విజయవాడ: ఈ ఏడాది సూపర్ స్పెషాలిటీ(డీఎం/ఎంసీహెచ్) మెడికల్ కోర్సుల్లో చేరేందుకు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో మంగళవారం నిర్వహించిన కౌన్సెలింగ్ దాదాపు 11 గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో అభ్యర్థులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కలిపి అందుబాటులో ఉన్న మొత్తం 121 సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో 10వ షెడ్యూల్ ప్రకారం ఈ కౌన్సెలింగ్ విధానం యధావిథిగా కొనసాగించడంతో పాటు జూన్ 2 తర్వాత ఎంసీఐ అనుమతి పొంది అందుబాటులోకి వచ్చిన సీట్లు ఆయా రాష్ట్రాల అభ్యర్థులకే(15 శాతం అన్ రిజర్వుడు, 85 శాతం లోకల్) చెందేలా ఇరు రాష్ట్రాల ఒప్పందం మేరకు ఈ నెల 15న జీవో జారీ అయింది.
దీని ప్రకారం ఈ సీట్లకు సంబంధించి తయారు చేసిన సీట్ మ్యాట్రిక్స్‌ను 2 రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం కోసం హెల్త్ వర్సిటీ అధికారులు పంపగా, తర్జనభర్జనల మధ్య మంగళవారం మధ్యాహ్నానికి ఆమోదం పొందింది. దీంతో కౌన్సెలింగ్‌కు పరిశీలకులుగా వ్యవహరించిన ఇరు రాష్ట్రాల డీఎంఈలు డాక్టర్ పుట్టా శ్రీనివాసరావు, డాక్టర్ శాంతారామ్ హైదరాబాద్ నుంచి సాయంత్రానికి హుటాహుటిన విజయవాడకు చేరుకున్నారు. రాత్రి 7 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభించారు. తొలి సీటును టాప్ ర్యాంకర్ డాక్టర్ అమన్‌చంద్ర ఎంసీహెచ్ (యూరాలజీ) ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఆన్‌రిజర్వుడు కోటాలో తీసుకున్నారు. హెల్త్ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ టి. రవిరాజు, తెలంగాణ డీఎంఈ, ఏపీ డీఎంఈల చేతులు మీదుగా అడ్మిషన్ ప్రతాన్ని అమన్‌చంద్రకు అందజేశారు. కార్డియాలజీలో 11 సీట్లు, న్యూరాలజీలో 11 సీట్లు, న్యూరో సర్జరీలో 18 సీట్లు, కార్డియోథొరాసిక్‌లో 7 సీట్లు, యూరాలజీలో 13 సీట్లు, నెఫ్రాలజీలో 10 సీట్లు, సర్జికల్ అంకాలజీలో 3 సీట్లు, మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో 11 సీట్లు, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ 2 సీట్లు, నియోనాటాలజీలో 2 సీట్లు, ఎండోక్రైనాలజీలో 6 సీట్లు, పీడియాట్రిక్ సర్జరీలో 13 సీట్లు, ప్లాస్టిక్ సర్జరీలో 14 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
సూపర్ స్పెషాలిటీ వైద్య కౌన్సెలింగ్ ప్రారంభం
Published Wed, Sep 17 2014 12:27 AM | Last Updated on Tue, Oct 9 2018 6:57 PM
Advertisement
Advertisement