
శ్రీరామిరెడ్డికి ఫస్ట్ ర్యాంకు
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పీజీమెట్ ఫలితాలను ఆదివారం విడుదల చేసింది.
విజయవాడ, న్యూస్‌లైన్: ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పీజీమెట్ ఫలితాలను ఆదివారం విడుదల చేసింది. మెడికల్ పోస్టు గ్రాడ్యుయేషన్, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం గత నెల 27న నిర్వహించిన ఈ పరీక్షకు 13,413 మంది హాజరు కాగా, 8,107 మంది అర్హత సాధించినట్లు వర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ టి.రవిరాజు తెలిపారు. గాంధీ వైద్య కళాశాల విద్యార్థి బి.శ్రీరామిరెడ్డి 170 మార్కులతో మొదటి ర్యాంకు సాధించగా, ఉస్మానియా వైద్య కళాశాల విద్యార్థి ఆరుమళ్ల కిరీట్ 169 మార్కులతో రెండవ ర్యాంక్ సొంతం చేసుకున్నారు. ఆంధ్రా మెడికల్ కళాశాల విద్యార్థి పి.గురుప్రసాద్ 168 మార్కులతో 3వ ర్యాంకు, కాకతీయ మెడికల్ కళాశాల విద్యార్థి ఓరుగంటి రఘుపతి 166 మార్కులతో 4వ ర్యాంకు, కర్నూలు మెడికల్ కళాశాల విద్యార్థిని బి.దివ్య 165 మార్కులతో 5వ ర్యాంకు సాధించారు. ఈ ఫలితాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
కాగా, కౌన్సెలింగ్ తేదీని వారం రోజుల్లో ప్రకటిస్తామని రవిరాజు తెలిపారు. ఇంకా రాష్ట్రంలోని కొన్ని కళాశాలల్లో పీజీ సీట్లకు సంబంధించి ఎంసీఐ నుంచి ఎన్‌వోసీలు రావాల్సి ఉందని, ఈ నేపథ్యంలో ఎన్ని సీట్లు భర్తీ చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. జూలై 10వ తేదీ నాటికి తరగతులు ప్రారంభించాల్సి ఉన్నందున ఆలోపే కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. తొలుత నిర్వహించిన పీజీమెట్‌లో ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని తేలడంతో దాన్ని రద్దు చేసి, గత నెల 27న తిరిగి పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే.