ఆన్‌లైన్‌లో పీజీ మెడికల్ మూల్యాంకనం!
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): పీజీ మెడికల్ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ఆన్‌లైన్ విధానంలో చేపట్టేందుకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వర్సిటీలో సోమవారం నిర్వహించనున్న పాలకమండలి 221వ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అవకతవకలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు వస్తుండటంతో ఆన్‌లైన్ మూల్యాంకనం చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు.
ఈవిధానంలో జవాబు పత్రాలను బార్‌కోడ్ చేసి భద్రపరిచి.. వాటిని ప్రొఫెసర్‌కు పంపించి ఆన్‌లైన్‌లోనే మూల్యాంకనం చేయించనున్నారు. దీనికి సంబంధించిన పాస్‌వర్డ్ ‘కీ’ని ప్రొఫెసర్‌కు ఇస్తారు. ఆన్‌లైన్ మూల్యాంకనం వల్ల ఫలితాలు త్వరగా విడుదల చే యొచ్చని చెబుతున్నారు. అలాగే ప్రతి సబ్జెక్టులో జవాబు పత్రాన్ని వేర్వేరు ప్రొఫెసర్లతో రెండు సార్లు మూల్యాంకనం చేయిస్తారు. ఇద్దరి మూల్యాంకనంలో తేడా 15 శాతం కంటే ఎక్కువ ఉంటే మూడోసారి వేరే ప్రొఫెసర్‌తో చేయిస్తారు. ఈ విధానంతో సత్ఫలితాలు వస్తే ఎంబీబీఎస్, బీడీఎస్‌కు కూడా ఆన్‌లైన్ మూల్యాంకనం చేయించాలనే యోచనలో అధికారులున్నారు.