నల్లధనంతో లింకున్న కంపెనీలపై సెబీ నిషేధం!
న్యూఢిల్లీ: నల్లధనం తరలింపు, పన్ను ఎగవేతలకు అడ్డాగా మారుతున్న లిస్టెడ్ కంపెనీలపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి మూడు కొలమానాలను సెబీ గుర్తించింది. ఒకటికంటే ఎక్కువ అంశాల్లో సంబంధిత లిస్టెడ్ కంపెనీకి ప్రమేయం ఉన్నట్లు తేలితే స్టాక్ మార్కెట్లో ఆయా షేర్ల ట్రేడింగ్ నిలిపివేయాలని(సస్పెన్షన్) సెబీ భావిస్తోంది. కంపెనీలు ఎక్స్ఛేంజీలకు తెలిపిన అడ్రస్‌లలో ఎలాంటి కార్యాలయాలు, కార్యకలాపాలు లేనప్పటికీ(షెల్ కంపెనీలు).. వాటి షేర్ల ట్రేడింగ్ మాత్రం చురుగ్గా జరుతుతున్నాయి.
మరోపక్క, నల్లధనం తరలింపునకు ప్రిఫరెన్షియల్ షేర్ల కేటాయింపును కూడా కొన్ని కంపెనీలు చేపడుతున్నాయి. అదేవిధంగా కంపెనీ ఆర్థిక మూలాలు ఘోరంగా ఉన్నప్పటికీ.. షేరు ధరలు మాత్రం దూసుకెళ్తుండటం ఈ అక్రమాల్లో భాగమేనన్నది సెబీ అభిప్రాయం. అనుమానిత కంపెనీలకు సంబంధించి ఈ మూడు అంశాల్లో ఒకటికంటే ఎక్కువ ఉన్నట్లు భావిస్తే.. వాటిపై ట్రేడింగ్ సస్పెన్షన్ కొరడా ఝలిపించాలని నిర్ణయించినట్లు సెబీ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు.
ఇలాంటి కేసుల్లో అనేక చిన్న ఎన్‌బీఎఫ్‌సీలు, బ్రోకర్లపై ఇప్పటికే సెబీ కన్నేసిందని కూడా విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో కొన్ని లిస్టెడ్ కంపెనీల ప్రమోటర్లూ ఉన్నట్లు తెలిపాయి. స్టాక్ మార్కెట్ల ద్వారా నల్లధనం చేతులుమారింది.. పన్నుల ఎగవేతల మొత్తం విలువను కచ్చితంగా లెక్కగట్టడం కష్టసాధ్యమేనని, అయితే, ఈ అక్రమ లావాదేవీల కొన్ని వేల కోట్ల రూపాయల్లో ఉండొచ్చనేది సెబీ వర్గాల అంచనా.