ప్రింటింగ్ ప్రెస్లోనే మెడికల్ పిజి ఎంట్రన్స్ పేపర్ లీక్
హైదరాబాద్: ప్రింటింగ్ ప్రెస్ నుంచే మెడికల్ పిజి ఎంట్రన్స్ పేపర్ లీక్ అయినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మెడికల్ పిజి అడ్మిషన్లలో జరిగిన అక్రమాలపై సిఐడి అధికారులు విచారణ పూర్తి చేశారు. నివేదికను సీఐడీ చీఫ్ టి.కృష్ణప్రసాద్ ఈ రోజు గవర్నర్ నరసింహన్కు సమర్పించారు. దర్యాప్తు వివరాలను ఆయన గవర్నర్కు వివరించారు.
సిఐడి అధికారులు 16 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకొని విచారించారు. వారు చెప్పిన వివరాల ఆధారంగా వారు విచారణ మొదలుపెట్టారు. ప్రశ్నాపత్రాలు ప్రింట్ చేసిన మంగళూరులోని ప్రెస్ నుంచే లీక్ అయినట్లు తెలుస్తోంది. ఆ ప్రింటింగ్ ప్రెస్ యజమానిని, ఒక ప్రొఫెసర్ కూతురుని కూడా సిఐడి అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
మెడికల్ పీజీ ప్రవేశ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని జూనియర్ డాక్టర్లు చేసిన ఫిర్యాదుపై విచారించేందుకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్ రెడ్డి చైర్మన్గా విచారణ కమిటీ ఏర్పడింది. మెడికల్ పిజి ఎంట్రన్స్లో అవకతవకలు జరిగాయని, అయితే ఓఎంఆర్ షీట్ లేదా పరీక్షల హాల్లోగాని ఎటువంటి కుట్రా జరగలేదని విచారణ కమిటీ తేల్చింది. పరీక్షకు ముందే పేపర్ లీక్ అయినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. విచారణ పూర్తి అయిన తరువాత కమిటీ చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి గవర్నర్కు నివేదిక సమర్పించారు. ఆ తరువాత జరిగిన అవకతవకలపై విచారణకు గవర్నర్ నరసింహన్ సీబీసీఐడీని ఆదేశించారు. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కూడా ఆయన ఆదేశించారు. సిఐడి అధికారులు ఆరు బృందాలుగా ఏర్పడి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.బాబూలాల్, యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ డి.విజయకుమార్‌లను సుదీర్ఘంగా విచారించారు.
విచారణ పూర్తి చేసి ఈ రోజు గవర్నర్కు నివేదిక అందజేశారు.