల ద్వారా రూ.8 కోట్ల వరకు హవాలా డబ్బులు చేతులు మారినట్లు అనుమానిస్తున్నారు. ప్రధాన సూత్రధారులెవరూ అన్న కోణంలో ఈడీ విచారణ జరుపుతుంది. -
ఐదేళ్లలో 374 మందిని అరెస్టు చేసిన ఈడీ
న్యూఢిల్లీ: దేశంలో అక్రమ నగదు లావాదేవీలు, మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గత ఐదేళ్లలో 374 మందిని అరెస్టు చేసింది. వీరిలో పలు కార్పొరేట్ సంస్థల డైరెక్టర్లున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్‌సభకు ఈ మేరకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. ‘‘కార్పొరేట్ మోసాలకు సంబంధించి స్టెర్లింగ్ బయోటెక్ గ్రూప్, విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ తదితరులపై ఈడీ కేసులు పెట్టింది. రూ.33,862.20 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. వీటిలో రూ.15,113 కోట్ల ఆస్తులను ప్రభుత్వ బ్యాంకులు అధీనంలోకి తీసుకున్నాయి. ఈడీ అప్పగించిన ఆస్తులను ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం విక్రయించి రూ.7,975.27 కోట్లు ఆర్జించింది’’ అని మంత్రి వివరించారు. -
లేటెస్ట్ టెక్నాలజీతో సెబీ రెడీ
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అత్యంత ఆధునిక టెక్నాలజీని, సంబంధిత టూల్స్‌ను సమకూర్చుకుంటోంది. వీటి సహాయంతో ఇన్సైడర్ ట్రేడింగ్, అక్రమ లావాదేవీల కేసులపై కొరడా ఝళిపించనుంది. తద్వారా నకిలీ ఖాతాల వినియోగంతో అక్రమాలకు పాల్పడిన కేసులను అత్యంత భారీ స్థాయిలో వెలికితీయనుంది. వెరసి క్యాపిటల్ మార్కెట్లు, కార్పొరేట్ ప్రపంచంలో పేరున్న ఇలాంటి కొంతమంది ప్రధాన అక్రమార్కులపై కేసులు నమోదు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కోవిడ్–19వల్ల తలెత్తిన పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే ఈ తరహా కేసులపై ఇటీవల సెబీ పలు ఆదేశాలు జారీ చేసింది. ఈ బాటలో ఇకపై ఇలాంటి కేసులను మరిన్నింటిని గుర్తించనున్నట్లు తెలుస్తోంది. ఆధునిక టెక్నాలజీతో పర్యవేక్షణ వ్యవస్థల సామర్థ్యం 100 రెట్లు బలపడిన కారణంగా సెబీ మరింతలోతైన అధ్యయానికి తెరతీస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఆల్గోరిథమ్స్, బిగ్ డేటా, కృత్రిమ మేథ తదితర టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు వివరించాయి. -
100 కోట్ల అవకతవకలు
న్యూఢిల్లీ: రూ.100 కోట్ల మేర అక్రమ లావాదేవీలు జరపటంతోపాటు సివిల్ ఏవియేషన్ బ్యూరో సెక్యూరిటీ (బీసీఏఎస్)పాస్‌లు పొంది దేశ భద్రతకు ముప్పు కలిగేలా వ్యవహరించిన సీనియర్ జర్నలిస్టు ఉపేంద్రరాయ్తోపాటు మరికొందరిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఇందుకు సంబంధించి లక్నో, నోయిడా, ఢిల్లీ, ముంబైల్లో గురువారం సోదాలు జరిపింది. ‘ఢిల్లీకి చెందిన ఉపేంద్ర రాయ్ అనే సీనియర్ జర్నలిస్ట్, ఎయిర్ వన్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ భద్రతా అధికారి ప్రసూన్ రాయ్ మరికొందరితో కలిసి బీసీఏఎస్‌ను, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ను మోసం చేశారు. తప్పుడు పత్రాలతో ఏరోడ్రోమ్ ఎంట్రీ పాస్‌లు పొంది దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో అత్యంత భద్రత ఉండే, నిషిద్ధ ప్రాంతాల్లో ప్రవేశానికి అనుమతి పొందారు. దేశ భద్రతకు ముప్పు కలిగించేలా వ్యవహరించారు. అక్రమ డబ్బు పెట్టుబడులకు రాహుల్ శర్మ, సంజయ్ స్నేహి సహకరించారు. 2017లో ఉపేంద్ర ఖాతాలో ఒక్కసారిగా రూ.79 కోట్లు జమయ్యాయి. ఐటీ శాఖలో సెటిల్మెంట్లకుగాను పలు నకిలీ కంపెనీల నుంచి రూ.16 కోట్లు వచ్చాయి’ అని సీబీఐ పేర్కొంది. -
లోగుట్టు పెరుమాళ్లకు ఎరుక అంటే ఇదేనేమో...!
ఏపీలో కుంభకోణాలు, పలువురు మంత్రుల అక్రమ లావాదేవీలు ఒక రేంజ్లో జరుగుతున్నాయని టీడీపీ నాయకులే చెవులు కొరుక్కుంటున్నారట. ఒక మంత్రిని మించి మరో మంత్రి నడుపుతున్న మంత్రాంగంపై కథలు కథలుగా చెప్పుకుంటున్నారట. కాదేది అవినీతికి అనర్హం అన్నట్లుగా అక్కడి మంత్రుల పరిస్థితి ఉందని చెవులు కొరుక్కుంటున్నారట. ఏపీ రాజధాని చుట్టూ పెద్ద ఎత్తున అస్మదీయులు భూములను కొనుగోలుచేసిన విషయం బయటపడి నానా రచ్చ అయినా, కుంభకోణాలకు వెనక్కుతగ్గే పరిస్థితి లేదంటున్నారు. నిర్మాణరంగ కార్మికులకు సంబంధించిన పథకంలో, గ్రామీణ ఉపాధిహామీ, చివరకు ప్రకటనలు, హోర్డింగ్‌ల ఏర్పాటులోనూ అవినీతి కోడై కూస్తున్నదని వాపోతున్నారట. ఒక మంత్రి హోర్డింగ్‌లు, ప్రకటనల రూపంలో తనకు డబ్బులు ఇవ్వాలంటూ సంబంధిత కార్పొరేషన్‌పై ఒత్తిడి తెస్తున్నారట. హోర్డింగ్‌లు పెట్టకపోయినా పెట్టినట్లుగా బిల్లులు ఇవ్వాల్సిందిగా ఒకటే పోరుతున్నారట. మరో మంత్రి గ్రామీణ ఉపాధి హామీ కింద కూలీలకు కూలీ ఇవ్వకుండా జిల్లాకు రూ.రెండు లక్షల చొప్పున గడ్డపారలు కొన్నట్లుగా లెక్కలు చూపే ప్రయత్నం చేస్తున్నారట. ఇంకో మంత్రి నిర్మాణ రంగ కార్మికులకు సంబంధించిన పథకాన్ని మాయచేసే ప్రయత్నాలు చేస్తున్నారని అధికారపార్టీ వారే గుసగుసలు పోతున్నారు. ఇంతా చేసి ఈ కుంభకోణాలన్నింటికి కూడా బయటపెడుతున్నది, అంతర్గత సమాచారాన్ని వెల్లడి చేస్తున్నది మాత్రం లోగుట్టు తెలిసిన టీడీపీ నాయకులతో పాటు ఇతరపార్టీల నుంచి టీడీపీలో చేరినవారేనట. లోగుట్టు పెరుమాళ్లకు ఎరక అంటే ఇదేనేమో.. మరి...! -
నల్లధనంతో లింకున్న కంపెనీలపై సెబీ నిషేధం!
న్యూఢిల్లీ: నల్లధనం తరలింపు, పన్ను ఎగవేతలకు అడ్డాగా మారుతున్న లిస్టెడ్ కంపెనీలపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి మూడు కొలమానాలను సెబీ గుర్తించింది. ఒకటికంటే ఎక్కువ అంశాల్లో సంబంధిత లిస్టెడ్ కంపెనీకి ప్రమేయం ఉన్నట్లు తేలితే స్టాక్ మార్కెట్లో ఆయా షేర్ల ట్రేడింగ్ నిలిపివేయాలని(సస్పెన్షన్) సెబీ భావిస్తోంది. కంపెనీలు ఎక్స్ఛేంజీలకు తెలిపిన అడ్రస్‌లలో ఎలాంటి కార్యాలయాలు, కార్యకలాపాలు లేనప్పటికీ(షెల్ కంపెనీలు).. వాటి షేర్ల ట్రేడింగ్ మాత్రం చురుగ్గా జరుతుతున్నాయి. మరోపక్క, నల్లధనం తరలింపునకు ప్రిఫరెన్షియల్ షేర్ల కేటాయింపును కూడా కొన్ని కంపెనీలు చేపడుతున్నాయి. అదేవిధంగా కంపెనీ ఆర్థిక మూలాలు ఘోరంగా ఉన్నప్పటికీ.. షేరు ధరలు మాత్రం దూసుకెళ్తుండటం ఈ అక్రమాల్లో భాగమేనన్నది సెబీ అభిప్రాయం. అనుమానిత కంపెనీలకు సంబంధించి ఈ మూడు అంశాల్లో ఒకటికంటే ఎక్కువ ఉన్నట్లు భావిస్తే.. వాటిపై ట్రేడింగ్ సస్పెన్షన్ కొరడా ఝలిపించాలని నిర్ణయించినట్లు సెబీ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇలాంటి కేసుల్లో అనేక చిన్న ఎన్బీఎఫ్సీలు, బ్రోకర్లపై ఇప్పటికే సెబీ కన్నేసిందని కూడా విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో కొన్ని లిస్టెడ్ కంపెనీల ప్రమోటర్లూ ఉన్నట్లు తెలిపాయి. స్టాక్ మార్కెట్ల ద్వారా నల్లధనం చేతులుమారింది.. పన్నుల ఎగవేతల మొత్తం విలువను కచ్చితంగా లెక్కగట్టడం కష్టసాధ్యమేనని, అయితే, ఈ అక్రమ లావాదేవీల కొన్ని వేల కోట్ల రూపాయల్లో ఉండొచ్చనేది సెబీ వర్గాల అంచనా.