ఆ విద్యార్థులకు దిక్కేదీ?
♦ మల్లారెడ్డి వైద్య కాలేజీ సీట్లపై గందరగోళం
♦ ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ అనుమతి లేకుండానే ప్రవేశాలు
♦ నోటిఫికేషన్ జారీ చేయకుండానే ‘బీ’, ఎన్నారై కేటగిరీల్లోని సీట్ల భర్తీ
♦ సుప్రీంకోర్టు స్టేతో విద్యార్థుల భవిష్యత్ గందరగోళం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల జీవితాలతో ఆటాలాడుకుంటున్నాయి. డబ్బే పరమావధిగా నిబంధనలను తుంగలో తొక్కి అక్రమాలకు పాల్పడుతున్నాయి. ఈ ఏడాది ప్రైవేటు మెడికల్ సీట్ల భర్తీ మొత్తం వివాదాల మధ్యే సాగింది. తాజాగా హైదరాబాద్‌లోని మల్లారెడ్డి మెడికల్ కాలేజీ మరో అడుగు ముందుకేసింది. ఈ ఏడాది ఆ కాలేజీలోని 150 సీట్ల భర్తీని భారత వైద్య మండలి (ఎంసీఐ) నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆ కాలేజీ యాజమాన్యం ఢిల్లీ హైకోర్టుకు వెళ్లి భర్తీకి అనుమతి తెచ్చుకుంది. ఆ తర్వాత కూడా నిబంధనల ప్రకారం నడుచుకోలేదు. ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ అనుమతి తీసుకోకుండానే, కన్వీనర్ కోటాలోని ‘ఏ’ కేటగిరీ సీట్లను భర్తీ చేయకుండానే.. ‘బీ’ కేటగిరీ, ఎన్నారై కోటా సీట్లు భర్తీ చేసుకుంది. దీనిపై ఎంసీఐ సుప్రీం కోర్టుకు వెళ్లగా.. ఢిల్లీ హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే ఇచ్చింది. దీంతో ఆ సీట్లలో చేరిన విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
నోటిఫికేషన్ లేకుండానే!
గత నెల 30న మల్లారెడ్డి మెడికల్ కాలేజీకి సీట్ల భర్తీ కోసం ఢిల్లీ హైకోర్టు అనుమతినిచ్చింది. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ సీట్లలో ప్రవేశాలకు అదే తేదీన గడువు ముగియడంతో సీట్ల భర్తీపై సాంకేతిక సమస్య ఎదురైంది. కానీ మల్లారెడ్డి కాలేజీ యాజమాన్యం ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు చేయలేదు. తీర్పు వచ్చిన మరుసటి రోజు ‘ఏ’ కేటగిరీ సీట్లను భర్తీ చేయాలని.. ‘బీ’, ఎన్నారై కోటా సీట్లను భర్తీ చేసుకునేందుకు అనుమతివ్వాలని ఎన్టీఆర్ వర్సిటీకి లేఖ రాసింది. గడువు ముగిసినందున వీలుపడదని వర్సిటీ అధికారులు స్పష్టం చేశారు.
దీన్ని లెక్కచేయని యాజమాన్యం.. ప్రభుత్వం భర్తీ చేయాల్సిన ‘ఏ’ కేటగిరీ సీట్లను వదిలేసి, ‘బీ’, ఎన్నారై కోటాల్లో 75 సీట్లను సొంతంగా భర్తీ చేసేసుకుంది. అసలు ‘బీ’ కేటగిరీ సీట్లను భర్తీ చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వం, ఎన్టీఆర్ వర్సిటీ, ప్రైవేటు యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలోని ఎంసెట్ కన్వీనర్‌ల అనుమతి కావాలి. ఆ తర్వాత నోటిఫికేషన్ ఇచ్చాకే భర్తీ చేయాలి. అవేమీ చేయకుండానే ‘బీ’ కేటగిరీ సీట్లను ఎన్నారై కోటాలోకి మార్చుకొని ఇష్టారాజ్యంగా భర్తీ చేసుకున్నారని ఎన్టీఆర్ వర్సిటీ వర్గాలు చెప్పాయి.
ఈ జాబితాకు తాము ఆమోదం తెలపలేదని వర్సిటీ వీసీ రవిరాజు వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ తతంగంపై ఎంసీఐ సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో స్టే విధించింది. దీంతో తాము కట్టిన ఫీజు వెనక్కి ఇచ్చేయాలని కాలేజీ యాజమాన్యాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ఏమాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తుండడం గమనార్హం.